సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు నో
- హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
- ‘వారసత్వ పథకం’ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16కు విరుద్ధం
- బొగ్గుగని కార్మిక సంఘం, సింగరేణి కాలరీస్ పిటిషన్ల కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: సింగరేణి కాలరీస్‌లో వారసత్వ ఉద్యోగాల భర్తీ కుదరదన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. వారసత్వ ఉద్యోగాల భర్తీ కోసం సింగరేణి కాలరీస్ జారీ చేసిన ప్రకటనను సవాలు చేస్తూ గోదావరిఖనికి చెందిన నిరుద్యోగి కె.సతీశ్‌కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వారసత్వ ఉద్యోగాలు రాజ్యాంగ విరుద్ధమని తీర్పు వెలువరించింది. దీన్ని సవాలు చేస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, సింగరేణి కాలరీస్ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశాయి.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్.ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్లను విచారించింది. బొగ్గు గని కార్మిక సంఘం తరపున సీనియర్ న్యాయవాది పి.పి.రావు, సింగరేణి కాలరీస్ తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, రంజిత్‌కుమార్ వాదనలు వినిపించారు. సింగరేణి సంస్థ తన ఉద్యోగుల వారసులకు ఇవ్వాలనుకున్న ఉద్యోగాలు కారుణ్య నియామకాల కోవలోనివేనని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ పథకం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16లకు విరుద్ధంగా ఉందన్న హైకోర్టు తీర్పుతో తాము ఏకీభవిస్తున్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులోని పాయింట్ నంబర్ 16, 20లతో ఏకీభవిస్తున్నట్టు పేర్కొంది.
వారసత్వ నియామకం కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగి.. వైద్యపరంగా ఉద్యోగంలో కొనసాగేందుకు తగని వ్యక్తి అయితే పదవీ విరమణకు రెండేళ్ల ముందు వరకు.. అంటే 58 ఏళ్ల వరకు ఉద్యోగంలో కొనసాగించాల్సి ఉంటుందన్న నిబంధనను హైకోర్టు ఇప్పటికే తప్పు పట్టింది. ఎవరికైతే ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారో ఆ వ్యక్తి కూడా వైద్యపరంగా ఉద్యోగిగా కొనసాగేందుకు తగని వ్యక్తి అయితే పదవీ విరమణ చేయగోరే వ్యక్తి 60 ఏళ్ల వరకు పనిచేయాల్సి ఉంటుందన్న నిబంధన కూడా సరికాదని స్పష్టంచేసింది. వైద్యపరంగా ఉద్యోగంలో కొనసాగేందుకు తగని వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకే ఈ పథకం తీసుకొచ్చినట్టు స్పష్టమవుతోందని విచారణ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. వైద్యపరంగా ఉద్యోగి అశక్తుడు కావడం వల్ల నిరుద్యోగం వచ్చినప్పుడు, ఆ నిరుద్యోగం కారణంగా కుటుంబానికి ఆ వ్యక్తి భారమైనప్పుడే వారసత్వ ఉద్యోగం ఇవ్వాలని సుప్రీంకోర్టు గత తీర్పుల్లో చెప్పినట్టు పేర్కొంది. కానీ ప్రస్తుత పథకంలో ఇలాంటి అంశమేదీ లేదని, అందువల్ల ఆర్టికల్ 14, 16లకు ఇది విరుద్ధమవుతుందని స్పష్టంచేసింది. ఈ అంశాలతో సుప్రీంకోర్టు ఏకీభవిస్తూ రెండు పిటిషన్లను తోసిపుచ్చింది.