కనీస వేతనాలు ఇవ్వాల్సిందే!
- కేంద్రం నిర్దేశించిన మేర చెల్లించాలంటూ
- సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఆందోళన
- 7 గంటల పాటు కేంద్ర కార్మిక శాఖ అధికారుల నిర్బంధం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తమకు కనీస వేతనాలు చెల్లించాలంటూ సింగరేణి కాంట్రాక్టు కార్మికులు సోమవారం కేంద్ర కార్మిక శాఖ, సింగరేణి బొగ్గు గనుల సంస్థల ఉన్నతాధికారులను నిర్బంధించారు. సుమారు ఏడు గంటల పాటు నిర్బంధించి ఆందోళన చేశారు. చివరికి ఈనెల 31లోగా కనీస వేతనాలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మిక శాఖ ఉన్నతాధికారులు రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
పెద్ద సంఖ్యలో కార్మికులతో..
కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల నిర్వహణపై సోమవారం హైదరాబాద్‌లోని అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఏటీఐ)లో సన్నాహక సమావేశం జరిగింది. సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ (పర్సనల్ విభాగం) అనిల్‌కుమార్, కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్లు లక్ష్మయ్య, బి.శ్రీనుతో పాటు 15 సింగరేణి కార్మిక సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభంకాగా.. కొద్దిసేపటికే సింగరేణి కాంట్రాక్టు కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులు సమావేశ మందిరంలోకి చొచ్చుకువచ్చారు.
కేంద్ర కార్మిక శాఖ గత జనవరి 19న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. తమ రోజువారీ కనీస వేతనాన్ని రూ.319 నుంచి రూ.359కు పెంచాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పష్టమైన ప్రకటన చేసేదాకా, రాతపూర్వకంగా హామీ ఇచ్చేదాకా కదిలేది లేదంటూ బైఠాయించారు. గత మార్చిలో 9 రోజుల పాటు కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేయడంతో ఆయా డిమాండ్లను నెరవేరుస్తామని సింగరేణి యాజమాన్యం హామీ ఇచ్చిందని... కానీ తర్వాత పట్టించుకోవడం లేదని జేఏసీ నేతలు మండిపడ్డారు.
ససేమిరా అన్న సింగరేణి యాజమాన్యం
కాంట్రాక్టు కార్మికుల ఆందోళన నేపథ్యంలో.. సింగరేణి సంస్థ అధికారులు, జేఏసీ నేతలతో కేంద్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ ఎ.గోవర్ధన్, కేంద్ర కార్మిక శాఖ అధికారులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ నిర్దేశించిన ప్రకారమే గత 40 ఏళ్లుగా కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు చెల్లిస్తున్నామని సింగరేణి యాజమాన్యం తరఫున సంస్థ అధికారులు స్పష్టం చేశారు. దీంతో కార్మికులు ఆందోళన మరింత ఉధృతం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక శాఖలు నిర్దేశించిన కనీస వేతనాల్లో ఏది ఎక్కువగా ఉంటే దానినే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉందని స్పష్టం చేశారు.
కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్ చెల్లించాలని కోరారు. చివరికి ఈ నెల 31వ తేదీలోగా కేంద్రం నిర్దేశించిన కనీస వేతనాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర అధికారులు ఎ.గోవర్ధన్, శ్యాంసుందర్‌లు రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో కాంట్రాక్టు కార్మికులు ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో జేఏసీ నేతలు బి.మధు (సీఐటీయూ), పులి రాజిరెడ్డి(బీఎంఎస్), శంకర్, వెంకన్న (ఐఎఫ్‌టీయూ) తదితరులు పాల్గొన్నారు.