సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే  | Equal pay for equal work | Sakshi
Sakshi News home page

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే 

Published Tue, May 11 2021 4:52 AM | Last Updated on Tue, May 11 2021 4:52 AM

Equal pay for equal work - Sakshi

సాక్షి, అమరావతి: రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా కనీస వేతనం చెల్లించాల్సిందేనని హైకోర్టు తీర్పు చెప్పింది. సమాన పనికి కనీస వేతనం కూడా చెల్లించకపోవడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని, రాజ్యాంగంలోని అధికరణ 14 ప్రకారం వివక్ష చూపడమేనని పేర్కొంది. గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) పరిధిలో బాల్వాడీ టీచర్లుగా పనిచేస్తున్న వారికి కనీస వేతనం చెల్లించాలని పురపాలకశాఖ అధికారులను ఆదేశించింది. అయితే తమ సర్వీసులను క్రమబద్ధీకరించేలా ఆదేశాలివ్వాలన్న బాల్వాడీ టీచర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు చెప్పారు.

జీవీఎంసీ పరిధిలో బాల్వాడీ టీచర్లుగా పనిచేస్తున్న తాము రెగ్యులర్‌ టీచర్లతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నా తమకు కనీస వేతనాలు చెల్లించడంగానీ, తమ సర్వీసులను క్రమబద్ధీకరించడంగానీ చేయడం లేదంటూ జానపరెడ్డి సూర్యనారాయణ, మరో 49 మంది హైకోర్టులో గత ఏడాది పిటిషన్‌ దాఖలు చేశారు. మొదట్లో నెలకు రూ.375 వేతనం ఇచ్చేవారని, తరువాత దాన్ని రూ.1,300కు, 2016లో రూ.3,700కు పెంచారని పిటిషనర్ల న్యాయవాది తెలిపారు. మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేసే వారికి కనీస వేతనం రూ.6,700గా నిర్ణయిస్తూ ప్రభుత్వం 2011లో జీవో ఇచ్చిందని పేర్కొన్నారు.

ఆ జీవో ప్రకారం కనీస వేతనం చెల్లించాలని మునిసిపల్‌ స్టాండింగ్‌ కమిటీ తీర్మానం చేసినా, జీవీఎంసీ అమలు చేయలేదని తెలిపారు. పిటిషనర్లు ఔట్‌సోర్స్‌ పద్ధతిలో ఓ ఏజెన్సీ ద్వారా నియమితులయ్యారని, అందువల్ల వారు సర్వీసు క్రమబద్ధీకరణకు అర్హులు కాదని జీవీఎంసీ న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ సత్యనారాయణమూర్తి.. పిటిషనర్లు రెగ్యులర్‌ ఉద్యోగుల్లాగే 8 గంటలు పనిచేస్తున్నప్పుడు వారితో సమానంగా వేతనం పొందేందుకు అర్హులని తీర్పు చెప్పారు. వారికి కనీస వేతనాన్ని వర్తింపజేయాలని పురపాలకశాఖను ఆదేశించారు. పిటిషనర్లు ఎన్‌ఎంఆర్‌లుగా, రోజూవారీ వేతనాలు పొందేవారిగా నియమితులు కాలేదని, ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ఔట్‌సోర్స్‌ పద్ధతిలో నియమితులయ్యారని, సర్వీసు క్రమబద్ధీకరణ కోరజాలరని తీర్పులో పేర్కొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement