తోక జాడిస్తే కత్తిరిస్తా : చంద్రబాబు | CM Chandrababu Naidu Serious Warning to Nayi Brahmins | Sakshi
Sakshi News home page

తోక జాడిస్తే కత్తిరిస్తా..

Published Tue, Jun 19 2018 3:10 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

CM Chandrababu Naidu Serious Warning to Nayi Brahmins - Sakshi

క్షురకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి వైపు దూసుకెళ్తున్న సీఎం, సమస్యలు విన్నవించేందుకు వచ్చిన క్షురకులను బెదిరిస్తూ వేలు చూపిస్తున్న సీఎం చంద్రబాబు

సాక్షి, అమరావతి: ‘ఇయ్యమయ్యా... కనీస వేతనాలు ఇవ్వమని చెబుతున్నా. ఇవ్వం... మళ్లీ మళ్లీ చెబుతున్నా.. తోక జాడిస్తే కట్‌ చేస్తా. బీ కేర్‌పుల్‌. ఇంకొకసారి తోక తిప్పండి చెబుతా మీ కథ’.. ‘సచివాలయానికి వచ్చి ఇష్ట్రపకారం చేస్తారా? ఇంకోసారి చేస్తే గుళ్లలోకి కూడా రారు. బీ కేర్‌పుల్‌’.. ‘ఆర్గ్యుమెంట్స్‌ లేవు. కనీస వేతనాలు ఇవ్వం. నో నో.. ఏం చేస్తారో చేయండి. ఇంకోసారి మాట్లాడితే మర్యాద కాదు..’ ‘ఏ వూరు మీది..? మీదే ఊరు..? తెలుసా మీకు.. తొమ్మిదేళ్లు పాలించా.. బెదిరిస్తే తోక కట్‌ చేస్తా’ ‘పిచ్చాటలాడితే మాత్రం.. చాలా సీరియస్‌గా ఉంటది’ ‘ఏం తమాషాలాడుతున్నారా...’

ఆలయ కేశఖండనశాలలో పనిచేసే క్షురకులపై సీఎం చంద్రబాబు వీరావేశంతో ఊగిపోతూ మాట్లాడిన మాటలు ఇవన్నీ. తమను కాంట్రాక్టు ఉద్యోగులుగానైనా గుర్తించి కనీస వేతనాలు చెల్లించాలని కోరిన వారిపై సీఎం తీవ్రస్థాయిలో మండిపడి వేలు చూపిస్తూ హెచ్చరికలు చేయటంతో నిర్ఘాంతపోయారు. 

సంఘాలతో సర్కారు చర్చలు విఫలం
ఆలయ కేశఖండనశాలల్లో క్షురకుల విధుల బహిష్కరణతో గత నాలుగు రోజులుగా తలనీలాల సమర్పణ నిలిచిపోయిన సంగతి పాఠకులకు విదితమే. విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న క్షురక జేఏసీ ప్రతినిధులు, నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. సోమవారం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో దేవదాయ శాఖ ఉన్నతాధికారులు క్షురక ఉద్యోగ ప్రతినిధులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కనీస వేతనాలైనా చెల్లించాలని ప్రతినిధులు పట్టగా అది కూడా కుదరంటూ కేఈ కృష్ణమూర్తి తేల్చి చెప్పడంతో వారంతా చర్చలను బహిష్కరించారు. 

ఎంతిచ్చినా జీతంగానే ఇవ్వాలన్న ప్రతినిధులు
నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతుండగా అదే సమయంలో సీఎం చంద్రబాబు అక్కడ ఆగారు. ఆలయాల్లో పనిచేసే క్షురకులకు కనీస వేతనాలు ఇవ్వాలని నినాదాలు చేయటంతో.. భక్తుల ఒక్కొక్క గుండుకు రూ.25 చొప్పున చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరిస్తున్నట్లు చంద్రబాబు వారితో చెప్పారు. అయితే ఒక్కొక్క గుండుకు రూ.50 చొప్పున ఇచ్చినా కూడా తమకు వద్దని, ఎంత ఇచ్చినా జీతం రూపంలోనే ఇవ్వాలని వారు ముఖ్యమంత్రిని అభ్యర్థించారు.

హామీని గుర్తు చేయగానే బాబులో ఆవేశం...
‘ఏం చేసినా కనీస వేతనాలు ఇవ్వడం కుదరదు. ఏం చేసుకుంటారో చేసుకోండని’ చంద్రబాబు ఆవేశంగా వ్యాఖ్యానించారు. ‘‘అయ్యా, మేం ఏ రోజైనా రోడ్డు మీదకొచ్చిన వాళ్లం కాదు. ఎన్నికలప్పుడు మీరే హామీ ఇచ్చారు. మీ మ్యానిఫెస్టోలో కూడా పెట్టారు. దేవస్థానాల్లో క్షురక ఉద్యోగాలను నాయీ బ్రాహ్మణులతో భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏళ్ల తరబడి ఆ పనిచేస్తున్న మాకు కనీస వేతనాలు ఇవ్వమని అడుగుతున్నాం’ అంటూ నాయీ బ్రాహ్మణుల సంఘం ప్రతినిధులు విన్నవించటంతో చంద్రబాబులో ఆవేశం కట్టలు తెంచుకుంది. ‘‘అరుస్తారా.. ఏమన్నా ఫిష్‌ మార్కెటా ఇది (సచివాలయం)..? ఏం తమాషాలాడుతున్నారా?’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు. తాము అరవడం లేదంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు వినలేదు. ‘అరవలేదా.. మీరు తమాషాలాడుతున్నారు’ అని చిందులు తొక్కారు.

ముందు విధుల్లో చేరండి... తర్వాతే ఏదైనా
అనంతరం చంద్రబాబు వారికి హెచ్చరికలు చేస్తూ, వేలు చూపిస్తూ.. ‘ఏయ్, వినయ్యా విను.. నీకు కుటుంబం ఉండొచ్చయ్యా.. ఏమి మాట్లాడతావు (కోపంగా) ఏం తమాషాలు ఆడుతున్నావు నువ్వు?’ అంటూ ఒక ప్రతినిధిపై విరుచుకుపడ్డారు. దేవాలయంలో పనిచేసే వారు ఇలా ప్రవర్తించడం మంచిది కాదన్నారు. కనీస వేతనాలు ఇవ్వడం కుదరని పలుమార్లు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి.. ‘ముందు మీరు విధుల్లో చేరండి. తర్వాత ఏదైనా మాట్లాడదాం’ అంటూ ఆవేశంగా తన కారు వద్దకు వెళ్లిపోయారు. 

రూ.25 చొప్పున చెల్లించేందుకు ముందుకొచ్చిన సర్కారు
పలు దేవాలయాల్లో ప్రస్తుతం రూ.10 – రూ. 20 మధ్య ఉన్న తలనీలాల టిక్కెట్‌ ధరను అన్ని ఆలయాల్లో రూ.25కు పెంచి ఆ మొత్తాన్ని విధుల్లో పాల్గొనే క్షురకులకు చెల్లించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో చర్చల అనంతరం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. దేవాలయాల్లోని ప్రతి శిరోముండనానికి ప్రస్తుతం క్షురకులకు చెల్లిస్తున్న 13 రూపాయలను 25 రూపాయలకు పెంచుతామన్నారు. శిరోముండనం కోసం భక్తులు చెల్లించే టిక్కెట్‌ ధర పెంచే ఆలోచన లేదన్నారు. పెంపు వల్ల పడే అదనపు వ్యయాన్ని సంబంధిత దేవాలయమే భరిస్తుందన్నారు. భక్తులకు ఇబ్బంది కలిగించవద్దని, ఆందోళనను విరమించాలని కోరారు.  

బాబుకు తగిన బుద్ధి చెబుతాం
నాయీ బ్రాహ్మణ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీనంద 
సీఎం స్థానంలో ఉన్న వ్యక్తే రౌడీలాగా మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని కించపరిచి, మనోధైర్యాన్ని దెబ్బతీశారని నాయీ బ్రాహ్మణ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఇంటూరి బాబ్జీనంద అన్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వెళితే సానుకూలంగా స్పందిచకపోగా, తమపైనే ఆయన బెదిరించి, భయపెట్టే ధోరణిలో మాట్లాడారని చెప్పారు. అన్ని బీసీ కులాలతో పాటు నాయీ బ్రాహ్మణులు గత ఎన్నికల్లో టీడీపీ విజయానికి పనిచేశారని, వచ్చే ఎన్నికల్లో నాయీ బ్రాహ్మణుల సత్తా ఏంటో చూపిస్తామన్నారు.

సాయంత్రం శివాలు....రాత్రి బుజ్జగింపు!
ఆలయ కేశఖండనశాలల్లో పనిచేసే క్షురకుల జేఏసీ ప్రతినిధులపై సోమవారం సాయంత్రం సచివాలయంలో తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అనంతరం రాత్రి వారిని మళ్లీ చర్చల కోసం తన ఇంటికి ఆహ్వానించారు. ప్రతి ఆలయంలో పనిచేసే ఇద్దరేసి చొప్పున ప్రతినిధులను చర్చలకు పిలిచారు. ఈనెల 25వ తేదీన ఈ అంశంపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుందామని జేఏసీ ప్రతినిధులకు చెప్పారు. దేవదాయశాఖ కమిషనర్‌ అనురాధ ప్రస్తుతం సెలవులో ఉన్నారని, ఆమె తిరిగి విధుల్లో చేరాక అన్ని విషయాలపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యమంత్రి హామీ మేరకు మంగళవారం నుంచి అన్ని ఆలయాల్లోని కేశఖండనశాలల్లో విధులకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు క్షురకుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గుంటుపల్లి రాందాసు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement