కనీస వేతనం పెంచినా.. | Madabhushi Sridhar article on minimum wages act | Sakshi
Sakshi News home page

కనీస వేతనం పెంచినా..

Dec 29 2017 1:51 AM | Updated on Dec 29 2017 1:51 AM

Madabhushi Sridhar article on minimum wages act - Sakshi

లక్షలాది మంది కార్మికులను నియమించే అతి పెద్ద యజమాని రైల్వే శాఖే కనీస వేతనాల చట్టాన్ని ఉల్లంఘిస్తే, ఇతర ప్రభుత్వ శాఖలను, ప్రైవేటు యజమానులను దాన్ని అమలు చేయమని ఏ విధంగా శాసిస్తారు?

ఊడ్వడం, పరిశుభ్రం చేయడం వంటి పనులను చేస్తున్న కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం 19 జనవరి 2017న నిర్ణయం తీసుకున్నది. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖ ఈ ఉత్తర్వును బహిర్గతం చేసిందా, ప్రజలకు దాన్ని ఎలా తెలియజేశారు, విస్తృత ప్రచారం కల్పించారా, లేకపోతే అందుకు కారణాలు తెలియజేయండి. ఈ ఉత్తర్వులను అమ లుచేస్తే ఆ వివరాలను లేదా అమలు చేయకపోతే కారణాలను తెలపమని యశ్‌కుమార్‌ సమాచార హక్కు దరఖాస్తును పెట్టుకున్నారు. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ 19.1.2017న కనీస వేతనాలు పెంచుతున్నట్టు, గరిష్టంగా రోజుకు రూ. 523కు పెంచినట్టు అసాధారణ రాజపత్ర ముద్రణ ద్వారా ప్రకటనను ప్రచురించారని తెలిపారు.

ఆగస్టు 7, 2008 ప్రకటన ప్రకారం వీరి కనీస వేతనం రూ. 374. రోజుకు రూ. 523 కనీస వేతనం ఇవ్వాలని కొత్త నోటిఫికేషన్‌ తెలుపుతున్నది. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉద్యోగులకు, కాంట్రాక్టు ద్వారా నియమితులైన ఉద్యో్గగులకు కూడా పెరిగిన వేతనా లను అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ప్రకట నకు ముందు ప్రచారం చేశామని చెబుతున్నారే తప్ప, తుది ప్రకటన తరువాత పెంచిన కనీస వేత నాల గురించి తగినంత ప్రచారం ఎందుకు చేయలే దని ప్రశ్నించారు. చాలా మంది కాంట్రాక్టర్లు పెంచిన జీతాలు ఇవ్వడం లేదని, తద్వారా కనీస వేతనాల చట్టాన్ని ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలే ప్రతిరోజూ భంగపరుస్తున్నాయనీ విమర్శించారు.
 
భారత రైల్వేలనే ఇందుకు ఉదాహరణగా చూపారు. లక్షల మంది ఊడ్చేవారు, కడిగేవారు రైల్వేలో పనిచేస్తున్నా, వారికి రూ. 523కు బదులు ఇంకా రూ. 374ల రోజుకూలీనే చెల్లిస్తున్నారు. 40 శాతం పెరిగిన జీతం ఇవ్వాలంటే హఠాత్తుగా పెరిగే ఖర్చులకు నష్టపరిహారం ఎవరిస్తారని కాంట్రాక్టర్లు అడుగుతున్నారు. ఒప్పందంలో డీఏ ఆధారంగా పెరిగే జీతాలు చెల్లించడంవల్ల అదనపు ఖర్చును భరించేందుకు ఒక షరతును చేర్చారు. కానీ అసా ధారణ నోటిఫికేషన్‌ ద్వారా కనీస వేతనాలను గణనీయంగా పెంచినప్పుడు పడే అదనపు భారాన్ని తామే మోయాలని చెప్పే ఏవిధమైన క్లాజూ కాంట్రాక్ట్‌లో లేదని రైల్వే వాదిస్తున్నది. 40 శాతం పెంపును భరించేంత డబ్బు తమ వద్ద లేవని ఈ ఉద్యోగుల గుత్తేదారులు అంటున్నారు. వారు రైల్వేల కోసమే నియమితులైనారు కనుక వారికి పెరిగిన జీతం ఇవ్వవలసిన బాధ్యత భారం రైల్వేనే భరించాలని వారు కోరారు. ఇది ఆర్థిక భారాన్ని మోపే నిర్ణయం కనుక బోర్డు సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని రైల్వే బోర్డు వాదిస్తున్నది.

రైల్వేలో ఊడ్చే సిబ్బంది, పరిశుభ్రం చేసే పని వారు కొన్ని వేల మంది ఉంటారు. ఔట్‌ సోర్సింగ్‌ ద్వారానే 80 శాతం మందిని నియమిస్తారు. వారికి కనీస వేతనం చెల్లించడం యజమానుల బాధ్యత. యజమాని అంటే కాంట్రాక్టరు లేదా రైల్వే యాజ మాన్యం కూడా అవుతుంది. రైల్వే పాలకులను ప్రధాన నియామకులుగా చట్టం భావిస్తుంది. నౌక ర్లకు జీతాలు ఇచ్చే బాధ్యత చట్టప్రకారం ప్రధాన నియామకులదే. రైల్వే బోర్డు ఒకవేళ పెంచిన జీతా లకు అంగీకరించినా మరొక గొడవ ఉంది. అదే మంటే బోర్డు అంగీకరించిన తేదీ నుంచి కార్మికు లకు పెంచిన జీతం ఇస్తారు. అంతే. కానీ జనవరి 19 నుంచి అమలు చేయవలసిన పెంపును ఎవరి స్తారు? అనే ప్రశ్న మిగిలిపోతున్నది. ఎవరూ ఇవ్వక పోతే, కనీస వేతనాల చట్టం కింద పెంచిన జీతం ఇవ్వకపోవడం చట్ట ఉల్లంఘనే అవుతుంది. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? వెనుక తేదీ నుంచి అంటే జనవరి 19 నుంచి కార్మికులందరికీ పెంచిన జీతాలు ఇవ్వాలని తీర్మానించడం రెల్వే బోర్డు బాధ్యత.  కాని వారు ఏవో కుంటి సాకులతో దీన్ని ఒక కోర్టు తగాదా కింద మార్చే ప్రయత్నాలు చేస్తు న్నారని, అసలు కారణం వ్యత్యాస వేతన భారాన్ని తప్పించుకోవడమే అని దరఖాస్తుదారుని విమర్శ.

కేంద్ర ప్రభుత్వం, కార్మిక మంత్రిత్వ శాఖ చొరవ తీసుకుని రైల్వేబోర్డుకు తగిన ఆదేశాలు జారీ చేయవలసి ఉన్నా, ఆ పని చేయడం లేదని ఆరో పణ. కనుక దీనిపై తగిన సమాధానాన్ని ఇచ్చి, ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తారో, జీతాల పెంపు ఉత్తర్వులను ఏ విధంగా అమలు చేస్తారో తెలియజేయాలని ఆయన అంటున్నారు.

లక్షలాది మంది కార్మికులను నియమించే అతి పెద్ద యజమాని రైల్వే శాఖే ఈ విధంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే, ఇతర ప్రభుత్వ శాఖలను, ప్రైవేటు యజమానులను ఏ విధంగా శాసిస్తారు? ఈ సమ స్యను ఏ విధంగా పరిష్కరిస్తారో తెలియజేయాలని చీఫ్‌ లేబర్‌ కమిషనర్, రైల్వే బోర్డు చైర్మన్, రైల్వే మంత్రిత్వశాఖ, కేంద్ర కార్మికశాఖలను సమాచార కమిషన్‌ ఆదేశించింది. (యశ్‌కుమార్‌ వర్సెస్‌ కార్మిక మంత్రిత్వ శాఖ పీఐఓ కేసు CIC/MLABE/A/ 2017/606546లో నవంబర్‌ 30న సీఐసీ ఇచ్చిన ఆదేశం ఆధారంగా).

మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement