విశ్లేషణ
ఈ బహుమతులు ఎవరికి ఇచ్చారో చెప్పడం లేదని, ఈ దాపరికాన్ని బట్టి ఈ సంస్థలో అవినీతి ఉందని అనుమానించవలసి వస్తున్నదని దరఖాస్తుదారు తరఫున ప్రతినిధి శ్రీముకుల్ జైన్ వివరించారు.
ఢిల్లీలో నివాసగృహాలు, పట్టణాభివృద్ధి సంస్థ వారు కొన్న ఖరీదైన కానుకల వివరాలు (ఏమిటి, ఎక్కడ కొన్నారు, ఎవరికి ఇచ్చారు, వాటికి సంబంధించిన) ఓచర్లు, రసీదులు కావాలని, చైర్మన్– మేనేజింగ్ డైరెక్టర్ నివాసగృహానికి చేసిన మరమ్మతులు, అక్కడ నియమించిన ఇద్దరు ఉద్యోగుల వివరాలు కావాలని ఆర్టీఐ కింద విశ్వాస్ భంబూర్కర్ కోరారు. తమరు ఈ దేశపౌరులో కాదో నిరూపించేందుకు ఆధార్ కార్డ్ గానీ, ఓటర్ ఐడీ గానీ, లేదా పాస్‌పోర్టు గానీ చూపాలని సీపీఐఓ లేఖ రాశారు. సమాచారం ఇచ్చేదీ లేనిదీ 30 రోజు లైనా చెప్పలేదు. ఆర్టీఐ చట్టం కింద రెండు సందర్భాలలో దరఖాస్తుదారుడు రావచ్చు. ఒకటి సమాచారం ఇవ్వడంలో అన్యాయం జరిగిందనుకుంటే మొదటి అప్పీలు దాఖలు చేయాలి. అక్కడ కూడా సమాచారం దొరకకపోతే రెండో అప్పీలును సమాచార కమిషన్‌కు సమర్పించాలి. ఒకవేళ అడిగిన సమాచారం గురించి ఏమీ చెప్పకపోయినా, దరఖాస్తును ఏదోరకంగా అడ్డుకోవడానికి ప్రయత్నించినా వెంటనే దరఖాస్తుదారు కమిషన్‌కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.
ఇక్కడ మొదటి అప్పీలుతో పనిలేదు. అయితే ఫిర్యాదులో పీఐఓ తప్పు చేశాడని నిరూపించి జరిమానా విధించాలని కోరడానికి వీలుంది. కాని ఫిర్యాదులో సమాచారం అడగడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఒక తీర్పులో వివరించింది. సెక్షన్లు 18, 19, 20లకు కలిపి చదివితే సమాచారం కూడా ఇవ్వ చ్చని అర్థం వస్తుంది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. అందువల్ల దరఖాస్తుదారు పీఐఓ తప్పు నిరూపించడానికి మాత్రమే ఫిర్యాదు దాఖలు చేసి, సమాచారం కోసం మొదటి అప్పీలు వేసి, అక్కడా సమాచారం దొరకకపోతే రెండో అప్పీలు వేసుకోవాలి. నిజానికి పీఐఓ సక్రమంగా వ్యవహరిస్తే ఈ బాధలేవీ ఉండవు. కమిషన్ ముందుకు అభ్యర్థిని పదేపదే రప్పించడం కంటే ఒకే కేసులో రెండూ పరిశీలించాలి. పదేపదే కోర్టుల చుట్టూ తిప్పే విధానం సరికాదనే నీతి గురించి న్యాయస్థానం చాలాసార్లు చెప్పింది. ఇక్కడ విశ్వాస్ అడిగింది సెక్షన్ 4 కింద హుడ్కో తనంతతానే చెప్పవలసిన సమాచారం. చెప్పలేదు. అడిగినా ఇవ్వడం లేదు. పైగా నీవు పౌరుడవని నిరూపించుకో అని సతాయిస్తున్నారు. ఒక ఫిర్యాదు, ఒక మొదటి అప్పీలు, తరువాత రెండో అప్పీలు వేశారు. ఫిర్యాదు, రెండో అప్పీలు విడివిడిగా కమిషన్‌కు చేరాయి.
జరిమానా ఎందుకు విధించకూడదో కారణాలు తెలపాలనే ఉత్తర్వును కమిషన్ జారీచేసింది. ఆనాటి సీపీఐఓ డాక్టర్ డి.కె. గుప్తాగారికి, ఆ తరువాత సీపీఐఓ గా పదవి నిర్వహిస్తున్న ఎస్.కె. గుప్తాగారికి కూడా కారణాలు తెలిపే ఉత్తర్వులు జారీ చేసింది. దానికి జవాబుగా డాక్టర్ డి.కె. గుప్త ఇచ్చిన వివరణలో ఆర్టీఐ కేవలం పౌరులకు మాత్రమే సమాచార హక్కు కల్పించిందని కనుక పౌరుడో కాదో తెలియకుండా సమాచారం ఇవ్వజాలమని, ముప్పయ్ రోజులలోగా తాము పౌరుడనని రుజువుచేసుకోవాలని ఉత్తరం పంపడం సమాధానమిచ్చినట్టే అని వాదించారు. అదీగాక ఆర్టీఐ దరఖాస్తు చాలా పొడుగ్గా ఉందని, నియమాల ప్రకారం 500 పదాలకు మించకూడదని అన్నారు.
ఆపిల్ ఐ పాడ్, మోంట్ బ్లాంక్ పెన్ వంటి చాలా ఖరీదైన బహుమతులు వీరు కొన్నది నిజమే అయితే అవి ఎక్కడ కొన్నారు, ఎంతకు కొన్నారని చెప్పవలసిన బాధ్యత వారిపై ఉందని, దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ బహుమతులు ఎవరికి ఇచ్చారో చెప్పడం లేదని, ఈ దాపరికాన్ని బట్టి ఈ సంస్థలో అవి నీతి ఉందని అనుమానించవలసి వస్తున్నదని దరఖాస్తుదారు తరఫున ప్రతినిధి శ్రీముకుల్ జైన్ వివరించారు. నిజానికి అడిగిన సమాచారం ఇవ్వకుండా మినహా యింపు ఏదీ వర్తించే అవకాశం లేదు. సెక్షన్ 8 గాని 9 గానీ వర్తిస్తుందని సీపీఐఓలు కూడా వాదించడం లేదు. అసలు సమాచారం ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది.
కారణాలు తెలిపే నోటీసుతో పాటు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి కొంత సమాచారం ఇచ్చారు గాని లేకపోతే అసలే సమాచారమూ ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఆధార్ కార్డు ఉండాలనడం, పాస్ పోర్టు లేకపోతే ఇవ్వబోనని చెప్పడం సమాచార హక్కు చట్టాన్ని గౌరవించడం అని పించుకోదు. నియమకాలు, నిధుల ఖర్చు రికార్డుల గురించి తమంత తాము చెప్పవలసి ఉంటే దానికి పౌరస్వత్వం ఎందుకు రుజువుచేయాలి? పేరు కూడా చెప్పకుండా సమాచారం అడిగే అవకాశం చట్టం కల్పించినప్పుడు ఈ రుజువులు కావాలని కోరే అధికారం ఈ సీపీఐఓలకు ఎక్కడినుంచి వస్తుంది? పాస్ పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ కార్డు అడగడం ద్వారా తాము సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా లేమని సీపీఐఓ డి.కె. గుప్తా నిరూపించారు. కనుక ఆయనపై కమిషన్ 25 వేల రూపాయల జరిమానా విధించింది. ఆ తరువాత సీపీఐఓను హెచ్చరించింది. (విశ్వాస్ భంబూర్కర్ వర్సెస్ హుడ్కో CIC/HUDCO/C/2017/164658 కేసులో 26.12.2017 నాటి సీఐసీ ఆదేశం ఆధారంగా).
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment