ఉద్యోగ నియామకాల్లో కుంభకోణాలకు సంబంధించి సమాచారం అడిగినవారిని, వారి కుటుంబ సభ్యులను కూడా బెదిరించడం ఆర్టీఐ ప్రా«థమిక సూత్రాలకే విరుద్ధం. దీని విచారణపై అలక్ష్యం మరింత నేరం.
కార్మికుల బీమా కార్పొరేషన్ వారు గుమస్తాలు, ఇన్‌స్పెక్టర్ల నియామకంలో ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాయడానికి డబ్బు తీసుకుని వీలు కల్పించారనే అంశంపైన, సమాచార హక్కు చట్టం కింద అనేక దరఖాస్తుల ద్వారా సమాచారం అడిగారు హరీందర్ ధింగ్రా. కొంత ఇవ్వడం, మరికొంత లేదనడం, తరువాత మొదటి అప్పీలు, ఆ తరువాత రెండో అప్పీలు, ఫిర్యాదు తంతులన్నీ జరుగుతున్నాయి. సమాచార కమిషన్ కొన్ని కేసులలో ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలలో కొన్ని అంశాలు అమలు చేస్తూ కొంత సమాచారం ఇచ్చారు. రికార్డులు లేవన్నారు. సంబంధించిన సమాచారాన్ని, దస్తావేజులు చూపాలన్నారు.
కుంభకోణాన్ని వెలికితీసి బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాడు ధింగ్రా. ఆ వ్యక్తులు శక్తులు తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారాయన. ఇంటినుంచి బయటకు నడిచి వెళ్తుంటే బెదిరించడం, మోటార్ సైకిల్‌పైన ఇద్దరు వ్యక్తులు ఇదంతా ఆపేయ్ నీకు మంచిది కాదు అంటూ హెచ్చరించి జారుకోవడం జరుగుతూ వస్తున్నది. నీ కుటుంబ సభ్యులకు కూడా సమస్యలు వస్తాయని హెచ్చరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. భద్రత కల్పించాలని సమాచార కమిషన్‌ను కోరుతూ ఒక దరఖాస్తు ఇచ్చారు. సమాచార కమిషన్ ఉత్తర్వులు అమలు కాలేదనే ఫిర్యాదును అర్జెంట్‌గా స్వీకరించాలని కోరారు.
సమాచార కమిషన్ వెంటనే పరిశీలనకు స్వీకరించింది. జనవరి 5న ఆయన ఫిర్యాదులను విచారించింది. ఆయన హరియాణా పోలీసులకు, కార్మిక మంత్రిత్వ శాఖకు, ఇఎస్‌ఐసీకి కూడా లేఖలు, వినతి పత్రాలు సమర్పించారు. డిసెంబర్ 20వ తేదీన జరిగిన రెండో అప్పీలు విచారణలో సమాచార కమిషన్ ముందు ఇఎస్‌ఐసీ సంస్థ అధికారులు తాము కొన్ని పత్రాలు ఇచ్చామని వివరించారు. సీబీఐలోని జాయింట్ డైరెక్టర్‌కు, చేతిరాత పరిశీలన నిపుణులకు కొన్ని పత్రాలను ఇవ్వాలని కోరుతూ 9 ఆగస్టు 2017న లేఖ రాసినట్టు తెలిపారు. ఆ లేఖ ప్రతిని హరీందర్ ధింగ్రాకు ఇచ్చారు. కేంద్ర ఫోరెన్సిక్ లేబొరేటరీ వారికి పరీక్షించేందుకు అనుమతి ఇస్తూ సెప్టెంబర్ 8న అడిషనల్ కమిషనర్ రాసిన లేఖ ప్రతి కూడా ఇచ్చారు. దీనికి జవాబు ఇంకా రాలేదని అధికారులు చెప్పారు.
ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాశారని దాదాపు అందరికీ తెలిసిపోయినా ఇంకా అసలు నేరస్తులెవరో పరిశోధించడంలో ఏ ప్రగతీ లేదు. సరిగ్గా దస్తావేజులను కూడా నిర్వహించలేకపోయారనీ దీంతో తేలింది. ఈ అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకున్నామని, ఇప్పుడు పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటిస్తూ వెంట వెంటనే ఫలితాలను వెబ్‌సైట్‌లో ప్రచురిస్తున్నామని, మెరిట్ ప్రకారమే నియామకాలు జరుపుతున్న విషయం అందరికీ తెలిసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు. అయితే ఇదివరకు జరిగిన అక్రమాలపైన దర్యాప్తు జరపడం కూడా ప్రధానమైన అంశం అని కమిషన్ భావించింది. కేంద్ర ఫోరెన్సిక్ లేబొరేటరీ వారు సీబీఐ కోరిన విధంగా చేతిరాత నిపుణుల సేవలను ఇవ్వాలనే విషయంలో ఏ చర్యతీసుకున్నారో తెలపాలని కమిషన్ సూచించింది. పదిహేను రోజుల్లో ప్రగతి చర్యలు వివరించాలని ఆదేశించింది. దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో వివరించాలని కూడా ఆదేశించింది.
హరీందర్ ధింగ్రా అవినీతి కుంభకోణాన్ని వెలి కితీసే సమాచార అభ్యర్థనలు చేయడం, దానిపై వెల్లడైన సమాచారం ప్రకారం ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాశారని ప్రాథమికంగా తేలడం జరి గింది కనుక బెదిరింపులు అవాస్తవాలు అనుకోవడానికి వీల్లేదు. ఇది దరఖాస్తుదారు జీవనానికి, భద్రతకు, స్వేచ్ఛకు సంబంధించిన సమాచారం కనుక 48 గంటలలోగా ఇవ్వాలని చట్టం కూడా వివరిం చింది. ఇదివరకు సీఐసీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం ద్వారా ఈ బెదిరింపులను నిరోధించవచ్చన్న వాదంలో వాస్తవం ఉందని కమిషన్ అంగీకరించింది.
ఈ ఆదేశాల వల్లనే బెదిరింపులు వస్తున్నాయని కూడా తేలింది. కమిషన్ తన ఉత్తర్వులను అమలు చేయించడానికి తీసుకోవలసిన చర్యలన్నీ తీసుకోక తప్పదు కనుక కమిషన్ ధింగ్రా భద్రతకు భరోసా ఇవ్వాలని ఇఎస్‌ఐసీ డైరెక్టర్ జనరల్ రాజ్ కుమార్‌కు సూచించింది. నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవడం ద్వారా భద్రత కల్పించాలని ఇన్సూరెన్స్ కమిషనర్ అరుణ్ కుమార్‌కి ఆదేశిం చింది. హరియాణా పోలీసు డైరెక్టర్ జనరల్ బల్ జిత్ సింగ్ సాంధు వెంటనే హరీందర్ భద్రతకు కావలసిన చర్యలు తీసుకోవాలని, ఆ వివరాలను హరీందర్ ధింగ్రాకు 48 గంటల్లో ఇవ్వాలని ఆదేశించింది. కమిషన్ 11.12.2017న ఇచ్చిన ఆదేశాలను పాటించాలని కూడా నిర్దేశించింది. (హరీం దర్ ధింగ్రా వర్సెస్ CIC/BS/A/2016/ 002028 మరో 13 కేసులలో జనవరి 5, 2018న ఇచ్చిన ఆదేశం ఆధారంగా).
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment