
విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల భిక్షాటన
కడప అగ్రికల్చర్ : విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతు చేస్తున్న నిరసన పరంపర కొనసాగుతోంది. సోమవారం కడప నగరంలోని శంకరాపురం వద్ద ఉన్న ట్రాన్స్‌కో సీఈ కార్యాలయం వద్ద భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు కార్మిక యూనియన్ జేఏసీ చైర్మన్ మల్లిఖార్జునరెడ్డి, కో చైర్మన్ శివారెడ్డి మాట్లాడుతూ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు చేయాల్సి వస్తోందని ఆరోపించారు. విద్యుత్ సంస్థలో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కనీసవేతనాలు నెలనెల ఇవ్వకుండా, పెంచకుండా వేధించడం తగదన్నారు. కార్మికులతో ఊడిగం చేయించుకుంటూ కనీస వేతనం ఇవ్వకపోవడం దారుణమన్నారు.
శాసన సభలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులు ఓ పార్టీకి చెందిన వారని చెప్పడం దుర్మార్గం కాదా అని ప్రశ్నిస్తున్నామన్నారు. మంగళవారం ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చలకు పిలుస్తున్నారని, ఆ చర్చలు సఫలీకృతమయ్యేలా చూడాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం కనుక వ్యతిరేకిస్తే పూర్తి స్థాయిలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు.
ఈ భిక్షాటనలో జేఏసీ ఉపాధ్యక్షులు గణేష్, ఈశ్వరయ్య, మురళి, సాయి సుబ్బరాయుడు,పి కిషోర్‌కుమార్‌రెడ్డి, కోశాధికారి ఏజా తదితరులు పాల్గొన్నారు.కాగా ఏడు రోజులుగా పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని బిజేపీ యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగోతు రమేష్‌నాయుడు, పార్టీ నగర అధ్యక్షుడు సానపురెడ్డి రవిశంకరరెడ్డి అన్నారు. కార్మికులు చేస్తున్న ఆందోళన శిభిరానికి వచ్చి మద్ధతు పలికారు.