
వైరలవుతున్న బెంగళూరు వ్యక్తి వీడియోలు
అతను ఒకప్పుడు జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో, ఆ తరువాత బెంగళూరులో ఓ ప్రముఖ టెక్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేశాడు. ఇప్పుడదే బెంగళూరులోని జయనగర్ వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్నాడు. మద్యానికి బానిసవడమే తన దుస్థితికి కారణమని చెబుతున్నాడు. అతను తనతో పంచుకున్న కథను శరత్ యువరాజా అనే యువకుడు ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐన్‌స్టీన్ మొదలుకుని పలువురు తత్వవేత్తల దాకా అందరి గురించీ అతను అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ధ్యానం, తత్వశాస్త్రం, సైన్స్ వంటి అంశాలపై లోతైన వ్యాఖ్యలు చ్తేస్తున్నాడు. అయితేనేం, ‘తల్లిదండ్రులను కోల్పోవడం నన్ను మద్యం మత్తులోకి నెట్టింది. అది అదుపు తప్పి ఈ గతి పట్టింది. నిరాశ్రయుడిగా మారి బతకడం కోసం భిక్షాటన చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు. ‘‘మతం కులం, ఇవన్నీ కలగలసి చివరకు నేనేమయ్యానో చూడండి.
నేనింకా చదవాలి’’ అని మరో వీడియోలో చెప్పాడు. సాయం చేయడానికి ప్రయత్నిస్తే నిరాకరించాడని శరత్ పేర్కొన్నారు. ‘‘దాంతో ఎన్జీవోలను సంప్రదించా. కానీ పోలీసుల ప్రమేయంతోనే అతన్ని మార్చడం సాధ్యమని డాక్టర్లు అంటున్నారు’’ అని చెప్పారు. వ్యసనాలకు దూరంగా ఉండటం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వృత్తిలో విజయాలు తదితరాలపై ఈ వీడియోలు ఆన్‌లైన్‌లో గట్టి చర్చకు దారి తీశాయి.