కనీస వేతనం రూ.18 వేలు నిర్ణయించాలి
కడప సెవెన్‌రోడ్స్:
కనీస వేతనాల చట్టం కింద ఉన్న షెడ్యూల్డ్ ఎంప్లాయ్‌మెంట్స్‌లో కార్మికుల కనీస వేతనం నెలకు రూ. 18 వేలుగా నిర్ణయించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం వేతనాలను సవరించాల్సి ఉంటుందన్నారు. షెడ్యూల్డ్–1లోని 65 ఎంప్లాయ్‌మెంట్స్‌కు గాను 54 ఎంప్లాయ్‌మెంట్స్‌లో వేతన సవరణ పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. 2011, 2012లో షెడ్యూల్డ్–1లోని మిగతా 11 ఎంప్లాయ్‌మెంట్స్‌కు జరిగిన వేతన సవరణల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, ఆయిల్‌మిల్లులు, పేపరు మిల్లుల కార్మికులకు వేతనాలు తగ్గించడం అన్యాయమన్నారు. స్పిన్నింగ్ మిల్లులు, గార్మెంట్స్ కార్మికులకు అతి తక్కువ వేతనాలు నిర్ణయించడం న్యాయం కాదన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటినా వేతన సవరణ పెండింగ్‌లోనే ఉందని విమర్శించారు. ఇందువల్ల కార్మికులు వేలాది కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కనీస వేతనాల సలహాబోర్డును ఏర్పాటు చేసి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బద్వేలు శ్రీను, రిమ్స్ సుబ్బయ్య, సునీల్, అన్వేష్, మున్సిపల్ వర్కర్లు, యార్డు హమాలీలు, ఆటో వర్కర్లు, ఐఎంఎల్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.