భారత ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు 30 నుండి 50 శాతం కనీస వేతనాలు (మినిమం రెఫరల్ వేజెస్) తగ్గిస్తూ గత సంవత్సరం సెప్టెంబర్ లో జారీ చేసిన రెండు సర్కులర్లను రద్దు చేయాలని, పాత వేతనాలను కొనసాగించాలని కోరుతూ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) పై బుధవారం (28.07.2021) తుది విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి. విజయసేన్ రెడ్డిల ధర్మాసనం జరిపిన విచారణకు పిటిషనర్ తరఫున న్యాయవాది బి. రచనారెడ్డి వాదనలు వినిపించారు.
ఆరు అరబ్ గల్ఫ్ దేశాలకు కొత్తగా ఉద్యోగానికి వెళ్లేవారితో సహా ప్రస్తుతం గల్ఫ్ లో పనిచేస్తున్న 88 లక్షల మంది భారతీయుల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే సర్కులర్లను రద్దు చేయాలని న్యాయవాది రచనారెడ్డి తన వాదనలు వినిపించారు. వేతనాలు తగ్గిస్తూ జారీ చేసిన సర్కులర్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని వాదించారు.
వేతనాలను తగ్గిస్తూ సెప్టెంబర్ 2020 లో జారీ చేసిన సర్కులర్లను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకున్నదని, పాత వేతనాలను కొనసాగించాలని నిర్ణయించిందని ఈమేరకు ఈనెల 15న ఉత్తర్వులను జారీ చేసిందని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ నామవరపు రాజేశ్వర్ రావు హైకోర్టుకు నివేదించారు. సమస్య పరిష్కారం అయినందున భీంరెడ్డి దాఖలు చేసిన 'పిల్' ను ముగిస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment