minimum wage for employees
-
వేతన పోరులో గెలిచిన గల్ఫ్ కార్మికులు
భారత ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు 30 నుండి 50 శాతం కనీస వేతనాలు (మినిమం రెఫరల్ వేజెస్) తగ్గిస్తూ గత సంవత్సరం సెప్టెంబర్ లో జారీ చేసిన రెండు సర్కులర్లను రద్దు చేయాలని, పాత వేతనాలను కొనసాగించాలని కోరుతూ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) పై బుధవారం (28.07.2021) తుది విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి. విజయసేన్ రెడ్డిల ధర్మాసనం జరిపిన విచారణకు పిటిషనర్ తరఫున న్యాయవాది బి. రచనారెడ్డి వాదనలు వినిపించారు. ఆరు అరబ్ గల్ఫ్ దేశాలకు కొత్తగా ఉద్యోగానికి వెళ్లేవారితో సహా ప్రస్తుతం గల్ఫ్ లో పనిచేస్తున్న 88 లక్షల మంది భారతీయుల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే సర్కులర్లను రద్దు చేయాలని న్యాయవాది రచనారెడ్డి తన వాదనలు వినిపించారు. వేతనాలు తగ్గిస్తూ జారీ చేసిన సర్కులర్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని వాదించారు. వేతనాలను తగ్గిస్తూ సెప్టెంబర్ 2020 లో జారీ చేసిన సర్కులర్లను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకున్నదని, పాత వేతనాలను కొనసాగించాలని నిర్ణయించిందని ఈమేరకు ఈనెల 15న ఉత్తర్వులను జారీ చేసిందని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ నామవరపు రాజేశ్వర్ రావు హైకోర్టుకు నివేదించారు. సమస్య పరిష్కారం అయినందున భీంరెడ్డి దాఖలు చేసిన 'పిల్' ను ముగిస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
‘కనీస వేతనాల ఖరారు బాధ్యత రాష్ట్రాలదే’
న్యూఢిల్లీ : కనీస వేతనాలను ఖరారు చేసే అధికారం ఆయా రాష్ట్రాలకు ఉండాలని పరిశ్రమ సంస్థ సీఐఐ స్పష్టం చేసింది. జాతీయ కనీస వేతనం ఉపాధి కల్పనపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో రాష్ట్రాలే కనీస వేతనాలను నిర్ణయించాలని పేర్కొంది. ఆయా ప్రాంతాలు, నైపుణ్యం, వృత్తి ప్రాతిపదికన రాష్ట్రాలు కనీస వేతనాలను ఖరారు చేయాలని, ఈ వేతనాలు కేంద్రం నిర్ణయించే కనీస వేతనాల కంటే తక్కువగా ఉండరాదని పేర్కొంది. నైపుణ్యం, పాక్షిక నైపుణ్యం కలిగిన కార్మికులకు మార్కెట్ శక్తులు వేతనాలు నిర్ధారిస్తుండగా, నైపుణ్యం లేని కార్మికులకు ప్రభుత్వమే కనీస వేతనాలు ఖరారు చేయాలని సీఐఐ సూచించింది. కాగా వేతన బిల్లుపై కోడ్‌కు క్యాబినెట్ ఆమోదం కోసం కార్మిక మంత్రిత్వ శాఖ వేచిచూస్తోంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ఆమోదింపచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే రైల్వేలు, గనుల వంటి నిర్ధిష్ట రంగాలకు కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాలను నిర్ధారిస్తుంది. ఇక మిగిలిన ఉపాధి రంగాలకు రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలను ఖరారు చేస్తాయి. మరోవైపు కేంద్రం జాతీయ కనీస వేతనాన్ని కూడా ప్రకటించనుంది. ప్రతి ఐదు సంవత్సరాలకు కనీస వేతనాలను సవరించాలని ముసాయిదా బిల్లు ప్రతిపాదించింది. ఉపాధి కల్పనను పెద్ద ఎత్తున చేపట్టేందుకు జాతీయ ఉపాధి కల్పన మిషన్‌ను నెలకొల్పాలని సీఐఐ కేంద్రానికి సూచించింది. -
ఉద్యోగుల కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలి
నగరంపాలెం(గుంటూరు) : రాష్ట్రంలో ఉద్యోగులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నెలకు కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పరుచూరి ఆశోక్ బాబు డిమాండ్ చేశారు. గుంటూరులోని ఏపీఎన్జీఓ కల్యాణమండపంలో శుక్రవారం జరిగిన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షనర్లు ఐక్యకార్యాచరణ కమిటీ ప్రాంతీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.జనవరి 2015 నాటికి ఎరియర్స్ ఉన్న 3.1144 శాతం డీఏ ను వెంటనే చెల్లించాలన్నారు. గ్రాట్యుటీ, అర్ధసెలవు క్యాష్మెంట్ను వెంటనే అమలు చేయాలన్నారు. పెన్షనర్స్‌కు 10 సంత్సరాల అదనపు పెన్షన్ చెల్లించాలన్నారు. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర జేఏసీ జనరల్ సెక్రటరీ ఐవీరావు మాట్లాడుతూ దేశంలోకి విదేశీ పెట్టుబడులు ఆహ్వానించే కారణంతో కార్మిక చట్టాలను సవరణ చేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా, ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసేలా నరేంద్రమోడీ ప్రయత్నిస్తున్నారన్నారు. సమావేశంలో పాల్గొన్న పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆధ్యక్షుడు సోమేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం అమలు చేస్తున్న కాంట్రిబ్యూషన్ విధానాన్ని రద్దుచేసి, పాత పద్ధతిలో పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎన్జీవో సంఘ ఉపాధ్యక్షుడు బాసిత్, గుంటూరు జిల్లా జేఏసీ కార్యదర్శి దయానందరాజు, ఒంగోలు జేఏసీ చైర్మన్ బండి శ్రీను, నెల్లూరు జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్, సెక్రటరీ రమణారెడ్డి, కృష్ణాజిల్లా జేఏసీ చైర్మన్ విద్యాసాగర్, మహిళల విభాగం కన్వీనర్ రోజ్‌రాణి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, పెన్షనర్స్ సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.