లైసెన్సు ముసుగులో అమాయకులైన కార్మికులను గల్ఫ్ దేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తూ మానవ అక్రమ రవాణా చేస్తున్న ఏజెన్సీపై తాను చేసిన ఫిర్యాదుపై ఏమి చర్యలు తీసుకున్నారో తెలుపాలని ఒక గల్ఫ్ బాధితుడి భార్య ఈనెల 20న సమాచార హక్కు చట్టం క్రింద జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించిన సంఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.
జగిత్యాలకు చెందిన తంగెళ్ల గంగారాం, తంగెళ్ల సత్యం అనే ఇద్దరు గల్ఫ్ ఏజెంట్లు కార్తీక్ ఇంటర్నేషనల్ అనే పేరుతో గల్ఫ్ ఉద్యోగాల రిక్రూటింగ్ ఏజెన్సీ లైసెన్సును అడ్డంపెట్టుకొని కార్మికులను విజిట్ వీసాలతో దుబాయికి పంపిస్తూ మోసానికి పాల్పడుతున్నారని జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన కొక్కెరకాని గంగజల సంవత్సర కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతూ పోరాటం చేస్తున్నది.
గల్ఫ్ ఉద్యోగ వీసా కోసం తమ వద్ద రూ.68 వేలు తీసుకొని తన భర్త కొక్కెరకాని పోశన్నను విజిట్ వీసాలో దుబాయికి పంపారని, పక్షవాతానికి గురై దుబాయి నుండి వాపస్ వచ్చిన పోశన్నకు ఒక లక్ష రూపాయల విలువైన ఆరోగ్య బీమా అందకపోవడానికి ఏజెంట్ల అక్రమదందా కారణమని గంగజల ఆరోపించారు. ఇసిఆర్ పాస్ పోర్టు కలిగిన పోశన్నకు చట్టబద్దంగా రూ.10 లక్షల విలువైన 'ప్రవాసి భారతీయ బీమా యోజన' అనే ప్రమాద బీమా పాలసీ, ఒక లక్ష రూపాయల ఆరోగ్య బీమా పొందడానికి అర్హత ఉన్నదని ఆమె అన్నారు. ఒప్పుకున్న ప్రకారం బీమా పాలసీ జారీ చేయలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment