గల్ఫ్ గాలి మేడల గాయాలు | Gulf labourers to earn more money of foreign currency | Sakshi
Sakshi News home page

గల్ఫ్ గాలి మేడల గాయాలు

Published Thu, Jun 18 2015 1:25 AM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM

గల్ఫ్ గాలి మేడల గాయాలు - Sakshi

గల్ఫ్ గాలి మేడల గాయాలు

గల్ఫ్‌లోని మన కార్మికులు  ఈ గడ్డ మీదే ఉండి పనిచేస్తున్న వారి కంటే చాలా ఎక్కువ ఆదాయాన్ని, అదీ విదేశీమారక ద్రవ్యంగా అందిస్తున్నారు. 2014లో విదేశాల్లోని భారతీయులు దాదాపు రూ. 4,48,000 కోట్లు పంపగా... అందులో అమెరికా నుండి వచ్చింది 11 శాతం కాగా, గల్ఫ్ దేశాల నుండి వచ్చింది 39 శాతం. కాబట్టి ప్రభుత్వాలు గల్ఫ్‌లోని కార్మికుల సంక్షేమం, భద్రతలను తమ బాధ్యతలుగా గుర్తించాలి. అంతేగానీ వారికేదో మేలు చేస్తున్నట్టు భావించడం సరికాదు. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలదీ పూర్తి నిర్లక్ష్య వైఖరే.
 
అతని పేరు కాటం ఉమాపతి. నిజామాబాద్ పట్టణానికి అతి సమీపంలోని నాలకల్ గ్రామం. ఆయనకు ఒక కొడుకు, ఒక కూతురు. భార్య సుజాత. వ్యవసాయ సంక్షోభం వల్ల రెండున్నర ఎకరాల వరి సేద్యం ఎన్నేళ్లు చేసినా ఏ రోజూ పంట చేతికి రాలేదు. ఏ దారీ లేక 43 ఏళ్ల వయసులో 2004లో గల్ఫ్‌కు వెళ్లి, 2009లో తిరిగివచ్చాడు. సంపాదించుకొచ్చిన డబ్బుతో వరికోత మెషిన్లు కొని కాంట్రాక్టుకి ఇచ్చాడు. అయినా ఆశించిన ఫలితం రాలేదు. దానితో మళ్ళీ గల్ఫ్‌కు వెళ్లాలని కామారెడ్డిలోని మైత్రీ ట్రావెల్స్ ఏజెంట్ శ్రీనివాస్ ఏర్పాటు చేసిన వీసాతో 2011, డిసెంబర్ 11న కువైట్‌కు వెళ్లాడు. ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఉమాపతి నుంచి ఫోన్ రాలేదు.
 
 గత ఆదివారం బహరైన్ లోని చాసో లేబర్ క్యాంప్‌లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికులను కలవగా ఉమాపతి అదృశ్యం విషయాన్ని ఆయన బావమరిది మోహన్‌రావు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా వడ్లూరుకు చెందిన ఆవు పార్వతిది మరో విషాద గాథ. భర్త వదిలేస్తే ఇద్దరు పిల్లలను పెంచిపెద్ద చేయడం, చదివించటం గగన మైన పార్వతి గల్ఫ్‌కెళితే బాగా సంపాదించొచ్చని వింది. ఏజెంట్‌కు యాభై వేలు చెల్లించి మరీ రెండేళ్ల క్రితం గంపెడాశతో కువైట్ చేరింది. పనిమనిషి పని చేస్తూ తల్లికి ప్రతినెలా పదివేల రూపాయలు పంపేది. అకస్మాత్తుగా 3 నెలల క్రితం డబ్బు రావడం ఆగిపోయింది. నెల కిందట ఫోన్ చేసి పాస్‌పోర్టు పోగొట్టుకుని, జైల్లో ఉన్నానని చెప్పిందంతే. మళ్లీ ఏ సమాచారం లేదు.
 
 లేబర్ క్యాంపులు నరక కూపాలు
 ఇలాంటి ఇబ్బందుల్లో చిక్కి, గల్ఫ్ దేశాల జైళ్లల్లో ఆరు వేల మందికిపైగా భారతీయులు మగ్గుతున్నారని లోక్‌సభలో ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిం ది. ఈ ఆరువేలలో రెండు వేల మందికిపైగా తెలుగువాళ్లు. పేదరికం, నిరుద్యోగం, తదితర కారణాలతోనూ, వ్యవసాయంలో దెబ్బతిని చావలేక బతకలేక తెలంగాణ నుండి పలువురు గంపెడాశతో గల్ఫ్‌కి వెళ్తుంటారు. మగ వాళ్లకు ఎక్కువగా లేబర్ పనులే. అక్కడి కంపెనీల యజమానుల నుంచి, ఇంటి యజమానుల నుంచి సరైన వర్క్ వీసాలు అందుకొని వెళ్లిన వాళ్లకు ఇబ్బందులు పెద్దగా ఉండవు. కానీ ఏజెంట్ల మోసంతో విజిటర్ వీసాలు, టూరిస్ట్ వీసాలు, బిజినెస్ వీసాలతో వెళ్లినవాళ్లు దొంగతనంగా బతకాల్సిం దే, దొరికితే జైలుపాలు కావాల్సిందే.
 
 అయితే, సరైన వీసాలతో లేబర్ క్యాంపుల్లో కూలిపని చేస్తున్న వాళ్ళ పరిస్థితీ అంత ఆశాజనకంగా ఏమీ లేదు. ఇక్కడ చెప్పినంత కంటే అక్కడ చాలా తక్కువ జీతాలు. నెలకు వంద బహరైన్ దీనార్‌లు ఇస్తామని చెప్పి పంపిస్తే అక్కడ 70 దీనార్లు కూడా రావడం లేదని అక్కడి లేబర్ క్యాంపుల్లోని కార్మికు లతో మాట్లాడితే చెప్పారు. దాదాపు నలభై దినార్లు అక్కడే ఖర్చు కాగా, మిగి లేది 30 నుంచి 40 దీనార్లే. ఒక దీనార్‌కు దాదాపు రూ. 160. అంటే నెలకు ఇంటికి పంపేది రూ. 5,000 మాత్రమే. ఎప్పుడైనా ఓవర్ టైం పని దొరికితే మరో రెండు, మూడు వేలు పెరగొచ్చు. చాలా గల్ఫ్ దేశాల్లో నిబంధనలు అతి కఠినం. మద్యం, చుట్ట, బీడి, పొగాకు, పాన్ లాంటివన్నీ నిషిద్ధమే. ఇది తెలియక కూడా పలువురు భారతీయులు జైళ్లలో మగ్గాల్సి రావడం దారుణం.
 
 ఇక పనివేళలు మరీ ఇబ్బందికరమైనవి. నాలుగున్నర గంటలకే తెల్లవారుతుంది. ఆరు గంటలకల్లా పని స్థలాల్లో ఉండాలి. తెల్లారక ముందే లేచి వండుకు తిని, కొంత డబ్బాల్లో పెట్టుకొని వెళతారు. డబ్బాలో అన్నం అక్కడి మండే ఎండలకు పాడైపోతుంది. అయినా ఒక్కోమెతుకూ తమ రక్తమాంసాల ఫలమే కాబట్టి ఆ పాడైపోయిన తిండే తిని జబ్బులపాల వుతారు. సొంత వారికి, ఊరికి దూరంగా ఏళ్ళ తరబడి పరాయి దేశంలో దిక్కుతోచని పక్షుల్లా పడి ఉండాల్సిందే. తనతో జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన భార్యను వదిలి ఏళ్లకు ఏళ్లు గడపడమేం దౌర్భాగ్యమని ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఏడ్వడమేనని బొంగురుబోయిన గొంతుతో ఓ నవ యువకుడన్న మాటలు హృదయమున్న వారెవ్వరినైనా కలచివేస్తాయి.
 
 ఇక ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప జిల్లాల నుంచి వెళ్ళిన మహిళలది మరో నరకం. ఇళ్ళల్లో పనిచేసే ఈ మహిళలపైన మానసిక వేధింపులు, శారీరక చిత్రహింసలు, అవమానాలు సర్వసాధారణం. తట్టుకోలేక పారిపోవడమో లేదా మరోచోట పని వెతుక్కోవడమో చేస్తే... ‘పారిపోయిన వారు’ ముద్ర వేసి జైళ్ళలో పెట్టడం సర్వసాధారణం. అదక్కడ చాలా పెద్ద నేరం. అయితే ఉన్నత చదువులు, ఏదైనా వృత్తి నైపుణ్యంతో గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు మెరుగైన వేతనాలతో గౌరవప్రదమైన జీవితాలనే జీవి స్తున్నారు. అలాంటి వారు పదేళ్ళ కిందట 10 శాతమే, ఇప్పుడు 30 శాతంపైనే ఉన్నారు. ఇదొక మంచి పరిణామం.
 
 గతిలేక గల్ఫ్ దారి పట్టి...
 గల్ఫ్‌లో ఉన్న భారతీయులుగానీ, తెలుగువాళ్ళుగానీ బాధలనుభవించ డానికి రెండు కారణాలున్నాయి. ఒకటి, గల్ఫ్‌లో పనికోసం వెళ్తున్నవాళ్ళకు సరైన అవగాహన లేకపోవడం. రెండు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ కార్మి కుల సమస్యలను ప్రాధాన్యత కలిగిన అంశంగా చూడకపోవడం. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గత యాభై  ఏళ్లుగా ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు వ్యవసాయాన్ని, ఉపాధిని నిర్లక్ష్యం చేశాయి. దీనితో రైతులు, కూలీలు, ముఖ్యంగా కింది వర్గాల కులాల ప్రజలు మహిళలు ఉపాధి పొందలేక పేదరి కంలోకి జారిపోయారు. దీనితో ఉపాధి కోసం గల్ఫ్ వెళ్ళడం తప్పనిసరై పోయింది. అయితే ఈ వలసలు తెలంగాణలో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నుంచి ఎక్కువగా ఉన్నాయని గణాంకాలు తెలి యజేస్తున్నాయి. 1940 ప్రాంతంలో మొట్టమొదటిసారిగా నిజామాబాద్ నుంచి పొట్ట చేత పట్టుకొని ముంబై వెళ్లడం మొదలైంది. అక్కడి కొందరు ఏజెంట్ల ద్వారా పదుల సంఖ్యలో గల్ఫ్‌కి వెళ్లడం మొదలైంది. 1960వ దశ కంలో. 1970ల ప్రారంభంలో గల్ఫ్‌లో చమురు నిల్వలు బయటపడిన తర్వా త ఈ వలసల సంఖ్య పెరిగింది. 1990 మొదటి నుంచి వ్యవసాయం దెబ్బ తినడం, నక్సలైటు ఉద్యమ ప్రాబల్యంవల్ల ప్రజలపై పోలీసుల దాడులు పెర గడంతో యువకులకు గల్ఫ్‌కి వెళ్ళడం తప్ప గత్యంతరం లేకపోయింది.
 
 ఖజానాలు నింపేది వారే

 గల్ఫ్ కార్మికుల సమస్యలను మానవతా దృష్టితో చూస్తున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి. ఆ వైఖరి మారాలి. గల్ఫ్‌లో పనిచేస్తున్న కార్మి కులు ఈ దేశానికి, రాష్ట్రాలకు ఈ గడ్డ మీదే ఉండి పనిచేస్తున్న వారందరి కంటే చాలా ఎక్కువ ఆదాయాన్ని, అది కూడా విదేశీమారక ద్రవ్యం రూపంలో అందిస్తున్నారు. 2014లో భారత్‌కు దాదాపు 4,48,000 కోట్ల రూపాయల ఆదాయం విదేశాల్లోని భారతీయుల నుంచి అందిందనీ, అందులో అమెరికా నుండి వచ్చింది 11 శాతం మాత్రమే కాగా, 39 శాతం గల్ఫ్ దేశాల నుండి వచ్చింది. ఆ దేశాల్లోని భారతీయులు మన దేశానికి ఒక్క 2014లోనే 2,49,000 కోట్ల రూపాయలు పంపారు. ఇందులో కనీసం పది శాతం వాణిజ్య పన్నుల ద్వారా రూ.20 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాలకే చేరుతోంది. ఏటా గల్ఫ్ నుంచి కనీసం రూ.50 వేల కోట్లు తెలంగాణకు, రూ.30 వేల కోట్లకు పైగా ఏపీకీ అందుతున్నట్టు అంచనా. అందుకే ప్రభుత్వాలు గల్ఫ్‌లోని కార్మికుల సంక్షే మం, భద్రతలను తమ బాధ్యతలుగా గుర్తించాలి. అంతేగానీ వారికేదో మేలు చేస్తున్నట్టు భావించడం సరికాదు.
 
 ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలదీ పూర్తి నిర్లక్ష్య వైఖరే. కాగా కేరళ ప్రభుత్వం గల్ఫ్‌లోని తమ పౌరుల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఆదర్శప్రాయంగా నిలిచింది. గల్ఫ్ వెళ్లే వారికి ఉపాధి శిక్షణ మొదలు, అక్కడ ఉద్యోగ కల్పన వరకు ఎదురయ్యే ఇబ్బందుల నుంచి వారిని ఆదుకోడానికి ఆయా దేశాల దౌత్య కార్యాలయాల్లో ప్రత్యేక అధికారులను నియమించింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు మాత్రం సెక్రటేరియట్‌లలోనే ప్రత్యేక విభాగా లను ఏర్పాటు చేశాయి. గల్ఫ్ దేశాల్లోని దౌత్య కార్యాలయాల్లో తెలుగు మాట్లాడే అధికారులే లేక, మనవాళ్లకు వారితో తమ సమస్యలు చెప్పుకునే అవకాశమే దొరకడం లేదు.

తెలంగాణ ఉద్యమంలో ఏ స్థాయిలోనైతే గల్ఫ్ కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడామో అదే స్థాయిలో వారి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పూనుకోవాలి. వీసా కాలం ముగిసి జైళ్లలో మగ్గుతున్న వే లాది మందిని స్వదేశానికి తీసుకురావాల్సిన బాధ్యత ఇరు ప్రభుత్వాలపైనా ఉంది. ఉపాధి కోసం మన దేశం నుంచి తరలి వెళు తున్న మన పౌరులను కాపాడుకోవడం ఈ దేశ పౌరులుగా మన కర్తవ్యం. వారి కనీస ప్రాథమిక హక్కులను పునరుద్ధరించేందుకూ, నరక కూపాల నుంచి వారిని రక్షించేందుకు అంకితభావంతో కృషి చేయాలి.
 (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213
 - మల్లెపల్లి లక్ష్మయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement