తెరపై గల్ఫ్ గాథలు
పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి అక్కడ నానా కష్టాలు ఎదుర్కొంటున్న భారతీయుల జీవితాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గల్ఫ్’. పి.సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో యెక్కలి రవీంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రవిశేషాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ- ‘‘గల్ఫ్ దేశాల్లో చాలా మందిని కలిసి వారి నుండి సమాచారాన్ని సేకరించాను.
500 కేస్ స్టడీస్‌తో యథార్థ ఘటనల ఆధారంగా ఈ కథ తయారు చేసుకున్నాను. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తయింది. దుబాయ్, కడప, సిరిసిల్ల ప్రాంతాల్లో త్వరలోనే చిత్రీకరణ జరుపుతాం. థ్రిల్లింగ్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రం అందరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు. ‘‘శ్రావ్య ఫిలింస్ బ్యానర్‌లో మేం రూపొందిస్తున్న 14వ సినిమా ఇది.
సునీల్ కుమార్ అహర్నిశలూ కష్టపడి ఈ సినిమా స్క్రిప్ట్‌ను తయారు చేశారు. ఈ చిత్రాన్ని సమ్మర్‌లో రిలీజ్ చేయనున్నాం’’ అని నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో మైగ్రెంట్ అసోసియేషన్ ప్రతినిధి భీంరెడ్డి, లాయర్ అనురాధ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత బి.బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్.వి.శివరామ్, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి.