గల్ఫ్‌బాధితుల సమస్యల పరిష్కారానికి పాదయాత్ర
దోమకొండ : గల్ఫ్‌బాధితుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సమస్యల పరిష్కారం కోసం రాబోయే పదిరోజుల్లో కామారెడ్డి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు గల్ఫ్‌బాధితుల సంఘం కామారెడ్డి డివిజన్ అధ్యక్షుడు ఎర్రం రాజు, గౌరవ అధ్యక్షుడు నరేంద్రచారి తెలిపారు. ఆదివారం వారు దోమకొండలో విలేకరులతో మాట్లాడారు.
ఇప్పటి వరకు 450 మంది యువకులు ఉపాధికోసం గల్ఫ్‌దేశాలకు వెళ్లారని పేర్కొన్నారు. అక్కడ సరియైన పనిలేక చేసిన అప్పులు తీర్చలేక వారు ఆత్మహత్యలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్‌బాధితులకు ఎలాంటి ఆర్థిక సహాయం అందించడం లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్‌బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలన్నారు.
దీనికోసం రాబోయే పదిరోజుల్లో కామారెడ్డిలోని తెలంగాణ తల్లి విగ్రహం నుంచి హైదరాబాద్‌లోని సచివాలయం వరకు 120 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈసమావేశంలో గల్ఫ్‌బాధితుల సంఘం దోమకొండ అధ్యక్షుడు పాలకుర్తి శేఖర్, మాచారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్, మండల ప్రతినిధులు సిద్దిరాములు, చాకలి స్వామి, రాజు, రమేశ్, నర్సింలు,లింగాల హరికషన్‌గౌడ్, మన్నె శ్యామ్‌రెడ్డి, హన్మంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.