
‘సెక్యూరిటీ’లేని బతుకులు!
జీహెచ్‌ఎంసీలో కనీస వేతనాలకు నోచుకోని సెక్యూరిటీ సిబ్బంది
పట్టించుకోని పాలకులు, అధికారులు
సిటీబ్యూరోః జీహెచ్‌ఎంసీలో ఔట్‌సోర్సింగ్‌పై పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి కనీస వేతనాలు సైతం అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతోకాలంగా తమ సమస్యను పరిష్కరించాల్సిందిగా ఇటు అధికారులతోపాటు అటు పాలకమండలికి సైతం విన్నవించుకున్నప్పటికీ, పాలకమండలి గడువు ముగిసిపోయినా తమ సమస్యను ఎవరూ పట్టించుకోలేదని వారు వాపోతున్నారు. కనీస వేతనాల మేరకైనా తమకు నెలకు రూ. 8500 వేలు అందాల్సి ఉండగా, ఎవరూ పట్టించుకోలేదని కలత చెందుతున్నారు. ప్రస్తుతం చెల్లిస్తున్న రూ. 6500 వేలలో సైతం పలు కోతలు పోతుండటం, తమను నియమించిన ఏజెన్సీ మరికొంత కోత విధించి కేవలం రూ. 5400 మాత్రమే చెల్లిస్తోందని సెక్యూరిటీ సిబ్బంది వాపోతున్నారు. పెరిగిపోయిన ధరలతో కుటుంబ భారం మోయలేక పలు ఇబ్బందులు పడుతున్నామన్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీలో ఎవరినీ అడ్డగించే సాహసం చేయలేకపోతున్నామని, ఏవైనా వస్తువులు గడపదాటుతున్నా ఇదేమని ప్రశ్నిస్తే చేయి చేసుకుంటారని, రాజకీయనాయకులు జులుం చెలాయిస్తున్నా ఏమీ చేయలేకపోతున్నామని గోడు వెళ్లబోసుకుంటున్నారు.
వారిగురించి జీహెచ్‌ఎంసీ అధికారులకు తెలిపినా స్పందించరని, ఏవైనా ఘటనలు వెలుగులోకి వచ్చినా తమపైనే నిందలు మోపుతారన్నారు. అందుకు దృష్టాంతంగా ఇటీవల జీహెచ్‌ఎంసీ నుంచి ఫర్నిచర్ మాయం కావడాన్ని ఉదహరిస్తూ ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్నట్లుగా తమ పరిస్థితి తయారైందని బావురుమంటున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, సంబంధిత కార్మికశాఖ ఇకనైనా తమ బాధలు గుర్తించి వెంటనే తమకు కనీస వేతనాలు వర్తింపచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో 50 మంది సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో వెరసి మొత్తం దాదాపు 500 మంది పనిచేస్తున్నారు.