ఈనెల 21 నుంచి 23 వరకు ప్రవాసీ భారతీయుల దినోత్సవం
సేపూరి వేణుగోపాలచారి, కామారెడ్డి : నవభారత నిర్మాణంలో ప్రవాస భారతీయుల కృషి, భవిష్యత్తులో వారి పాత్ర, భాగస్వామ్యాన్ని తెలియపర్చేవిధంగా యేటా నిర్వహించే ప్రవాసీ భారతీయుల దినోత్సవాలకు వేదిక సిద్ధమైంది. 15వ ప్రవాస భారతీయుల వేడుకలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఈనెల 21 నుంచి 23 వరకు ఘనంగా జరుగనున్నాయి. ఆయా దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు 2వేల మందికిపైగా ఈ ఉత్సవాలకు హాజరుకానున్నారు. ఈ సంవత్సరం ప్రవాసీ భారతీయుల దినోత్సవం హైదరాబాద్‌లో నిర్వహించాలని భావించినప్పటికీ ఆ తర్వాత వేదిక వారణాసికి మారింది. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలకు వందల సంఖ్యలో మన రాష్ట్రానికి సంబంధించిన ప్రవాస భారతీయులు సైతం హాజరుకానున్నారు.
ముఖ్య ఉద్దేశం...
భారతదేశ అభివృద్ధిలో విదేశాల్లో స్థిరపడిన భారతీయులను భాగస్వామ్యం చేయడం, దేశ అభివృ ద్ధిలో ప్రవాస భారతీయుల కృషికి గుర్తుగా వేడుకలను జరుపుకోవడం ప్రవాసీ భారతీయ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. మహాత్మాగాంధీ సౌతాఫ్రికా దేశం నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన 1915 జనవరి 9వ తేదీని ప్రవాసీ భారతీయ దినోత్స వంగా నిర్వహిస్తారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమాఖ్య ఆధ్వర్యంలో 2003 నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేశం లోని ముఖ్య పట్టణాలతో పాటు విదేశాల్లోనూ ఈ ఉత్సవాలకు వేదికలను నిర్ణయిస్తారు. 2017లో జనవరి 7 నుంచి 9 తేదీల్లో న్యూఢిల్లీ, 2018 వేడుకలను జనవరి 6 నుంచి 8 వరకు సింగపూర్‌లో నిర్వహించారు. ఈ యేడాది ఉత్సవాలకు వారణాసిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అభివృద్ధి, సమస్యలపై చర్చ
ప్రవాస భారతీయ దివస్ అంటే.. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ధనవంతులైన ప్రవాస భారతీయులను పిలిపించి వేడుకలు నిర్వహిస్తున్నారనే అపోహలు గతంలో ఉండేవి. అమెరికా, బ్రిటన్, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న ప్రవాస భారతీయుల, కార్మికుల సమస్యలు, సంక్షేమంపై ఈ వేడుకల్లో ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. ప్రపంచంలోని 208 దేశాల్లో 3.12 కోట్ల మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. గతంలో ఢిల్లీలో జరిగిన ప్రవాసీ భారతీయ దివస్‌కు ప్రపచంలోని ఆయా దేశాల్లో స్థిరపడిన భారత సంతతికి చెందిన 285 మంది పార్లమెంటేరియన్లను మాతృభూమితో వారి బంధాన్ని దృడపరచడమే లక్ష్యం గా భారత ప్రభుత్వం ఆహ్వానించింది. ఈసారి కూడా ఆయా దేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్న భారత సంతతి ప్రముఖులతో పాటు సమస్యలపై చర్చించేందుకు అవగాహన కలిగిన ఆయా దేశాల ప్రవాస భారతీయులను ఆహ్వానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment