కేరళ అధికారులతో చర్చిస్తున్న మన రాష్ట్ర అధికారులు (ఫైల్)
ఎన్.చంద్రశేఖర్, మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా): తెలంగాణ ప్రవాసీ విధానం(ఎన్‌ఆర్‌ఐ పాలసీ) సమగ్ర రూపకల్పనకు ప్రభుత్వం ముందడుగు వేసింది. మన రాష్ట్రం నుంచి గల్ఫ్‌తో పాటు ఇతర దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లిన వారికి వివిధ రకాల ప్రయోజనాలను అందించడానికి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ఎన్‌ఆర్‌ఐ పాలసీ తీసుకురావాలని సర్కారు భావిస్తోంది. ఈ విధానం అమలు ప్రక్రియ తుది దశకు చేరిందని వెలువడుతున్న వార్తలు ప్రవాసుల్లో ఆశలు చిగురింపజేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రవాసీ విధానం అమలు చేస్తామని 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించిన విషయం విధితమే. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్‌ఆర్‌ఐ పాలసీపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఎన్‌ఆర్‌ఐ పాలసీ ఎలా ఉండాలనే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రవాసీ విధానం అమలు చేస్తున్నందన ఆ రాష్ట్రంలో పర్యటించి అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. సీఎం ఆదేశాలతో ఉన్నతస్థాయి అధికారుల బృందం కేరళ రాజధాని తిరువనంతపురానికి వెళ్లింది. ఆ రాష్ట్ర ప్రవాసీ, సంక్షేమ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇళంగోవన్, నోర్కా రూట్స్ సంస్థ సీఈవో హరికృష్ణ నంబూద్రితో మన అధికారుల బృందం విస్తృతంగా చర్చించింది. అధికారుల కేరళ పర్యటన అనతరం ఎన్‌ఆర్‌ఐ పాలసీపై మన రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.
సీఎం ప్రకటనతో గల్ఫ్ ప్రవాసుల్లో ఉత్సాహం
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక పాలసీని తీసుకొస్తామని, దీని కోసం ఎమ్మెల్యేల బృందాన్ని గల్ఫ్ దేశాలకు పంపి అధ్యయనం చేయిస్తామని చెప్పారు. తాను కూడా గల్ఫ్ దేశాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటానని చెప్పారు. దీంతో ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలుకు మార్గం సుమగం అవుతుందని గల్ఫ్ వలస కార్మికులు భావిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ పాలసీకి తుది రూపు తీసుకురావడానికి కృషి చేస్తున్న ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులను కేటాయించడంపై దృష్టిసారించాల్సి ఉంది. నిధులు కేటాయించడంతో పాటు ఈ నిధుల వినియోగం కోసం మార్గదర్శకాలను జారీచేయాలి.
గల్ఫ్ వలసదారులకే ఎక్కువ ప్రయోజనం..
తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ దేశాలకు ఉపాధి, ఉన్నత విద్య కోసం వలస వెళ్లిన వారికి ఎన్‌ఆర్‌ఐ పాలసీ అండగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రవాసీ విధానంతో గల్ఫ్ వలసదారులకు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని భావిస్తున్నారు. సౌదీ అరేబియా, ఒమాన్, కువైట్, యూఏఈ, బహ్రెయిన్, ఖతార్ దేశాలకు మన వారు అనేక మంది వలసవెళ్లారు. గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న మన రాష్ట్రానికి చెందిన వారు సుమారు 13లక్షల మంది ఉంటారని అంచనా. వీరందరిలో ఎన్‌ఆర్‌ఐ పాలసీపై ఆశలు చిగురిస్తున్నాయి.
ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలు చేయాలి
తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఎన్‌ఆర్‌ఐ పాలసీని అమలు చేయాలి. ఈ పాలసీ అమలైతే వలస కార్మికులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అలాగే, 15 సంవత్సరాల పాటు విదేశాల్లో ఉపాధి పొంది ఇంటికి వచ్చిన వారికి ప్రతి నెలా పింఛన్ అందించాలి. వలస కార్మికులు మోసపోకుండా ఉండటానికి నకిలీ ఏజెంట్లను అరికట్టాలి. విజిట్ వీసాల ద్వారా గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లకుండా అడ్డుకోవాలి. – గాజుల సంపత్‌కుమార్, అధ్యక్షుడు, గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక, సిద్దిపేట జిల్లా
వలస కార్మికుల సంక్షేమంపై దృష్టిసారించాలి
ఎన్నో ఏళ్లుగా వలసలు కొనసాగుతున్నాయి. వలస కార్మికుల వల్ల మన రాష్ట్రానికి, దేశానికి విదేశీ మారక ద్రవ్యం లభిస్తోంది. కానీ, వలస కార్మికుల శ్రేయస్సు కోసం ఎలాంటి పథకాలూ అమలు చేయడం లేదు. ఎవరైనా అనుకోని పరిస్థితిలో గల్ఫ్ దేశాల్లో మరణిస్తే వారి మృతదేహాలను ఇంటికి చేర్చడం ఎంతో ఇబ్బంది అవుతుంది. ఎన్‌ఆర్‌ఐ పాలసీని అమలు చేసి కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు, సేవలు అందించాలి.– కుంట శివారెడ్డి, నిజామాబాద్ జిల్లా(దుబాయి)
ప్రవాసీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి
ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలులో భాగంగా ప్రవాసీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలులో ఇప్పటికే జాప్యం జరిగింది. అందువల్ల ప్రభుత్వం దీనిపై సీరియస్‌గా స్పందించి ప్రవాసీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి బడ్జెట్‌లో నిధులను కేటాయించాలి. ప్రవాస కార్మికులు ఇంటి వద్ద స్థిరపడాలని అనుకుంటే వారికి రాయితీపై రుణాలు ఇవ్వాలి. ప్రత్యేకంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాలి.
– దీకొండ కిరణ్‌కుమార్, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ నిజామాబాద్ జిల్లా కన్వీనర్
ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలైతే ఎన్నో ప్రయోజనాలు
ఎన్‌ఆర్‌ఐ పాలసీని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తే మన వారికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఎన్‌ఆర్‌ఐ పాల సీని అమలు చేస్తామని గతంలోనే సీఎం చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. కేరళ తరహా విధానం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.– నందిని అబ్బగౌని,జాగృతి అధ్యక్షురాలు, ఖతార్(షామీర్‌పేట్)
Comments
Please login to add a commentAdd a comment