NRI Policy
-
పోటీ చేస్తాం.. వలస గోస వినిపిస్తాం
మోర్తాడ్ (బాల్కొండ): ఎన్నికల ద్వారానే తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని గల్ఫ్ జాయింట్ యాక్షన్ కమిటీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలను వేదికగా చేసుకుని గల్ఫ్ బోర్డు, సమగ్ర ప్రవాసీ విధానాన్ని (ఎన్ఆర్ఐ పాలసీ) సాధించాలని, అందుకోసం పోటీయే మార్గమని ఇటీవల సమావేశమై నిర్ణయించింది. 2019 పార్లమెంట్ సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి 175 మంది పసుపు రైతులు నామినేషన్లు వేసి దేశం దృష్టిని ఆకర్షించిన విషయం విదితమే. ఇదే తరహాలో గల్ఫ్ ప్రభావం ఉన్న 32 అసెంబ్లీ నియోజకవర్గాలలో గల్ఫ్ బాధితులతో పెద్దసంఖ్యలో నామినేషన్లు వేయించి తమ డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలపాలని భావిస్తోంది. గల్ఫ్ జేఏసీ కార్యాచరణపై ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు సమాచారం సేకరిస్తున్నట్టు సమాచారం. 32 నియోజకవర్గాల్లో ప్రభావం! దాదాపు 15 లక్షల మంది తెలంగాణవాసులు గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. మూడు దశాబ్దాలుగా మరో 30 లక్షల మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి తిరిగి వచ్చారు. గల్ఫ్ కార్మికుల కుటుంబసభ్యుల ఓట్లను లెక్కలోకి తీసుకుంటే సుమారు కోటి వరకు ఉంటుందని జేఏసీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల బరిలోకి దిగి తమ ప్రభావం చూపాలని జేఏసీ భావిస్తోంది. గల్ఫ్ వలసలు ఎక్కువగా ఉన్న బాల్కొండ, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిర్మల్, ముధోల్, ఖానాపూర్, వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి, కోరుట్ల, జగిత్యాల్, ధర్మపురి, ఎల్లారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూరు, బోధన్, పెద్దపల్లి, మక్తల్, దేవరకద్ర, మెదక్, సిద్దిపేట, దుబ్బాక, నల్లగొండ, మిర్యాలగూడ, భువనగిరి, పరిగి నియోజకవర్గాలను తాము ప్రభావితం చేయగలమని జేఏసీ చెబుతోంది. పోటీకి పలువురు సిద్ధం! గోవిందుల అఖిల, మండలోజు సుచరిత, నారుకుల్ల అనిత (జగిత్యాల జిల్లా గోపాల్పూర్, ఇబ్రహీంపట్నం, తిప్పాయిపల్లి), ముడా లక్ష్మి (నిర్మల్ జిల్లా కౌట్ల(కే) గల్ఫ్ జేఏసీ మద్దతుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమ భర్తలు వివిధ కారణాలతో గల్ఫ్ దేశాల్లో మరణించగా, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం అందలేదని, తమ గోడు వినిపించేందుకే పోటీకి దిగుతున్నట్టు వీరు చెబుతున్నారు. ఇంకా పలు నియోజకవర్గాల్లో గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో మూకుమ్మడిగా నామినేషన్లు వేసే యోచనలో ఉన్నారు. ప్రభుత్వాలు మాట తప్పడంతోనే.. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు మాట తప్పడంతోనే ఎన్నికల్లో పోటీకి జేఏసీ సిద్ధమవుతోంది. – మంద భీంరెడ్డి, గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడు సత్తా చూపిస్తాం.. ఎన్నికల్లో పోటీ చేసి గల్ఫ్ వలస కార్మికుల సత్తా ఏమిటో చూపిస్తాం. ఎన్నికల బరిలో నిలిచి మా బలాన్ని నిరూపిస్తాం. –గుగ్గిల్ల రవిగౌడ్, గల్ఫ్ జేఏసీ చైర్మన్ -
ఎన్నారైలకు ఓటు హక్కు.. పంజాబ్ ఎన్నికల వేళ తెరపైకి కొత్త నినాదం
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకోవడంతో రాజకీయ పార్టీలు ప్రతీ అంశంపై దృష్టి సారించాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న ఎన్నారైలు, ఇక్కడున్న వారి కుటుంబ సభ్యుల మద్దతు పొందేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నారై సంక్షేమం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తున్నాయి. ఎన్నారై విజన్ పేరిట ఇండియా నుంచి విదేశాలకు వలసలు ఎక్కువగా కొనసాగిన రాష్ట్రాల్లో పంజాబ్, కేరళాలు ముందు వరుసలో ఉంటాయి. పంజాబ్ రాష్టం నుంచి అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు పెద్ద సంఖ్యలో పంజాబీలు ఉపాధి కోసం వలస వెళ్లారు. తర్వాత అక్కడ వ్యాపార రంగాల్లో కూడా రాణించారు. ముఖ్యంగా కెనడా, యుకే, గల్ఫ్ దేశాలలో పంజాబీలు స్థానికంగా ప్రభావం చూపే స్థాయికి చేరుకున్నారను. ఇటీవల ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగించిన ఆందోళనకు మద్దతుగా విదేశాల్లో పలు కార్యక్రమాలు చేపట్టడం, ఆర్థిక అండదండలు అందించడంలో ఎన్నారై పంజాబీలు కీలకంగా వ్యవహారించారు. ఈ ఎన్నికల్లో ప్రవాస పంజాబీలు, వారి కుటుంబ సభ్యుల, బంధువుల ఓట్లు కీలకం కావడంతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నారై పాలసీని ప్రకటించింది. ప్రవాస పంజాబీలు స్థానికంగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా విధానాలు రూపొందిస్తామని హామీ ఇచ్చింది. ఎన్నారైల సమస్యలు పరిష్కరించేందుకు సింగిల్ విండో ఏర్పాటు చేస్తామని కూడా తెలిపింది. అంతేకాదు ప్రవాస పంజాబీలను ఆకర్షించడం ద్వారా టూరిజం సెక్టార్‌ను డెవలప్‌చేస్తామని కూడా తెలిపింది. ఎన్నారై ఓటుహక్కు ఇండియాలో పారిశ్రామికంగా సహాకారం అందించే విషయంలో రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న పాలసీల పట్ల ఎన్నారైలు సానుకూలంగానే స్పందిస్తున్నారు. దీంతో పాటు చిరకాలంగా ఉన్న ఎన్నారైలకు ఓటు హక్కు డిమాండ్‌పై సానుకూలంగా స్పందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన కొన్ని పాశ్చాత్య దేశాల్లో ప్రవాసంలో ఉన్న వారికి కూడా ఓటు హక్కును కల్పించాయి. మన దేశంలో ఇంకా ఈ సౌకర్యం లేదు. ఈ అంశంపై ఇప్పటికే పార్లమెంటు సభ్యుడు, అంతర్జాతీయ వ్యవహరాల్లో నిపుణుడైన శశిథరూర్ ఆన్లైన్ వేదికగా అనేక డిబెట్లు నిర్వహిస్తున్నారు. దీంతో పోలింగ్ తేదీ దగ్గర పడే సమయానికి ఎన్నారై ఓటింగ్ అంశం మరోసారి బలంగా తెర మీదకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్నారైలకు ఓటు హక్కు కల్పించే విషయంలో రాజ్యంగ పరంగా, దేశభద్రత పరంగా అనేక చిక్కుముళ్లు ఉన్నాయని మరికొందరి వాదన. ఎన్నారై సంక్షేమంలో పంజాబ్ భేష్ - మంద భీమ్‌రెడ్డి (వలస వ్యవహారాల విశ్లేషకులు) వివిధ దేశాల్లో ఉన్న పంజాబీల కోసం ... ఎన్నారై డిపార్టుమెంటు పేరిట ఒక శాఖను అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. దీనికి అనుబంధంగా ఒక మంత్రి ఉంటారు. ఒక రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో పంజాబ్ ఎన్నారై కమీషన్ కూడా ఉంది. ఎన్నారైల కష్టసుఖాలను వినిపించేందుకు ఎన్నారై సభ పేరిట ఒక సొసైటీ కూడా పంజాబ్‌లో ఉంది. ఐజీపీ ర్యాంకు అధికారి నేతృత్వంలో ఒక ఎస్పీ స్థాయి అధికారి పలువురు ఇతర అధికారులతో పంజాబ్ పోలీస్ ఎన్నారై వింగ్ పనిచేస్తున్నది. ఆరు ఎన్నారై పోలీసు స్టేషన్లు ఉన్నాయి. విదేశీ జైళ్లలో మగ్గుతున్నవారికి న్యాయ సహాయం చేయడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ఎన్నారై పెళ్లిళ్ల సమస్యలు పరిష్కరించడం తదితర కార్యక్రమాలను ఈ విభాగం చూస్తుంది. ఏజెంట్లను నియంత్రించడానికి పంజాబ్ ట్రావెల్ ప్రొఫెషనల్స్ రెగులేషన్ యాక్టు-2013ను ప్రవేశపెట్టారు. వివిధ దేశాలలో పంజాబ్ ప్రభుత్వం ఎన్నారై కోఆర్డినేటర్లను నియమించింది. -
ఎన్నారై పాలసీ రావాలి
కొండవీటి సురేష్, ఆర్మూర్: ఉపాధి వేటలో కుటుంబ సభ్యులను విడిచి గల్ఫ్‌తో పాటు ఇతర దేశాలకు వెళ్లి కష్టపడుతున్న ప్రవాస భారతీయులకు మేమున్నామనే భరోసా కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీని రూపొందించి అమలు చేయాలని వలసదారుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నర్సింహ నాయుడు కోరారు. గల్ఫ్ బాధితుల పక్షాన దశాబ్ద కాలంగా ఉద్యమాలు చేస్తున్న కోటపాటి నర్సింహ నాయుడు ఎన్ఆర్ఐ పాలసీ ఆవశ్యకతపై, అందులో ఏ అంశాలు ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 20 – 25 లక్షల మంది వివిధ దేశాలకు వలస వెళ్లినట్లు వివిధ సంస్థలు సర్వేల్లో అంచనా వేశాయి. వీరిలో అత్యధికంగా గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఒమాన్, ఖతార్, కువైట్, బహ్రెయిన్‌తో పాటు మలేషియా, సింగపూర్, అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు సైతం ఉపాధి కోసం వలస వెళ్లారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు అత్యధికంగా భవన నిర్మాణ కార్మికులుగా, ఇళ్లలో పని వారిగా చేరారు. వీరికి ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించుకోవడానికి ఎవరిని సంప్రదించాలో కూడా కనీస అవగాహన లేని దుస్థితిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి విదేశాల్లో.. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ప్రతీ ఎంబసీలో ఒక తెలుగు మాట్లాడగలిగే అధికారిని నియమించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. లేదా రాష్ట్ర ప్రభుత్వమే ప్రతీ దేశంలో ఒక తెలుగు అధికారిని నియమించాలి. గల్ఫ్ దేశాల్లో వివిధ కారణాలతో అక్రమ నివాసం ఉంటున్న వేలాది మందిని ఎలాంటి జరిమానాలూ, జైలు శిక్షలు లేకుండా స్వస్థలాలకు వెళ్లిపోవడానికి ఆ దేశాల ప్రభుత్వాలు అవకాశమిచ్చిన సందర్భాలలో వారిని ఆదుకొని స్వరాష్ట్రానికి తీసుకురావడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. ప్రవాసీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి అనుబంధంగా, సంబంధిత ఎన్ఆర్ఐ విభాగం మంత్రికి జవాబుదారీగా ఉండే విధంగా 25 మంది సభ్యులతో కూడిన తెలంగాణ ప్రవాసీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ప్రతి గల్ఫ్ దేశానికి ఒక డైరెక్టర్, ఎనిమిది అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఒక్కొక్క సభ్యుడు, దేశంలోని వివిధ రాష్ట్రాలలో తెలంగాణ ప్రవాసీల నుంచి నలుగురు, విదేశాల నుంచి తిరిగి వచ్చిన ప్రవాసీలు, సామాజిక సంస్థల నుంచి నలుగురు సభ్యులతో కేరళ మాదిరి నాన్ రెసిడెంట్స్ తెలంగాణనైట్స్ వెల్ఫేర్ యాక్ట్ ద్వారా ప్రవాసీ తెలంగాణీయుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ప్రతీ కార్మికుడిని సభ్యుడిగా చేర్చుకోవాలి ప్రతి వలస కార్మికుడిని ప్రవాసీ సంక్షేమ బోర్డులో సభ్యుడిగా చేర్చుకొని వారి నుంచి ప్రతీ సంవత్సరం వారి స్థాయిని బట్టి కొంత మొత్తాన్ని వసూలు చేయాలి. ఈ నిధికి సంక్షేమ బోర్డు ద్వారా అంతే మొత్తాన్ని జమ చేయాలి. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారికి సంక్షేమ బోర్డు పరిధిలో సేవింగ్స్ ఖాతా తెరిచి వారు తిరిగి వచ్చిన తర్వాత వారికి చెల్లింపులు జరిపి వారిని ఇక్కడే స్థిరపడే విధంగా ఉపాధి అవకాశాలలో ఆ నిధిని ఉపయోగించుకోవడం లేదా వారికి 60 సంవత్సరాలు నిండిన తర్వాత వారు కూడబెట్టుకున్న స్థాయిలో పింఛన్ వచ్చే విధంగా చూడాలి. విదేశాలకు వెళ్లి ఏజెంట్ల కారణంగా లేదా అక్కడి యాజమాన్యాల కారణంగా మోసపోయి.. నష్టపోయి తిరిగివచ్చిన వారిని ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో కూడిన రుణాలను ఇచ్చి స్థానికంగా ఉపాధి అవకాశాలను కల్పించాలి. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారిని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకొని బోర్డులో సభ్యత్వం తీసుకొనే విధంగా ప్రోత్స హించాలి. వారికి తగిన నైపుణ్య, శిక్షణ ఇవ్వడంతో పాటు వారు వెళ్లే దేశం, కంపెనీ, నివాసం ఉండే అడ్రస్‌తో సహా సమాచారం సేకరించాలి. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) శిక్షణ కేంద్రాలను ప్రతీ డివిజన్, నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేయాలి. ప్రవాసీ బీమా.. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు బీమా తరహాలో వివిధ దేశాల్లో నివసిస్తున్న ప్రవాసీలకు వర్తించే విధంగా ఐదు లక్షల రూపాయల ప్రవాసీ బీమా పాలసీని ప్రవేశపెట్టాలి. సాంకేతిక కారణాలతో బీమా సౌకర్యం పొందలేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎక్స్ గ్రేషియా అందించాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పది లక్షల రూపాయల ప్రమాద బీమా ‘ప్రవాసీ భారతీయ బీమా యోజన’ను కార్మికులందరికీ చేయించాలి. బీమా పాలసీని ఆన్ లైన్లో రెన్యూవల్ చేయించుకోవడానికి రాష్ట్రంలోని కొన్ని ‘మీ సేవా’ కేంద్రాలను ప్రత్యేకంగా కేటాయించాలి. విదేశాల్లో ఆత్మహత్య చేసుకున్న, సహజంగా, ప్రమాదవశాత్తు తదితర కారణాలతో మరణించిన వారి మృతదేహాలను వెంటనే స్వగ్రామాలకు తెప్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. అందుకు ప్రతీ దేశంలో ఒక అధికారి లేదా స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలి.వివిధ కారణాలతో విదేశీ జైళ్లలో మగ్గుతున్న వారికిన్యాయ సహాయం అందేవిధంగా ఎంబసీతోఅనుసంధానం చేయాలి. తెలంగాణ ప్రవాసీ దివస్.. ప్రవాసీ భారతీయ దివస్ తరహాలో తెలంగాణ ప్రవాసీ దివస్ నిర్వహించారు. రాష్ట్రానికి చెందిన ప్రవాసీలకు ప్రతీ సంవత్సరం ఒక సదస్సు ఏర్పాటు చేసి అన్ని దేశాలలోని సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ, స్వచ్ఛంద సంస్థల సభ్యులను ఆహ్వానించి రెండు రోజులకు తక్కువ కాకుండా సమావేశాలు నిర్వహించాలి. తద్వారా వారి భావాలను, సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుంది. పెట్టుబడులను ఆహ్వానించవచ్చు, ప్రవాసీలు సత్కరించవచ్చు. మోసకారి ఏజెంట్లపైచర్యలు తీసుకోవాలి తప్పుడు వీసాలతో మోసం చేస్తున్న ఏజెంట్ల ఆటకట్టించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. లైసెన్స్ కలిగిన కొందరు ఏజెంట్లు కూడా విజిట్ వీసాలతో మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. కొందరు విదేశాలకు వెళ్లాక అక్కడ ఏజెంట్లుగా అవతారమెత్తి వీసాలు పంపిస్తున్నారు. ఇలాంటి వీసాలపై వెళ్లినవారు రెండు, మూడు నెలలకే తిరిగి వచ్చిన సందర్భాలున్నాయి. స్థానిక ఉపాధిపై దృష్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చేవారు స్వగ్రామాలలో స్థిరపడటానికి ప్రయత్నించాలి. విజిట్ వీసాపై వెళ్లిన వారు, కల్లివెళ్లిగా ఉన్నవారు, తక్కువ జీతాలతో ఇబ్బందిపడేవారు స్వరాష్ట్రానికి రావడం మంచిది. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఎందరో ఉపాధి పొందుతున్నారు. మన ప్రాంతం వారు ఇక్కడే ఉపాధి చూసుకోవచ్చు. -
ఎన్ఆర్ఐ పాలసీపై ముందడుగు
ఎన్.చంద్రశేఖర్, మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా): తెలంగాణ ప్రవాసీ విధానం(ఎన్ఆర్ఐ పాలసీ) సమగ్ర రూపకల్పనకు ప్రభుత్వం ముందడుగు వేసింది. మన రాష్ట్రం నుంచి గల్ఫ్‌తో పాటు ఇతర దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లిన వారికి వివిధ రకాల ప్రయోజనాలను అందించడానికి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ఎన్ఆర్ఐ పాలసీ తీసుకురావాలని సర్కారు భావిస్తోంది. ఈ విధానం అమలు ప్రక్రియ తుది దశకు చేరిందని వెలువడుతున్న వార్తలు ప్రవాసుల్లో ఆశలు చిగురింపజేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రవాసీ విధానం అమలు చేస్తామని 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన విషయం విధితమే. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ఆర్ఐ పాలసీపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఎన్ఆర్ఐ పాలసీ ఎలా ఉండాలనే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రవాసీ విధానం అమలు చేస్తున్నందన ఆ రాష్ట్రంలో పర్యటించి అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. సీఎం ఆదేశాలతో ఉన్నతస్థాయి అధికారుల బృందం కేరళ రాజధాని తిరువనంతపురానికి వెళ్లింది. ఆ రాష్ట్ర ప్రవాసీ, సంక్షేమ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇళంగోవన్, నోర్కా రూట్స్ సంస్థ సీఈవో హరికృష్ణ నంబూద్రితో మన అధికారుల బృందం విస్తృతంగా చర్చించింది. అధికారుల కేరళ పర్యటన అనతరం ఎన్ఆర్ఐ పాలసీపై మన రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. సీఎం ప్రకటనతో గల్ఫ్ ప్రవాసుల్లో ఉత్సాహం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక పాలసీని తీసుకొస్తామని, దీని కోసం ఎమ్మెల్యేల బృందాన్ని గల్ఫ్ దేశాలకు పంపి అధ్యయనం చేయిస్తామని చెప్పారు. తాను కూడా గల్ఫ్ దేశాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటానని చెప్పారు. దీంతో ఎన్ఆర్ఐ పాలసీ అమలుకు మార్గం సుమగం అవుతుందని గల్ఫ్ వలస కార్మికులు భావిస్తున్నారు. ఎన్ఆర్ఐ పాలసీకి తుది రూపు తీసుకురావడానికి కృషి చేస్తున్న ప్రభుత్వం బడ్జెట్లో నిధులను కేటాయించడంపై దృష్టిసారించాల్సి ఉంది. నిధులు కేటాయించడంతో పాటు ఈ నిధుల వినియోగం కోసం మార్గదర్శకాలను జారీచేయాలి. గల్ఫ్ వలసదారులకే ఎక్కువ ప్రయోజనం.. తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ దేశాలకు ఉపాధి, ఉన్నత విద్య కోసం వలస వెళ్లిన వారికి ఎన్ఆర్ఐ పాలసీ అండగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రవాసీ విధానంతో గల్ఫ్ వలసదారులకు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని భావిస్తున్నారు. సౌదీ అరేబియా, ఒమాన్, కువైట్, యూఏఈ, బహ్రెయిన్, ఖతార్ దేశాలకు మన వారు అనేక మంది వలసవెళ్లారు. గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న మన రాష్ట్రానికి చెందిన వారు సుమారు 13లక్షల మంది ఉంటారని అంచనా. వీరందరిలో ఎన్ఆర్ఐ పాలసీపై ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలి తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలి. ఈ పాలసీ అమలైతే వలస కార్మికులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అలాగే, 15 సంవత్సరాల పాటు విదేశాల్లో ఉపాధి పొంది ఇంటికి వచ్చిన వారికి ప్రతి నెలా పింఛన్ అందించాలి. వలస కార్మికులు మోసపోకుండా ఉండటానికి నకిలీ ఏజెంట్లను అరికట్టాలి. విజిట్ వీసాల ద్వారా గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లకుండా అడ్డుకోవాలి. – గాజుల సంపత్‌కుమార్, అధ్యక్షుడు, గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక, సిద్దిపేట జిల్లా వలస కార్మికుల సంక్షేమంపై దృష్టిసారించాలి ఎన్నో ఏళ్లుగా వలసలు కొనసాగుతున్నాయి. వలస కార్మికుల వల్ల మన రాష్ట్రానికి, దేశానికి విదేశీ మారక ద్రవ్యం లభిస్తోంది. కానీ, వలస కార్మికుల శ్రేయస్సు కోసం ఎలాంటి పథకాలూ అమలు చేయడం లేదు. ఎవరైనా అనుకోని పరిస్థితిలో గల్ఫ్ దేశాల్లో మరణిస్తే వారి మృతదేహాలను ఇంటికి చేర్చడం ఎంతో ఇబ్బంది అవుతుంది. ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేసి కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు, సేవలు అందించాలి.– కుంట శివారెడ్డి, నిజామాబాద్ జిల్లా(దుబాయి) ప్రవాసీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి ఎన్ఆర్ఐ పాలసీ అమలులో భాగంగా ప్రవాసీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఎన్ఆర్ఐ పాలసీ అమలులో ఇప్పటికే జాప్యం జరిగింది. అందువల్ల ప్రభుత్వం దీనిపై సీరియస్‌గా స్పందించి ప్రవాసీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి బడ్జెట్లో నిధులను కేటాయించాలి. ప్రవాస కార్మికులు ఇంటి వద్ద స్థిరపడాలని అనుకుంటే వారికి రాయితీపై రుణాలు ఇవ్వాలి. ప్రత్యేకంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాలి. – దీకొండ కిరణ్‌కుమార్, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ నిజామాబాద్ జిల్లా కన్వీనర్ ఎన్ఆర్ఐ పాలసీ అమలైతే ఎన్నో ప్రయోజనాలు ఎన్ఆర్ఐ పాలసీని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తే మన వారికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఎన్ఆర్ఐ పాల సీని అమలు చేస్తామని గతంలోనే సీఎం చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. కేరళ తరహా విధానం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.– నందిని అబ్బగౌని,జాగృతి అధ్యక్షురాలు, ఖతార్(షామీర్పేట్) -
వలస కార్మిక కుటుంబాల ఉద్యమ బాట
సాక్షి, నెట్వర్క్: ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయడానికి అవసరమైన ప్రవాసీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన ఉద్యమం పల్లెలకు విస్తరిస్తోంది. దీనిపై ఇప్పటికే వలస కార్మికులు సామాజిక మాధ్యమాల ద్వారా నినదిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న కార్మికులకు అండగా ఇప్పుడు వారి కుటుంబాలు కూడా ప్రవాసీ సంక్షేమ బోర్డు సాధన ఉద్యమంలో భాగస్వాములయ్యాయి. ఇటీవల నిర్వహించిన సద్దుల బతుకమ్మ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వం ప్రవాసీల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేస్తే తమ కుటుంబాలకు లాభం కలుగుతుందని వలసదారుల కుటుంబాల సభ్యులు భావిస్తున్నారు. అందుకే సద్దుల బతుకమ్మ రోజున ఉద్యమ స్ఫూర్తిని చాటారు. అంతేకాకుండా బతుకమ్మ పాటల్లో తెలంగాణ ప్రవాసీ సంక్షేమ బోర్డు ఏర్పాటు ఆవశ్యకతను వ్యక్తపరుస్తూ పాటలు పాడారు. తాము అధికారంలోకి వస్తే వలస కార్మికుల కోసం కేరళ తరహాలో ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేస్తామని 2014 ఎన్నికల సందర్భంగా పలు పార్టీలు హామీ ఇచ్చాయి. అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రవాసీ సంక్షేమ బోర్డు ఏర్పాటుపై దృష్టి సారించలేకపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ వివిధ రాజకీయ పక్షాలు ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తామని హామీ ఇచ్చాయి. అయితే, మరోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎన్ఆర్ఐ పాలసీ లేదా తెలంగాణ ప్రవాసీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ అధికంగా వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2018–2019 బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అయితే. ఈ నిధులను వినియోగించడానికి నిర్ధిష్టమైన ప్రణాళిక లేకపోవడంతో ఎంత మేరకు నిధులు వినియోగమయ్యాయో తేలలేకపోయింది. గల్ఫ్ వలస కార్మికులద్వారా దండిగా ఆదాయం.. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి దండిగా ఆదాయం సమకూరుతోంది. గల్ఫ్ దేశాల్లో కార్మికులు తమ చెమటను చిందించి సంపాదించిన సొమ్మును తమ కుటుంబాలకు పంపుతున్నారు. తద్వారా ప్రభుత్వానికి విదేశీ మారకద్రవ్యం వస్తోంది. తాము తెచ్చిపెట్టిన ఆదాయంలో కొంత మొత్తాన్ని తమ సంక్షేమం కోసం ఖర్చుచేయాలని కార్మికులు కోరుతున్నారు. కేరళ ప్రభుత్వం వలస కార్మికుల కోసం ప్రత్యేక చట్టం రూపొందించింది. దాని ద్వారా బోర్డు ఏర్పాటు చేసి కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. బోర్డు ఏర్పడితే కలిగే ప్రయోజనాలు ఇవీ.. ప్రవాసీ సంక్షేమ బోర్డు ఏర్పడితే వలస కార్మికులకు బహుళ ప్రయోజనాలుకలుగనున్నాయి. వలస కార్మికులకు బీమా లేదా ఫించన్ అందుతుంది. స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు అందించడానికి అవకాశం ఉంది.గల్ఫ్ లేదా ఇతర దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లాలనుకునే కార్మికులకు తాముఎంచుకున్న రంగంలో నైపుణ్య శిక్షణ లభించే అవకాశం ఉంది. కౌషల్ వికాస్యోజన పథకం ద్వారా వలస కార్మికులు వృత్తి నైపుణ్యం పొందవచ్చు. అలాగేగల్ఫ్ దేశాల్లో జైళ్లో మగ్గుతున్న వారికి న్యాయ సహాయం అందడం, మరణించినవారి మృతదేహాలను స్వగ్రామాలకు చేర్చడానికి ఉచిత అంబులెన్స్ సౌకర్యంకల్పించడం, బీమా వల్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు వలస కార్మికులకు ప్రవాసీ సంక్షేమ బోర్డు ద్వారాఅందనున్నాయి. -
ఆశల పాలసీ అమలెప్పుడో..
సాక్షి, నెట్వర్క్: ప్రవాసుల రక్షణ, సంక్షేమం కోసం ఎన్నారై పాలసీ(ప్రవాసీ విధానం)ని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందోనని ప్రవాసులు ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా గల్ఫ్ ప్రవాస కార్మికులు ఈ పాలసీ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకున్న గల్ఫ్ ప్రవాస కార్మికులు ఎన్నారై పాలసీ అమలు కోసం చర్చను సాగిస్తున్నారు. ఫేస్బుక్, వాట్సప్, ఐఎంవో(ఇమో), టెలిగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో కొన్ని రోజులుగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాలు బాగుపడుతాయని భావించిన గల్ఫ్ కార్మి కులు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమానికి గల్ఫ్ కార్మికులు అండగా నిలువడంతో 2014లో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఎన్నారై పాలసీ అమలును ప్రధానాంశంగా చేర్చింది. టీఆర్ఎస్ అధికారం చేపట్టాక అప్పటి ఎన్నారై మంత్రి కేటీఆర్ 2016 జూలై 27న హైదరాబాద్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ముసాయిదాను సైతం రూపొందించగా సాధారణ పరిపాలన శాఖ, హోం, పరిశ్రమలు, ఐటీ, కార్మిక ఉపాధి, ఆర్థిక, నైపుణ్య అభివృద్ధి, సాంస్కృతిక పర్యాటక శాఖ, టామ్‌కామ్‌లకు ప్రభుత్వం పంపించింది. ఆయా శాఖల సూచనలను పరిగణనలోకి తీసుకున్నారు. ఆ ముసాయిదా మంత్రి మండలి ఆమోదం పొందాల్సి ఉంది. ఎన్నారై పాలసీ అమలైతే తమ జీవితాలు బాగుపడటానికి ఒక మార్గం ఏర్పడుతుందని ప్రవాసీలు భావిస్తున్నారు. ముసాయిదాలో ఉన్న అంశాలు ఇవీ.. ♦ గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు వీసా చార్జీ లు, రిక్రూట్మెంట్ ఫీజులు తదితర ఖర్చు ల కోసం పావలా వడ్డీ రుణాలు లభిస్తాయి. ♦ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముద్ర పథకంతో అనుసంధానం. అల్పాదాయ కార్మికులను ఆదుకోవడానికి తెలంగాణ స్టేట్ ఎన్నారై వెల్ఫేర్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ♦ ప్రభుత్వం, వృత్తి నిపుణులు, పారిశ్రామికవేత్తలు తదితరుల నుంచి విరాళాలను సేకరించి తెలంగాణ స్టేట్ ఎన్నారై వెల్ఫేర్ ఫండ్‌లో జమ చేస్తారు. ♦ కేంద్ర ప్రభుత్వ పథకాలలో లబ్ది పొందని పేద కార్మికులను ఆదుకోవడానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించడానికి ఈ నిధిని వినియోగిస్తారు. ♦ విదేశాల్లో మరణించిన వారి శవపేటికలను హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వారి స్వగ్రామాలకు తరలించడానికి ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తారు. రేషన్‌కార్డు విధానంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల కుటుంబాలకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం వర్తింపజేస్తారు. ♦ విదేశీ జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం అందిస్తారు. ♦ హైదరాబాద్‌లో ఎన్నారై భవన్‌ను ఏర్పాటు చేస్తారు ♦ గల్ఫ్ దేశాల నుంచి ఇంటికి చేరిన వారికి పునరావాసం, పునరేకీకరణకు ప్రత్యేక పథకం రూపకల్పన జరుగుతుంది. కొత్తగా వ్యాపారాలు, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించుకోవడానికి రుణ సదుపాయం కల్పిస్తారు. ♦ గల్ఫ్ ప్రవాస కార్మికుల కుటుంబాలకు తెల్ల రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీకి రుణాలు, గృహ నిర్మాణం కోసం ఆర్థిక సహాయం వంటి పథకాలను అమలు చేస్తారు. ♦ 24 గంటల పాటు హెల్ప్‌లైన్ ♦ విదేశాల్లో ఉన్న వలస కార్మికులు, ఉద్యోగులు, వృత్తి నిపుణులు, విద్యార్థుల రిజిస్ట్రేషన్ కోసం ‘ప్రవాసీ తెలంగాణ’ వెబ్ పోర్టల్ ఏర్పాటు ♦ ధనవంతులైన ఎన్నారైలు గ్రామాలను దత్తత తీసుకునేలా ప్రోత్సాహం అందించడం. ♦ ప్రవాసుల సంక్షేమానికి తగిన బడ్జెట్‌ను కేటాయించడం. ఎన్నారై పాలసీని సాధించుకోవాలి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ప్రవేశపెట్టిన లక్ష రూపాయల మృతధన సహాయం ఇప్పుడెందుకు ఆగిపోయింది. ప్రవాసులకు రూ.500 కోట్ల కేటాయింపు ఏమైంది. గల్ఫ్‌లోని ఎంబసీలలో తెలుగు మాట్లాడే సిబ్బందిని నియమించాలి. మనమంతా ఒక్కటై ఎన్నారై పాలసీని సాధించుకోవాలి.–మెట్టా హేమలత, దుబాయి హామీ ఇచ్చి ఆరేళ్లు.. ఎన్ఆర్ఐ పాలసీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నారైలు అంతా కలిసి రాష్ట్ర సాధనకు ఎంతో కృషి చేశారు. కేటీఆర్ దుబాయిలో పర్యటించినప్పుడు ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆరేళ్లు గడుస్తున్నప్పటికీ ఆ ఊసే లేదు. ఎన్నారై పాలసీ అమలైతే గల్ఫ్‌లోని కార్మికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. మోసపోయిన కార్మికులను న్యాయపరంగా ఆదుకునే అవకాశం ఉంటుంది. – కట్కం రవి, తెలంగాణ గల్ఫ్కల్చరల్ అసోసియేషన్ కోశాధికారి, దుబాయి నకిలీ ఏజెంట్లను అరికట్టవచ్చు ఎన్ఆర్ఐ పాలసీ అమలైతే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులను మోసం చేసే ఏజెంట్లను అరికట్టవచ్చు. అంతేకాకుండా ఎన్ఆర్ఐ పాలసీ అమలు వల్ల కార్మికులు వెళ్లే దేశాల నియమ నిబంధనలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో వారికి ఒక చట్టబద్దత కల్పించే అవకాశం ఉంది. అంతేకాకుండా కార్మికులకు చట్టపరంగా రక్షణ ఉంటుంది. ఇన్సూరెన్స్ కల్పించే అవకాశం ఉంది. – రఘుపతిరెడ్డి, రాయికల్ వెంటనే అమలు చేయాలి ఎన్ఆర్ఐలు.. ప్రధానంగా గల్ఫ్ కార్మికులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఎన్ఆర్ఐ పాలసీని వెంటనే అమలు చేయాలి. ఎన్ఆర్ఐ పాలసీ అమలులో కాలయాపన తగదు. ఎన్ఆర్ఐలకు పెన్షన్ పథకం అమలు చేయాలి. ప్రత్యేక బీమా పథకం కూడా అమలు చేయాలి. ఎన్ఆర్ఐలకు రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలి. వారి పిల్లలకు ఉచిత విద్య అందించే ఏర్పాట్లు చేయాలి. ఇవన్నీ ఎన్ఆర్ఐ పాలసీ ద్వారానే సాధ్యమవుతుంది. ఎన్ఆర్ఐ పాలసీ అమలులో నిర్లక్ష్యం సరైంది కాదు. – స్వర్ణ సుధాకర్, బహ్రెయిన్ వలస కార్మికుల జీవితానికి భరోసా కల్పించాలి వలస కార్మికులకు ముఖ్యంగా గల్ఫ్ ప్రవాసీలకు వారి జీవితాలపై భరోసా కల్పించాలి. ఇది ఎన్ఆర్ఐ పాలసీతోనే సాధ్యమవుతుంది. వలస కార్మికులకు ఆర్థిక భద్రత, ఆరోగ్య పరిరక్షణ, ఉద్యోగ భద్రత లభించడానికి ఎన్ఆర్ఐ పాలసీ ఒక్కటే మార్గం. ఎన్ఆర్ఐ పాలసీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు. ఎంతో కాలంగా ఎన్ఆర్ఐ పాలసీ కోసం ఎదురుచూస్తున్నారు. అందరి ఆశలను నిలబెట్టడానికి ప్రభుత్వం చొరవ చూపాలి. – చింతకింది స్వాతి, ఒమన్ ఆచరణలో ముందడుగు పడాలి నాలుగేళ్ల క్రితం ప్రవాసీ పాలసీ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. దీనికి కార్యాచరణ రూపొందించినా అమలులో ఆలస్యం జరుగుతోంది. వచ్చే బడ్జెట్లో ప్రవాసీల సంక్షేమానికి రూ.500కోట్లు కేటాయించాలి. ప్రవాసీ మంత్రిత్వ శాఖ, సచివాలయంతో పాటు జిల్లాలు, మండలాల వారీగాఎన్నారై సెల్ ఏర్పాటు చేయాలి. విదేశాల్లో చనిపోయిన వారికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ఎయిర్‌పోర్టులో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలి. ప్రవాసీల వివరాల కోసం సమగ్ర సర్వే నిర్వహించాలి. వలసలకు కారణాలను వి శ్లేషించి తదనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది. ప్రవాసీలకు పింఛన్, ప్రమాద బీమా, పునరావాసం కల్పించాలి. – బొలిశెట్టి వెంకటేశ్, ఎన్నారై, బహ్రెయిన్ పాలసీతో భరోసా ఇవ్వాలి.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్నారై పాలసీపై దృష్టిపెట్టాలి. మా వేదిక తరఫున చాలాసార్లు నిరసనలు, ఆందోళన తెలిపాం. పలు డిమాండ్లను ప్రభుత్వానికి తెలిపాం. ఉపాధి కోసం వచ్చి విదేశాల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.15లక్షలు ఇవ్వాలి. నకిలీ ఏజెంట్లపై చర్యలు చేపట్టాలి. విదేశాల్లో నివసించే అర్హులకూ కూడా పథకాలు అందేలా చూడాలి. మండలాల వారీగా యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు చేపట్టాలి. విదేశాల్లో చనిపోయినవారిని తీసుకురావడానికి ఆర్థికసాయం చేయాలి. వారి ఇంటి వరకూ మృతదేహం చేరేందుకు అయ్యే ఖర్చులు భరించాలి. గల్ఫ్ దేశాల్లో సహాయ కేంద్రాలు, హైదరాబాద్‌లో ఎన్ఆర్ఐ భవన్ ఏర్పాటు చేయాలి. జైళ్లలో మగ్గుతున్న వారికి న్యాయ సహాయం చేయాలి. – దొంతుల శివాజీ, గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక కన్వీనర్, సౌదీ అరేబియా పాదయాత్రకు సిద్ధం.. ఇప్పటికీ తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు కొనసాగుతునే ఉన్నాయి. అవగాహన లేక ఏజెంట్ల, కంపెనీల మోసాలకు వందలాది మంది బలవుతున్నారు. ఇక్కడి చట్టాలపైనా అవగాహన లేకపోవడంతో ఎంతోమంది గల్ఫ్ దేశాల జైళ్లలో మగ్గుతున్నారు. వాళ్ల కుటుంబాలు స్వదేశంలో అనాథలుగా మిగిలాయి. ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఏడాదికి దాదాపు రూ.1200 కోట్ల రాబడి మా నుంచి తెలంగాణ ప్రభుత్వానికి వెళ్తోంది. దాన్నుంచే గల్ఫ్ బాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాం. ఇక ఎన్నారై పాలసీ కోసం రెండున్నరేళ్ల నుంచి గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ద్వారా పోరాడుతూనే ఉన్నాం. ఎన్నో నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే.. గల్ఫ్ వలస ప్రాంతాలైన ఖానాపూర్, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, సిరిసిల్ల తదితర ప్రాంతాల మీదుగా హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపడతాం. ఇందులో భాగంగా ప్రతీ ఊరిలో బాధితుల కష్టాలను తెలుసుకుంటాం. ఎన్నారై పాలసీ అమలు కోసం ఆమరణదీక్ష చేసేందుకైనా సిద్ధంగా ఉన్నా. – దొనికెన కృష్ణ, గల్ఫ్‌కార్మికుల అవగాహన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, యూఏఈ -
100 రోజుల్లో ఎన్నారై పాలసీ: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ అభయ’హస్తం’అందించింది. బీమా సౌకర్యం కల్పిస్తామంటూ ధీమా ఇచ్చింది. గల్ఫ్ దేశాలబాట పట్టిన తెలంగాణ చిన్న, సన్నకారు రైతులకు ‘రైతుబంధు’పథకం ప్రయోజనాలు చేకూరుస్తామని హామీ ఇచ్చింది. విదేశాల్లో ఉంటున్న రైతులకు కూడా రూ.5 లక్షల జీవితబీమా కల్పిస్తామని ప్రకటించింది. ఈ మేరకు ‘గల్ఫ్ భరోసా’పేరుతో కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ మేనిఫెస్టోను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఇక్కడ విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎన్నారై పాలసీని రూపొందిస్తామని, ఎన్నారై రైతుల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు వ్యవసాయశాఖ కమిషనరేట్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, ప్రతి యేటా సంక్షేమనిధి కింద రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ హామీలివే... ♦ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సమగ్ర ఎన్నారై పాలసీ ♦ గల్ఫ్ కార్మికుల సంక్షేమనిధికి ప్రతియేటా రూ.500 కోట్ల బడ్జెట్ ♦ గల్ఫ్‌లో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా. (గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన సంవత్సరంలోపు ఇక్కడ మరణించినవారికి కూడా వర్తింపు) ♦ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ♦ గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న వలస కార్మికులకు, ఎన్నారైలకు న్యాయ సహాయం ♦ వలస కార్మికుల పేర్లు రేషన్‌కార్డుల్లో కొనసాగింపు. గల్ఫ్ కార్మికులకు ఆరోగ్యశ్రీ వర్తింపు ♦ వలస కార్మికులకు జీవిత, ప్రమాద బీమా, ఆరోగ్యబీమా, పెన్షన్లతో కూడిన ‘ప్రవాసీ యోగక్షేమ’ పథకం ♦ ఎన్నారైలు, గల్ఫ్ కార్మికులకు పునరావాసం ♦ మానవ అక్రమ రవాణా అరికట్టడానికి రిక్రూటింగ్ వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ, అవగాహన సదస్సులు ♦ గల్ఫ్‌కు వెళ్ళడానికి అవసరమై న ‘గమ్కా’మెడికల్ చెకప్ చార్జీల రీయింబర్స్మెంట్ ♦ ఉద్యోగాల కోసం రిక్రూటింగ్ ఏజెన్సీలకు చెల్లించాల్సిన సర్వీస్‌చార్జీలు, ఇతర ఖర్చులు బ్యాంకు రుణా ల ద్వారా మంజూరు ♦ జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేక ఎన్నారై విభాగాలు ♦ రాష్ట్రంలోని అన్ని వర్సి టీల్లో వలసలపై అధ్యయన కేంద్రాలు ♦ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) కేంద్రాల బలోపేతం, ప్రతి సబ్ డివిజన్ కేంద్రంలో నైపుణ్య శిక్షణ కేం ద్రాలు ♦ గల్ఫ్ కార్మికుల సామాజిక భద్రత కోసం విధివిధానాల రూపకల్పన ♦ ఏటా అధికారికంగా ‘ప్రవాసీ తెలంగాణ దివస్’ ♦ గల్ఫ్ దేశాల్లోని ప్రవాసీ తెలంగాణ సంస్థలను, వ్యక్తులను గుర్తించి, అనుసం ధానపరచి ప్రోత్సహించి సమస్యల పరిష్కారంలో వారిని భాగస్వాములను చేయడం ♦ హైదరాబాద్‌లో సౌదీ కాన్సులేట్, యూఏఈ కాన్సులేట్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తాం. ఎంబసీల్లో తెలుగు అధికారుల నియామకానికి కృషి. -
గళమెత్తిన గల్ఫ్ వలసజీవులు
సిరిసిల్ల: మూడున్నరేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీ రూపొందించక పోవడంపై గల్ఫ్ వలసజీవులు శుక్రవారం నిరసన గళమెత్తారు. బతుకుదెరువు కోసం గల్ఫ్‌బాట పట్టిన వలసజీవులు సర్కారుపై నిరసన తెలిపారు. నాన్ రెసిడెంట్ ఇండియన్ (ఎన్ఆర్ఐ) పాలసీ రూపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్లుగా విఫలమైందని పేర్కొంటూ నిరసన గళాన్ని వినిపించారు. దుబాయ్‌లోని జబిల్‌పార్క్‌లో ప్రవాస తెలంగాణ వలసజీవులు సమావేశమై ఎన్ఆర్ఐ పాలసీ రూపొందించాలని డిమాండ్ చేశారు. తొలిసారిగా దుబాయ్‌లో ఒకే వేదికపై తెలంగాణ గల్ఫ్ సంఘాలు, ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశమై వలసజీవుల కష్టాలను చర్చించుకున్నారు. నకిలీ గల్ఫ్ ఏజెంట్లను నిరోధించి విజిటింగ్ వీసాలపై గల్ఫ్‌కు పంపే విధానాలను అడ్డుకోవాలని కోరారు. గల్ఫ్‌కు వెళ్లేవారికి ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని, గల్ఫ్‌బాటలో నష్టపోయి ఇంటికి చేరినవారికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. గల్ఫ్‌లో ఎవరైనా చనిపోతే మృతదేహం స్వగ్రామం చేరేవిధంగా భారత ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలను చేపట్టాలని వారు కోరారు. తెలంగాణ ప్రవాసుల కోసం రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేకనిధి ఏర్పాటు చేసి సంక్షేమం, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. రెండు నెలల గడువు రెండునెలల్లో ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీని రూపొందించే విషయంలో స్పందించాలని వలస జీవులు కోరారు. లేకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని దుబాయ్‌లోని తెలంగాణ సంఘాలు నిర్ణయించాయి. -
తెలంగాణలో కొత్త ఎన్ఆర్ఐ పాలసీ
-
టీ-ఎన్నారై పాలసీ కోసం కొనసాగుతున్న లక్ష సంతకాల సేకరణ
అబుదాబి : టీ-ఎన్నారై పాలసీ కోసం తెలంగాణ నుంచి వలస వెళ్లిన గల్ఫ్ వాసుల కోసం ‘గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక’ చేస్తున్న లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగుతోంది. శనివారం యూఏఈ రాజధాని అబుదాబి, ముస్సఫా, బనియస్ చైన్ క్యాంప్స్, షార్జ్ అలిముస, రస్ అల్ ఖైమ, షార్జ్ సజ్జ తదితర ప్రాంతాల్లో సంతకాల సేకరణ జరిగింది. అశోక్ నాలం, వెంకీ(దుబాయ్), హన్మండ్లు(బహ్రయిన్), నర్సన్న(మస్కట్), శంకర్(మస్కట్), శ్రీనివాస్ రస్ అల్ ఖైమ, శరత్, సాయినాథ్‌లు సంతకాల సేకరణ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. -
గల్ఫ్ కన్నీళ్లు ఇంకెన్నాళ్లు?
తెలంగాణలో గల్ఫ్ మాయాజాలం మళ్లీ మొదలైంది. పొట్టచేతబట్టుకొని ఎడారి దేశాలకు వెళ్లి మోసపోతున్న వలస జీవుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. బోగస్ ఏజెంట్లు.. నకిలీ వీసాలు, విజిట్ వీసాలు అంటగట్టి ఎన్నో కుటుంబాలను నట్టేట ముంచుతున్నారు. గల్ఫ్ బాధితులకు అండగా ఉండేందుకు ప్రత్యేక ఎన్ఆర్ఐ పాలసీ తెస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించినా ఆ దిశగా ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. ఫలితంగా గల్ఫ్ కన్నీటి గాథలు రోజుకోచోట వినిపిస్తూనే ఉన్నాయి. దాదాపు పది లక్షల మంది తెలంగాణవాసులు గల్ఫ్ దేశాల్లో ఉన్నట్లు అనధికార లెక్కలున్నాయి. వీరికి తోడు.. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఆ దేశాలకు పయనమవుతున్నారు. ఉన్న ఊరిలో పని దొరక్కపోవటం.. అక్కడికి వెళ్తే ఏదో ఓ పని చేసుకోవచ్చనే మొండి ధైర్యం.. ఇక్కడ ‘రూపాయి’ కష్టానికి అక్కడ పది రూపాయలొస్తాయనే ఆశలు.. తెలంగాణ యువతను గల్ఫ్ బాట పట్టేలా ప్రేరేపిస్తున్నాయి. వీరి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటూ నకిలీ ఏజెంట్లు రెచ్చిపోతున్నారు. ఉత్తర తెలంగాణలో పెరిగిపోతున్న వీరి ఆగడాలు, ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అంశాలు, ఎన్ఆర్ఐ పాలసీపై ఫోకస్... – బొల్గం శ్రీనివాస్, సాక్షి ప్రతినిధి గల్ఫ్ దేశాల్లో ఉపాధితోపాటు పాస్‌పోర్టులు మొదలు వీసాలు, టికెట్ల సేవలందించేందుకు తెలంగాణలో దాదాపు 2,800 మంది ఏజెంట్లున్నారు. వీరిలో 2,772 మంది బోగస్ ఏజెంట్లే. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన లైసెన్స్డ్ కంపెనీలు కేవలం 28. అందులో రెండు ప్రభుత్వ ఏజెన్సీలే. అవి ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (ఓమ్కాం), తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పాటు చేసిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (టామ్‌కాం). వీటితోపాటు మరో 26 కంపెనీలకు మాత్రమే ఈ లైసెన్స్ ఉంది. లైసెన్స్ ఉన్న కంపెనీలను మాత్రమే ఆశ్రయించాలనే ప్రచారం లేకపోవటంతో వలస జీవులు బోగస్ ఏజెంట్ల బారిన పడి మోసపోతున్నారు. చిన్న చిన్న కంపెనీలు పంపే వీసాలు, విజిట్ వీసాలు చూపించి ఏజెంట్లు అమాయకుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ‘విజిట్ వీసాలతో వెళ్తే.. అక్కడేదైనా పని వెతుక్కోవచ్చు.. తిరిగి వచ్చేటప్పుడు రెండుమూడు రోజులు జైల్లో ఉంటే వాళ్లే పంపిస్తారు..’ అని మాయమాటలు చెప్పి సాగనంపుతున్నారు. తీరా అక్కడికి వెళ్లాక వీసాలు చెల్లక.. పని దొరక్క.. దొరికినా ఇక్కడ ఏజెంట్లు చెప్పిన జీతానికి అక్కడ ఇచ్చే జీతానికి పొంతన లేక వలసజీవులు చిత్తవుతున్నారు. తిరిగి సొంత దేశానికి రాలేక నానా అవస్థలు పడుతున్నారు. లైసెన్స్ ఉంటే పక్కాగా.. విదేశాల్లో ఉద్యోగ నియామకాలు జరిపే కంపెనీలు విధిగా కేంద్ర విదేశాంగ శాఖ లైసెన్స్ పొంది ఉండాలి. కేంద్రం వద్ద రూ.50 లక్షలు డిపాజిట్ చేయాలి. వారికి అనుమతించిన పరిధిలోనే నియామకాలు జరపాలి. ఉద్యోగ వివరాలతో పత్రికా ప్రకటన ఇవ్వాలి. వీటిని పాటించని కంపెనీలపై ఫిర్యాదు చేస్తే కేంద్రం వాళ్ల డిపాజిట్‌ను జప్తు చేస్తుంది. లైసెన్స్ రద్దవుతుంది. కానీ స్థానికంగా పోలీసు, రెవెన్యూ విభాగాలు నకిలీ ఏజెంట్లు బహిరంగంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నా, ప్రకటనలు జారీ చేస్తున్నా కఠినంగా వ్యవహరించటం లేదు. సిరిసిల్ల జిల్లా ఒక్కటే ఆదర్శం గల్ఫ్ మోసాలు, బాధితుల సంఖ్య పెరిగిపోవటంతో గతేడాది రాష్ట్ర ప్రభుత్వం బోగస్ ఏజెంట్ల ఏరివేతకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో సిరిసిల్ల, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నుంచి గల్ఫ్ వెళ్లే వారి సంఖ్య ఎక్కువ. అందుకే లైసెన్స్ లేని ఏజెంట్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అక్కడి పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. దీంతో సిరిసిల్ల జిల్లాలో పోలీసు యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. లైసెన్స్ లేని ఏజెంట్లందరినీ బైండోవర్ చేసి.. గల్ఫ్ వీసాలు ఇప్పించే ట్రావెల్ ఏజెన్సీలన్నీ మూసేయించింది. మిగతా జిల్లాల్లో ఈ ప్రక్రియ ముందుకుసాగలేదు. దీంతో క్రమంగా ఈ చర్య అడ్డదారులకు తావిచ్చింది. ఇప్పుడు సిరిసిల్ల ప్రాంతంలోని ఏజెంట్లు ఇతర జిల్లాలకు వెళ్లి వీసాలు అమ్ముకుంటూ తమ దందాను ఎప్పట్లాగే కొనసాగిస్తున్నారు. కేటీఆర్‌పైనే ఆశలు.. ప్రభుత్వం రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రవాసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి దాని బాధ్యతలను మంత్రి కేటీఆర్‌కు అప్పగించింది. దీంతో గల్ఫ్‌లో ఉన్న తెలంగాణవాసుల్లో కొత్త ఆశలు చిగురించాయి. నకిలీ ఏజెంట్లను అరికట్టడంతోపాటు మృతదేహాల తరలింపు, పెన్షన్లు, ఎక్స్‌గ్రేషియా తదితర అంశాలతో ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ పాలసీ రూపొందిస్తామని మంత్రి ప్రకటించారు. గల్ఫ్‌లో తెలంగాణవారి సంక్షేమానికిపాటు పడే సంస్థలు, వివిధ సంఘాల ప్రతినిధులతో ఎన్ఆర్ఐ పాలసీ ముసాయిదా తయారీకి గతేడాది జూలై 27న ప్రత్యేకంగా సదస్సు నిర్వహించారు. కానీ ఇప్పటికీ ఈ పాలసీని ప్రభుత్వం ప్రకటించకపోగా.. సదస్సులో వివిధ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు అమలుకు నోచుకోలేదు. పత్రికల్లో వచ్చే వార్తలు, బాధితుల నుంచి వచ్చే విజ్ఞప్తుల మేరకు గల్ఫ్ జైళ్లలో చిక్కుకున్న వారు, మృతదేహాలను స్వదేశాలకు రప్పించేందుకు పలు సందర్భాల్లో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకోవటం తప్ప.. విధాన ప్రకటన దిశగా చర్యలు తీసుకోవడం లేదు. తెల్లకార్డుకు మృతదేహానికి లింక్ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, కువైట్, ఖతార్, బహ్రెయిన్‌తోపాటు సింగపూర్, మలేసియా తదితర దేశాల్లో ప్రమాదాలు, ఆత్మహత్యలు, వివిధ కారణాలతో ఏటా దాదాపు 200 మందికిపైగా తెలంగాణవాసులు చనిపోతున్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గల్ఫ్ దేశాలలో దాదాపు 540 మంది చనిపోయారు. వారిలో కొందరికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించగా.. స్వచ్ఛంద సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొన్ని మృతదేహాలు నెలల తరబడి నిరీక్షించిన తర్వాత స్వదేశానికి చేరాయి. మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని కొంతకాలంగా బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నా ఇప్పటికీ నెరవేరలేదు. విదేశాల నుంచి వచ్చే మృతదేహాలను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి స్వగ్రామాలకు తరలించేందుకు ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుతో ముడిపెట్టింది. ఈ కార్డు ఉన్న వారికి మాత్రమే ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తోంది. ఈ నిబంధనను సడలించి అందరికీ అంబులెన్స్ సదుపాయం కల్పించాలని, ఎయిర్‌పోర్ట్‌లో గల్ఫ్‌కు సంబంధించి హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి వివిధ సంఘాలు విజ్ఞప్తి చేసినా అమలుకు నోచుకోలేదు. కామ్‌గా.. టామ్‌కాం నకిలీ ఏజెంట్లకు అడ్డుకట్ట వేయటంతోపాటు గల్ఫ్‌లో ఉపాధి అవకాశాలకు తెలంగాణలోని యువతను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వమే రెండేళ్ల కిందట టామ్‌కాం ఏజెన్సీని ఏర్పాటు చేసింది. గల్ఫ్ కంపెనీలతో ఒప్పందం చేసుకొని.. ఇక్కడి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు టామ్‌కాం క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంది. జిల్లాల్లోని ఉపాధి కల్పన కేంద్రాలు, ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న యువతకు టామ్‌కాం ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించి వీసాలు ఇప్పించాలి. దాదాపు 30 వేల మంది యువకులు ఇప్పటికే టామ్కాంలో రిజిస్టర్ చేసుకున్నారు. అయితే సంస్థ క్రియాశీలంగా వ్యవహరించకపోవటంతో నకిలీ ఏజెంట్లు చెలరేగిపోతున్నారు. గడిచిన రెండేళ్లలో దాదాపు 2 వేల మందిని గల్ఫ్‌కు పంపించినట్లు ఈ ఏజెన్సీ చెబుతున్నా.. వారిని కూడా ప్రైవేటు ఏజెన్సీల ద్వారానే పంపించారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటివరకూ ఈ వెబ్‌సైట్‌ను సైతం అప్డేట్ చేయలేదు. ఇటీవల నల్లగొండ జిల్లాకు చెందిన బోయపల్లి రంగారెడ్డిని ప్రభుత్వం టామ్‌కాంకు చైర్మన్‌గా నియమించింది. గల్ఫ్ వలసలు తక్కువగా ఉండే ప్రాంతం నుంచి ఈ నియామకం చేపట్టడం కూడా గల్ఫ్ బాధిత వర్గాల్లో చర్చకు తెరదీసింది. గల్ఫ్‌లో ఉన్నవారెందరు? తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారెందరన్న వివరాలు ప్రభుత్వం దగ్గర కూడా పక్కాగా లేవు. దాదాపు 8 లక్షల మంది నుంచి 10 లక్షల మంది ఉన్నట్లు గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చర్ అసోసియేషన్‌తోపాటు గల్ఫ్‌లో తెలంగాణవాసుల సంక్షేమానికి పని చేసే సంఘాలు చెబుతున్నాయి. పలు ఏజెన్సీల లెక్క కూడా ఇంచుమించు ఇంతే ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 15 నుంచి 59 ఏళ్ల మధ్య విదేశాలకు వెళ్లిన వారి సంఖ్య 97 వేలు మాత్రమే అని తేలింది. ఓటుహక్కు, రేషన్ కార్డు, ప్రభుత్వ పథకాలు కత్తిరిస్తారనే భయంతో గల్ఫ్‌కు వెళ్లిన వారి కుటుంబీకులు సర్వేకు వచ్చిన బృందాలకు తప్పుడు సమాచారం ఇచ్చారని, అందుకే ఈ సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉందనే వాదనలున్నాయి. అందుకే రాష్ట్రం నుంచి విదేశాలకు వలస వెళ్లిన వారి వివరాలు సేకరించడానికి మరో సమగ్ర సర్వే నిర్వహించాల్సి ఉంది. ఈ సర్వే ఖర్చులో సగం భరించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ సర్వేతో వలసకు కారణాలు, సామాజిక, ఆర్థిక కోణం, వలస వెళ్ళిన వారి సంఖ్య, వారి విద్యార్హతలు, సాంకేతిక పరిజ్ఞానం, వయసు, ఏయే దేశాలకు ఏయే జిల్లాల వారు వెళ్తున్నారనే విషయాలు తెలుస్తాయి. ఈ సర్వే ఆధారంగా ఎన్ఆర్ఐ పాలసీ, భవిష్యత్ ప్రణాళికలు పక్కాగా తయారు చేసే అవకాశం ఉంటుంది. ఆత్మహత్యలు పెరుగుతున్నాయి గల్ఫ్‌లో విపత్కర పరిస్థితులున్నాయి. తెలంగాణ వచ్చాక తమకు భరోసా ఉంటుందనే ధీమా ప్రవాసీయుల్లో సడలుతోంది. ఇటీవల ఆత్మహత్యలు చేసుకునే సంఖ్య పెరిగిపోయింది. 2009లో ఇలాంటి పరిస్థితి ఉండేది. క్యాంపులకు వెళ్లి కౌన్సెలింగ్ చేస్తున్నాం. ఇటీవలే ఇద్దరు సిరిసిల్ల ప్రాంతానికి చెందిన యువకులు కంపెనీ వీసా అని మోసపోయి విజిట్ వీసాతో గల్ఫ్‌కు వెళ్లి ఇబ్బందుల్లో పడ్డారు. గత నెలలోనే 14 మంది జగి త్యాలæ ప్రాంత వాసులు ఓ ఏజెంట్‌ను నమ్మి కంపెనీ వీసా ఇప్పిస్తామంటే దుబాయ్‌కి విజిట్ వీసాపై వెళ్లారు. అక్కడికెళ్లాక ఇరుకైన గదిలో ఉంచి ఇబ్బందుల పాల్జేశారు. తిరిగి వెళ్దామంటే వీసా టైం అయిపోయింది. రిటర్న్ టికెట్ లేదు. పాస్‌పోర్టు లేదు. విజిట్ వీసాలు వేరు. ఉద్యోగ వీసాలు వేరు. ఏజెంట్ల మాయమాటలు నమ్మకండి. లెసైన్స్డ్ ఏజెన్సీలు నిర్వహించే ఇంటర్వ్యూల ద్వారా వెళితే ఉపాధికి గ్యారంటీ ఉంటుంది. లైసెన్స్ లేని ఏజెంట్లను పోలీసులకు పట్టించండి. గల్ఫ్‌లో ఉన్న తెలంగాణ వాసులకు అండగా ఉండేలా ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీని రూపకల్పన చేయాలి. ఏటా బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించాలి. టామ్‌కాం కార్యకలాపాలను విస్తరించి నిరుద్యోగులకు చేరువ చేయాలి – జువ్వాడి శ్రీనివాసరావు, తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్రోకర్లను నియంత్రిస్తాం గల్ఫ్ దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కొన్ని ఏజెన్సీలు పెద్ద మొత్తంలో దండుకుంటున్నాయి. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పుచ్చుకుని విదేశాలకు పంపుతున్నాయి. అక్కడ ఉద్యోగం దొరి కిందా సరే.. లేకుంటే అంతే సంగతి. బ్రోకర్ సంస్థల ఆటలను కట్టడి చేసేందుకే టామ్‌కాం ఏర్పాటు చేశాం. ప్రభుత్వం తర ఫున ఎంపికై వెళ్లడమే శ్రేయస్కరం. త్వరలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ తయారు చేస్తున్నాం. – బోయపల్లి రంగారెడ్డి, టామ్‌కాం చైర్మన్ త్వరలో ప్రత్యేక వెబ్సైట్ ఓవర్సీస్లో పనిచేసేందుకు అభ్యర్థుల నుంచి డిమాండ్ ఉన్నా రిజిస్ట్రేషన్ పెరగడం లేదు. ప్రస్తుతం టీఎస్ ఆన్లైన్ కేంద్రా ల్లోనే రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంది. త్వరలో ప్రత్యేక వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాం. ఇప్పటివరకు 79 మందికి గల్ఫ్ దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాం. ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా గల్ఫ్‌దేశాల్లో ఉద్యోగం పొందడమే మంచిది. టామ్‌కామ్ సంస్థపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పిస్తాం. ఈ మేరకు జిల్లాల్లో ఉన్న ఉపాధి కల్పన అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ప్రతి జిల్లాలో మైగ్రేట్ రిసోర్స్ కేంద్రాలను తెరుస్తాం. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వారి వివరాలను అందులో నమోదు చేస్తాం. అక్కడ డిమాండ్ ఉన్న కొలువులకు ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నాం. – కేవై నాయక్, టామ్‌కాం మేనేజింగ్ డైరెక్టర్ నకిలీ వీసాతో మోసం నేను డిగ్రీ వరకు చదువుకున్న. భార్యా, ఇద్దరు పిల్లలున్నారు. ఊళ్లో భూమి లేదు. కొన్నేళ్లుగా కూలీ పనులు చేసి బతుకుతున్న. వచ్చే కూలీతో మా కుటుంబం గడవడం కష్టంగా మారింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నర్సింహులపల్లెలో ఓ మహిళా ఏజెంట్ పరిచయమైంది. ఖతార్‌లో మంచి పని, వేతనం ఉందని చెప్పింది. నా తల్లి, భార్య వద్ద ఉన్న బంగారం తాకట్టు పెట్టి రూ.70 వేలు తెచ్చి కట్టిన. 15 రోజుల్లోగా ఖతార్‌కు పంపిస్తానని చెప్పి నకిలీ వీసా, నకిలీ ఫ్లైట్ టికెట్ ఇచ్చి మోసం చేసింది. డబ్బులు, పాస్‌పోర్టు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతోంది. – వంగపెల్లి భూపతి, కనగర్తి, కోనరావుపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా డబ్బులు మిత్తికి తెచ్చిన.. నేను తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న. ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసిన. కూలీకి పోతే కుటుంబం గడుస్తలేదు. అందుకే గల్ఫ్ పోదామనుకున్న. మా గ్రామానికి చెందిన మల్లేశం ద్వారా ప్రమీల అనే ఏజెంట్‌కు డబ్బులు కట్టిన. ఖతార్‌లో మంచి ఉద్యోగం ఇప్పిస్తమన్నరు. రెండ్రూపాయల మిత్తికి రూ.70 వేలు తెచ్చి ముట్టజెప్పిన. పాస్‌పోర్టు కూడా ఇచ్చిన. కానీ నకిలీ వీసాలు ఇచ్చి మోసం చేశారు. ఇప్పుడు ఏజెంట్, మధ్యవర్తి తప్పించుకు తిరుగుతుండ్రు. – రావులపెల్లి మల్లారెడ్డి, కనగర్తి, రాజన్న సిరిసిల్ల జిల్లా గల్ఫ్ బాధితుల విజ్ఞప్తులివీ.. కేరళ తరహాలో ప్రవాసీల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలి. విదేశాలకు వెళ్లే కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలి విదేశాలకు వలస వెళ్లే కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండేలా ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రవాసీ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వలస వెళ్లే కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చైతన్య సదస్సులు నిర్వహించాలి మోసపోయి తిరిగొచ్చిన వలస కార్మికులకు పునరావాసం కల్పించాలి. వారి అనుభవాన్ని, వృత్తి నైపుణ్యాన్ని వినియోగించుకోవాలి. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) కేంద్రాలను బలోపేతం చేయాలి. నైపుణ్య శిక్షణా కేంద్రాలను ప్రతి సబ్ డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలి సచివాలయంలోని ఎన్నారై సెల్‌ను అందరికీ అందుబాటులో ఉండేలా బయట ఏర్పాటు చేయాలి వలసవెళ్లిన వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించొద్దు. మానవ అక్రమ రవాణాను అరికట్టాలి. రిక్రూటింగ్ వ్యవస్థపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలి. ఏజెంట్లను నియంత్రించాలి. విదేశీ జైళ్లలో మగ్గుతున్న వారికి న్యాయ సహాయం చేసి, వారి విడుదలకు కృషి చేయాలి విదేశాల్లోని భారతీయుల కోసం తక్షణం స్పందించే ఆన్లైన్ వ్యవస్థ ’మదద్’ (కాన్సులార్ సర్వీసెస్ మేనేజ్మెంట్ సిస్టం) ఉంది. ఇదే తరహాలో గల్ఫ్ కుటుంబాలకు సాయమందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ పెన్షన్ సిస్టం (ఎన్పీఎస్)లో ప్రవాస భారతీయులందరూ చేరవచ్చు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అవగాహన సదస్సులు, ప్రచారం నిర్వహించాలి. -
తక్షణమే ఎన్నారై పాలసీ ప్రకటించాలి: కాంగ్రెస్
హైదరాబాద్: గల్ఫ్ ఎన్నారైల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, టీ కాంగ్రెస్ ఎన్నారై సెల్ చైర్మన్ వినోద్‌లు ఆరోపించారు. మీడియాతో వారు మాట్లాడుతూ గత ఏడాది జూలైలో ఎన్నారై పాలసీ తయారు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించగా ఎన్నారై ప్రతినిధులు సలహాలు, సూచనలు ఇచ్చారని, అయితే ఇంత వరకు ఆ పాలసీని అమలు చేయడం లేదన్నారు. మూడేళ్లలో 600 మంది గల్ఫ్‌లో చనిపోగా ప్రభుత్వం ఒక్క పైసా సాయం చెయ్యలేదని, అక్కడ జైళ్లలో ఉన్న మనవారికి న్యాయ సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్నవారికి సహాయంగా ఎవరైనా వెళితే వంద రియాజ్‌లు పన్ను కట్టాల్సి వస్తోందన్నారు. గల్ఫ్ ఎన్నారైల నుంచి మన ప్రభుత్వానికి నెలకు రూ. 50 కోట్లు పన్ను రూపంలో వస్తోందని వివరించారు. ప్రభుత్వం తక్షణం పాలసీ ప్రకటించాలని, గత మూడేళ్లలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి సమస్యలపై అసెంబ్లీలో చర్చకు కాంగ్రెస్ పట్టుబడుతుందని సురేష్‌రెడ్డి, వినోద్‌లు తెలిపారు. -
గల్ఫ్ కష్టాలపై కేటీఆర్‌కు నివేదిక
యూఏఈలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మికులు పడుతున్న సమస్యలపై దుబాయ్‌లోని గల్ఫ్ సంక్షేమ సంఘ ప్రతినిధులు బుధవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో నిర్వహించిన ఎన్ఆర్ఐ పాలసీ సమీక్ష సమావేశంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు సుమారు 20 నిమిషాల పాటు యూఏఈలో కార్మికులు పడుతున్న సమస్యలపై మంత్రి కేటీఆర్‌కు వివరించారు. వానే తయారుచేసిన నివేదికను మంత్రికి అందజేయడంతో తప్పకుండా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మంత్రి హమీనిచ్చారు. ముఖ్యంగా నివేదిక తయారుచేసినందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌శర్మ, శ్యాముల్, సతీశ్‌రావు, విజయ్, గంగయ్య, వరంగల్‌కు చెందిన రాజాశ్రీనివాస్, నల్గొండకు చెందిన చక్రధర్రావులు పాల్గొన్నారు. -
ఎన్ఆర్ఐ పాలసీ అత్యుత్తమంగా ఉండాలి
మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రూపొందించే ఎన్ఆర్ఐ పాలసీ దేశంలోనే ఉత్తమ పాలసీగా ఉండాలని ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఎన్ఆర్ఐ పాలసీ రూపకల్పనపై సోమవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఎన్ఆర్ఐల కోసం వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను తెలంగాణలో సైతం అమలు చేసేందుకు గల అవకాశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్ఆర్ఐల కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో బుధవారం నగరంలోని హరితప్లాజాలో రాష్ట్ర ప్రభుత్వం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఆయా సంస్థల ద్వారా ఎన్ఆర్ పాలసీ తయారీకి అవసరమైన సలహాలు, సూచనలను స్వీకరించనుంది. ఈ సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. -
త్వరలో ఎన్నారై పాలసీకి తుది రూపు
- ‘టామ్‌కామ్’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ - సంస్థ ద్వారా గల్ఫ్‌లో ఉపాధి పొందిన 250 మందికి వీసాలు - ఎన్నారై పాలసీపై ఈ నెల 16న నిపుణులతో భేటీ సాక్షి, హైదరాబాద్: గల్ఫ్‌తోపాటు విదేశాల్లోని తెలంగాణ పౌరులకు రక్షణ కల్పించేలా తెలంగాణ ఎన్నారై పాలసీని రూపొందిస్తున్నట్లు మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. ఎన్నారై పాలసీకి సంబంధించి ఇప్పటికే ముసాయిదా సిద్ధం చేశామని, ఈ నెల 16న ఎన్నారై సంఘాలు, నిపుణులతో సమావేశం నిర్వహించి పాలసీపై సలహాలు స్వీకరిస్తామన్నారు. ఉపాధి కోసం గల్ఫ్‌తోపాటు విదేశాల కు వెళ్తున్న తెలంగాణ యువతకు చట్టబద్ధంగా ఉద్యోగాలు కల్పించే ‘తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ’ (టామ్‌కామ్) ఆధ్వర్యం లో సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. టామ్‌కామ్‌తో గల్ఫ్‌లో ఉపాధి పొందిన 250 మందికి ఈ సందర్భంగా ఆయన వీసా పత్రాలు అందజేశారు. విదేశాల్లోని యువతకు చట్టబద్ధ ఉపాధి కల్పన లక్ష్యంగా ఏర్పాటైన టామ్‌కామ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లోని ఐదు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. ఒప్పందంలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ఆయా కంపెనీల ప్రతినిధులు జిల్లాలవారీగా ఇంటర్వ్యూలు నిర్వహించి మొదటి దశలో 250 మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకొచ్చారన్నారు. త్వరలో మరో 500 మందికి టామ్‌కామ్ ద్వారా ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. టామ్‌కామ్ కార్యకలాపాలను విస్తరిస్తామన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మా ణం, రూ. 40 వేల కోట్ల పెట్టుబడుల తో 2,300 పరిశ్రమలకు అనుమతుల ద్వారా లక్షలాది మంది తెలంగాణ యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కేటీఆర్ తెలిపారు. టామ్‌కామ్ ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి ప్రమాదం జరిగితే రక్షణ, వారిపై ఆధారపడిన కుటుంబాలకు భరోసా లభిస్తుందన్నారు. గల్ఫ్‌లో ఉపాధి కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మరణించిన నిజామాబాద్ జిల్లా చిట్టాపూర్‌కు చెందిన నర్సయ్య కుటుంబానికి జజీరా ఎమిరేట్స్ పవర్ కంపెనీ ఇచ్చిన రూ. 40.15 లక్షల చెక్కును ఆయన అందజేశారు. చట్టబద్ధ మా ర్గాల్లో విదేశాలకు వెళ్లే వారికి కంపెనీలు, ప్రభుత్వం నుంచి భద్రత లభిస్తుందన్నారు. సమావేశంలో హోం ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీ, టామ్‌కామ్ అధికారులు పాల్గొన్నారు. -
ఎడారి బతుకులకు ఆసరా
తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ ముసాయిదా సిద్ధం ఏజెంట్ల మోసాలపై వలసజీవులకు బాసట విదేశీ యానానికి ముందు నైపుణ్యాల్లో శిక్షణ ఆపదలో ఉన్నవారి కోసం సత్వర చర్యలు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ‘ఎన్ఆర్ఐ సెల్’ మృతుల కుటుంబాలకు లక్ష ఎక్స్‌గ్రేషియా సాక్షి, హైదరాబాద్: ఉపాధి అన్వేషణలో ఎడారి బాట పట్టి కష్టాల కడలిలో చిక్కుకుపోతున్న వలస జీవుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఓ పటిష్ట విధానాన్ని(పాలసీ) రూపొందించింది. దేశం కాని దేశంలో నిస్సహాయ పరిస్థితుల్లో కూరుకుపోయి.. సహాయం కోసం మాతృదేశం వైపు ఆశతో చూసే తెలంగాణ బిడ్డలకు ఆపన్నహస్తం అందించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ‘తెలంగాణ ఎన్ఆర్ఐల సంక్షేమం, రాష్ట్రంలో ఎన్ఆర్ఐల పెట్టుబడులకు పోత్సాహకం’ పేరుతో ప్రభుత్వం ఓ మూసాయిదా పాలసీని సిద్ధం చేసింది. గతేడాది జూలై 3న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సాధారణ పరిపాలన శాఖ దీన్ని రూపొందించింది. ఇం దుకు కేరళలో విజయవంతమైన ఎన్ఆర్ఐ పాలసీని ఆదర్శంగా తీసుకున్నారు. ఆర్థిక, న్యా య, హోం శాఖలు ఈ ముసాయిదా ను ఆమోదించాయి. ఇక దీనికి రాష్ర్ట కేబినెట్ ఆమోదం లభించడమే తరువాయి. ఇది అమల్లోకి వస్తే వలస జీవులకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. నకిలీ ఏజెంట్లను గుర్తించడంలో ప్రజలకు సహకరించేందుకు అధీకృత ఏజెట్లు, అనధికార/నిషేధిత ఏజెంట్ల జాబి తాను ఎన్ఆర్ఐ వెబ్సైట్లో ప్రభుత్వం పెట్టనుంది. బాధిత కుటుంబాలకు పరిహారం పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లి మృత్యువాత పడిన వారికి సంబంధించిన నిరుపేద కుటుం బాలకు ప్రభుత్వం లక్ష రుపాయల పరిహారం అందించనుంది. గతంలో కొన్ని ప్రత్యేకమైన కేసుల విషయంలోనే దీన్ని చెల్లించారు. కొత్త ఎన్ఆర్ఐ విధానం ప్రకారం బాధిత కుటుంబాలన్నింటికీ పరిహారం వర్తించనుంది. ఉమ్మడిరాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రారంభమైన నాటి నుంచి 200 మంది మృతుల కుటుంబాలు పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. సరైన పాలసీ లేకపోవడంతో ప్రభుత్వం ఈ దరఖాస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారి పునరావాసానికీ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఎన్ఆర్ఐలు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించేందుకు సహకారం అందిస్తుంది. సింగిల్ విండో విధానం ద్వారా వారికి అనుమతులిస్తుంది. ఐటీఐలు, ‘ఔట్సోర్సింగ్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ’ సంస్థల ద్వారా నైపుణ్యాల పెంపులో శిక్షణ ఇప్పిస్తుంది. సత్వర చర్యలకు కొత్త యంత్రాంగం ఆపదలో చిక్కుకున్న ఎన్ఆర్ఐలను ఆదుకోవడానికి సత్వర చర్యలు చేపట్టేందుకు సచివాలయంలోని ఎన్ఆర్ఐ విభాగాన్ని ప్రభుత్వం బలోపేతం చేయనుంది. సచివాలయంలో ఎన్ఆర్ఐల కోసం టోల్ ఫ్రీ నెంబర్‌తో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తుంది. వలసలు ఎక్కువగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల కలెక్టరేట్లలో రెవెన్యూ, పోలీస్ అధికారులతో ‘ఎన్ఆర్ఐ సెల్’ ఏర్పా టు చేయనుంది. ఆన్లైన్ ద్వారా జనన, మరణ, వివాహ, ఉద్యోగ ధ్రువీకరణ పత్రాల అటెస్టేషన్ జరపనుంది. విదేశాలకు వెళ్లే ముందు శిక్షణ, కౌన్సెలింగ్, అవగాహన కల్పన కోసం విమానాశ్రమంలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయనుంది. నిరక్షరాస్యులైన బాధితులు భాషా సమస్యను ఎదుర్కోకుండా విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల్లో తెలుగు అనువాదకులను నియమించనుంది. ఎన్ఆర్ఐల సంక్షేమం కోసం అధికారిక వెబ్సైట్ ఏర్పాటు చేసి ప్రభుత్వ విధానాలు వెల్లడిస్తుంది. అలాగే విదేశాల్లోని యాజమాన్యాలకు సమాచారం, సంక్షేమ కార్యక్రమాల అమలు వివరాలు పొందుపరుస్తుంది. కేరళలో విజయవంతం కేరళలో రెండు ప్రభుత్వ సంస్థలు అమలు చేస్తున్న ఎన్ఆర్ఐ పాలసీ విజయవంతమైంది. నోర్కా రూట్స్, నాన్ రెసిడెంట్ కేరలైట్స్ వెల్ఫేర్ బోర్డు అనే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు విదేశాల్లోని మలయాళీల భద్రత, సంక్షేమం కోసం కృషి చేస్తున్నాయి. నోర్కా రూట్స్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల అటెస్టేషన్, విదేశీ ప్రయాణానికి ముందు శిక్షణ, నైపుణ్యాల పెంపు, కాల్ సెం టర్, జాబ్ పోర్టల్, ఉద్యోగాల భర్తీ, గుర్తింపు కార్డుల జారీ తదితర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నాన్ రెసిడెంట్ కేరలైట్స్ వేల్ఫేర్ బోర్డు పనిచేస్తోంది. రెండేళ్లు విదేశాల్లో పని చేసి తిరిగి వస్తే బోర్డులో సభ్యత్వం పొందవచ్చు. బోర్డు ద్వారా ఎన్ఆర్ఐలకు పింఛన్లు, మృతుల కుటుంబాలకు చేయూత అందుతున్నాయి.