ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకోవడంతో రాజకీయ పార్టీలు ప్రతీ అంశంపై దృష్టి సారించాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న ఎన్నారైలు, ఇక్కడున్న వారి కుటుంబ సభ్యుల మద్దతు పొందేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నారై సంక్షేమం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తున్నాయి.
ఎన్నారై విజన్ పేరిట
ఇండియా నుంచి విదేశాలకు వలసలు ఎక్కువగా కొనసాగిన రాష్ట్రాల్లో పంజాబ్, కేరళాలు ముందు వరుసలో ఉంటాయి. పంజాబ్ రాష్టం నుంచి అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు పెద్ద సంఖ్యలో పంజాబీలు ఉపాధి కోసం వలస వెళ్లారు. తర్వాత అక్కడ వ్యాపార రంగాల్లో కూడా రాణించారు. ముఖ్యంగా కెనడా, యుకే, గల్ఫ్ దేశాలలో పంజాబీలు స్థానికంగా ప్రభావం చూపే స్థాయికి చేరుకున్నారను. ఇటీవల ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగించిన ఆందోళనకు మద్దతుగా విదేశాల్లో పలు కార్యక్రమాలు చేపట్టడం, ఆర్థిక అండదండలు అందించడంలో ఎన్నారై పంజాబీలు కీలకంగా వ్యవహారించారు. ఈ ఎన్నికల్లో ప్రవాస పంజాబీలు, వారి కుటుంబ సభ్యుల, బంధువుల ఓట్లు కీలకం కావడంతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నారై పాలసీని ప్రకటించింది. ప్రవాస పంజాబీలు స్థానికంగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా విధానాలు రూపొందిస్తామని హామీ ఇచ్చింది. ఎన్నారైల సమస్యలు పరిష్కరించేందుకు సింగిల్ విండో ఏర్పాటు చేస్తామని కూడా తెలిపింది. అంతేకాదు ప్రవాస పంజాబీలను ఆకర్షించడం ద్వారా టూరిజం సెక్టార్‌ను డెవలప్‌చేస్తామని కూడా తెలిపింది.
ఎన్నారై ఓటుహక్కు
ఇండియాలో పారిశ్రామికంగా సహాకారం అందించే విషయంలో రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న పాలసీల పట్ల ఎన్నారైలు సానుకూలంగానే స్పందిస్తున్నారు. దీంతో పాటు చిరకాలంగా ఉన్న ఎన్నారైలకు ఓటు హక్కు డిమాండ్‌పై సానుకూలంగా స్పందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన కొన్ని పాశ్చాత్య దేశాల్లో ప్రవాసంలో ఉన్న వారికి కూడా ఓటు హక్కును కల్పించాయి. మన దేశంలో ఇంకా ఈ సౌకర్యం లేదు. ఈ అంశంపై ఇప్పటికే పార్లమెంటు సభ్యుడు, అంతర్జాతీయ వ్యవహరాల్లో నిపుణుడైన శశిథరూర్ ఆన్‌లైన్ వేదికగా అనేక డిబెట్లు నిర్వహిస్తున్నారు. దీంతో పోలింగ్ తేదీ దగ్గర పడే సమయానికి ఎన్నారై ఓటింగ్ అంశం మరోసారి బలంగా తెర మీదకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్నారైలకు ఓటు హక్కు కల్పించే విషయంలో రాజ్యంగ పరంగా, దేశభద్రత పరంగా అనేక చిక్కుముళ్లు ఉన్నాయని మరికొందరి వాదన.
ఎన్నారై సంక్షేమంలో పంజాబ్ భేష్ - మంద భీమ్‌రెడ్డి (వలస వ్యవహారాల విశ్లేషకులు)
వివిధ దేశాల్లో ఉన్న పంజాబీల కోసం ... ఎన్నారై డిపార్టుమెంటు పేరిట ఒక శాఖను అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. దీనికి అనుబంధంగా ఒక మంత్రి ఉంటారు. ఒక రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో పంజాబ్ ఎన్నారై కమీషన్ కూడా ఉంది. ఎన్నారైల కష్టసుఖాలను వినిపించేందుకు ఎన్నారై సభ పేరిట ఒక సొసైటీ కూడా పంజాబ్‌లో ఉంది. ఐజీపీ ర్యాంకు అధికారి నేతృత్వంలో ఒక ఎస్పీ స్థాయి అధికారి పలువురు ఇతర అధికారులతో పంజాబ్ పోలీస్ ఎన్నారై వింగ్ పనిచేస్తున్నది. ఆరు ఎన్నారై పోలీసు స్టేషన్లు ఉన్నాయి. విదేశీ జైళ్లలో మగ్గుతున్నవారికి న్యాయ సహాయం చేయడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ఎన్నారై పెళ్లిళ్ల సమస్యలు పరిష్కరించడం తదితర కార్యక్రమాలను ఈ విభాగం చూస్తుంది. ఏజెంట్లను నియంత్రించడానికి పంజాబ్ ట్రావెల్ ప్రొఫెషనల్స్ రెగులేషన్ యాక్టు-2013ను ప్రవేశపెట్టారు. వివిధ దేశాలలో పంజాబ్ ప్రభుత్వం ఎన్నారై కోఆర్డినేటర్లను నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment