త్వరలో ఎన్నారై పాలసీకి తుది రూపు
- ‘టామ్‌కామ్’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్
- సంస్థ ద్వారా గల్ఫ్‌లో ఉపాధి పొందిన 250 మందికి వీసాలు
- ఎన్నారై పాలసీపై ఈ నెల 16న నిపుణులతో భేటీ
సాక్షి, హైదరాబాద్: గల్ఫ్‌తోపాటు విదేశాల్లోని తెలంగాణ పౌరులకు రక్షణ కల్పించేలా తెలంగాణ ఎన్నారై పాలసీని రూపొందిస్తున్నట్లు మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. ఎన్నారై పాలసీకి సంబంధించి ఇప్పటికే ముసాయిదా సిద్ధం చేశామని, ఈ నెల 16న ఎన్నారై సంఘాలు, నిపుణులతో సమావేశం నిర్వహించి పాలసీపై సలహాలు స్వీకరిస్తామన్నారు. ఉపాధి కోసం గల్ఫ్‌తోపాటు విదేశాల కు వెళ్తున్న తెలంగాణ యువతకు చట్టబద్ధంగా ఉద్యోగాలు కల్పించే ‘తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ’ (టామ్‌కామ్) ఆధ్వర్యం లో సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. టామ్‌కామ్‌తో గల్ఫ్‌లో ఉపాధి పొందిన 250 మందికి ఈ సందర్భంగా ఆయన వీసా పత్రాలు అందజేశారు.
విదేశాల్లోని యువతకు చట్టబద్ధ ఉపాధి కల్పన లక్ష్యంగా ఏర్పాటైన టామ్‌కామ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లోని ఐదు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. ఒప్పందంలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ఆయా కంపెనీల ప్రతినిధులు జిల్లాలవారీగా ఇంటర్వ్యూలు నిర్వహించి మొదటి దశలో 250 మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకొచ్చారన్నారు. త్వరలో మరో 500 మందికి టామ్‌కామ్ ద్వారా ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. టామ్‌కామ్ కార్యకలాపాలను విస్తరిస్తామన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మా ణం, రూ. 40 వేల కోట్ల పెట్టుబడుల తో 2,300 పరిశ్రమలకు అనుమతుల ద్వారా లక్షలాది మంది తెలంగాణ యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కేటీఆర్ తెలిపారు.
టామ్‌కామ్ ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి ప్రమాదం జరిగితే రక్షణ, వారిపై ఆధారపడిన కుటుంబాలకు భరోసా లభిస్తుందన్నారు. గల్ఫ్‌లో ఉపాధి కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మరణించిన నిజామాబాద్ జిల్లా చిట్టాపూర్‌కు చెందిన నర్సయ్య కుటుంబానికి జజీరా ఎమిరేట్స్ పవర్ కంపెనీ ఇచ్చిన రూ. 40.15 లక్షల చెక్కును ఆయన అందజేశారు. చట్టబద్ధ మా ర్గాల్లో విదేశాలకు వెళ్లే వారికి కంపెనీలు, ప్రభుత్వం నుంచి భద్రత లభిస్తుందన్నారు. సమావేశంలో హోం ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీ, టామ్‌కామ్ అధికారులు పాల్గొన్నారు.