ఎడారి బతుకులకు ఆసరా
- తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ పాలసీ ముసాయిదా సిద్ధం
- ఏజెంట్ల మోసాలపై వలసజీవులకు బాసట
- విదేశీ యానానికి ముందు నైపుణ్యాల్లో శిక్షణ
- ఆపదలో ఉన్నవారి కోసం సత్వర చర్యలు
- జిల్లా, రాష్ట్ర స్థాయిలో ‘ఎన్‌ఆర్‌ఐ సెల్’
- మృతుల కుటుంబాలకు లక్ష ఎక్స్‌గ్రేషియా
సాక్షి, హైదరాబాద్: ఉపాధి అన్వేషణలో ఎడారి బాట పట్టి కష్టాల కడలిలో చిక్కుకుపోతున్న వలస జీవుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఓ పటిష్ట విధానాన్ని(పాలసీ) రూపొందించింది. దేశం కాని దేశంలో నిస్సహాయ పరిస్థితుల్లో కూరుకుపోయి.. సహాయం కోసం మాతృదేశం వైపు ఆశతో చూసే తెలంగాణ బిడ్డలకు ఆపన్నహస్తం అందించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ‘తెలంగాణ ఎన్‌ఆర్‌ఐల సంక్షేమం, రాష్ట్రంలో ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులకు పోత్సాహకం’ పేరుతో ప్రభుత్వం ఓ మూసాయిదా పాలసీని సిద్ధం చేసింది.
గతేడాది జూలై 3న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సాధారణ పరిపాలన శాఖ దీన్ని రూపొందించింది. ఇం దుకు కేరళలో విజయవంతమైన ఎన్‌ఆర్‌ఐ పాలసీని ఆదర్శంగా తీసుకున్నారు. ఆర్థిక, న్యా య, హోం శాఖలు ఈ ముసాయిదా ను ఆమోదించాయి. ఇక దీనికి రాష్ర్ట కేబినెట్ ఆమోదం లభించడమే తరువాయి. ఇది అమల్లోకి వస్తే వలస జీవులకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. నకిలీ ఏజెంట్లను గుర్తించడంలో ప్రజలకు సహకరించేందుకు అధీకృత ఏజెట్లు, అనధికార/నిషేధిత ఏజెంట్ల జాబి తాను ఎన్‌ఆర్‌ఐ వెబ్‌సైట్‌లో ప్రభుత్వం పెట్టనుంది.
బాధిత కుటుంబాలకు పరిహారం
పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లి మృత్యువాత పడిన వారికి సంబంధించిన నిరుపేద కుటుం బాలకు ప్రభుత్వం లక్ష రుపాయల పరిహారం అందించనుంది. గతంలో కొన్ని ప్రత్యేకమైన కేసుల విషయంలోనే దీన్ని చెల్లించారు. కొత్త ఎన్‌ఆర్‌ఐ విధానం ప్రకారం బాధిత కుటుంబాలన్నింటికీ పరిహారం వర్తించనుంది. ఉమ్మడిరాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రారంభమైన నాటి నుంచి 200 మంది మృతుల కుటుంబాలు పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. సరైన పాలసీ లేకపోవడంతో ప్రభుత్వం ఈ దరఖాస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇక విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారి పునరావాసానికీ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఎన్‌ఆర్‌ఐలు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించేందుకు సహకారం అందిస్తుంది. సింగిల్ విండో విధానం ద్వారా వారికి అనుమతులిస్తుంది. ఐటీఐలు, ‘ఔట్‌సోర్సింగ్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ’ సంస్థల ద్వారా నైపుణ్యాల పెంపులో శిక్షణ ఇప్పిస్తుంది.
సత్వర చర్యలకు కొత్త యంత్రాంగం
ఆపదలో చిక్కుకున్న ఎన్‌ఆర్‌ఐలను ఆదుకోవడానికి సత్వర చర్యలు చేపట్టేందుకు సచివాలయంలోని ఎన్‌ఆర్‌ఐ విభాగాన్ని ప్రభుత్వం బలోపేతం చేయనుంది. సచివాలయంలో ఎన్‌ఆర్‌ఐల కోసం టోల్ ఫ్రీ నెంబర్‌తో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తుంది. వలసలు ఎక్కువగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల కలెక్టరేట్లలో రెవెన్యూ, పోలీస్ అధికారులతో ‘ఎన్‌ఆర్‌ఐ సెల్’ ఏర్పా టు చేయనుంది.
ఆన్‌లైన్ ద్వారా జనన, మరణ, వివాహ, ఉద్యోగ ధ్రువీకరణ పత్రాల అటెస్టేషన్ జరపనుంది. విదేశాలకు వెళ్లే ముందు శిక్షణ, కౌన్సెలింగ్, అవగాహన కల్పన కోసం విమానాశ్రమంలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయనుంది. నిరక్షరాస్యులైన బాధితులు భాషా సమస్యను ఎదుర్కోకుండా విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల్లో తెలుగు అనువాదకులను నియమించనుంది. ఎన్‌ఆర్‌ఐల సంక్షేమం కోసం అధికారిక వెబ్‌సైట్ ఏర్పాటు చేసి ప్రభుత్వ విధానాలు వెల్లడిస్తుంది. అలాగే విదేశాల్లోని యాజమాన్యాలకు సమాచారం, సంక్షేమ కార్యక్రమాల అమలు వివరాలు పొందుపరుస్తుంది.
కేరళలో విజయవంతం
కేరళలో రెండు ప్రభుత్వ సంస్థలు అమలు చేస్తున్న ఎన్‌ఆర్‌ఐ పాలసీ విజయవంతమైంది. నోర్కా రూట్స్, నాన్ రెసిడెంట్ కేరలైట్స్ వెల్ఫేర్ బోర్డు అనే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు విదేశాల్లోని మలయాళీల భద్రత, సంక్షేమం కోసం కృషి చేస్తున్నాయి. నోర్కా రూట్స్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల అటెస్టేషన్, విదేశీ ప్రయాణానికి ముందు శిక్షణ, నైపుణ్యాల పెంపు, కాల్ సెం టర్, జాబ్ పోర్టల్, ఉద్యోగాల భర్తీ, గుర్తింపు కార్డుల జారీ తదితర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నాన్ రెసిడెంట్ కేరలైట్స్ వేల్ఫేర్ బోర్డు పనిచేస్తోంది. రెండేళ్లు విదేశాల్లో పని చేసి తిరిగి వస్తే బోర్డులో సభ్యత్వం పొందవచ్చు. బోర్డు ద్వారా ఎన్‌ఆర్‌ఐలకు పింఛన్లు, మృతుల కుటుంబాలకు చేయూత అందుతున్నాయి.