నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్‌కల్‌లో ప్లకార్డులను చేతపట్టుకుని నినదిస్తున్న వలస కార్మిక కుటుంబాల సభ్యులు
సాక్షి, నెట్‌వర్క్: ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలు చేయడానికి అవసరమైన ప్రవాసీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన ఉద్యమం పల్లెలకు విస్తరిస్తోంది. దీనిపై ఇప్పటికే వలస కార్మికులు సామాజిక మాధ్యమాల ద్వారా నినదిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న కార్మికులకు అండగా ఇప్పుడు వారి కుటుంబాలు కూడా ప్రవాసీ సంక్షేమ బోర్డు సాధన ఉద్యమంలో భాగస్వాములయ్యాయి. ఇటీవల నిర్వహించిన సద్దుల బతుకమ్మ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వం ప్రవాసీల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేస్తే తమ కుటుంబాలకు లాభం కలుగుతుందని వలసదారుల కుటుంబాల సభ్యులు భావిస్తున్నారు. అందుకే సద్దుల బతుకమ్మ రోజున ఉద్యమ స్ఫూర్తిని చాటారు. అంతేకాకుండా బతుకమ్మ పాటల్లో తెలంగాణ ప్రవాసీ సంక్షేమ బోర్డు ఏర్పాటు ఆవశ్యకతను వ్యక్తపరుస్తూ పాటలు పాడారు. తాము అధికారంలోకి వస్తే వలస కార్మికుల కోసం కేరళ తరహాలో ఎన్‌ఆర్‌ఐ పాలసీని అమలు చేస్తామని 2014 ఎన్నికల సందర్భంగా పలు పార్టీలు హామీ ఇచ్చాయి. అప్పట్లో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రవాసీ సంక్షేమ బోర్డు ఏర్పాటుపై దృష్టి సారించలేకపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ వివిధ రాజకీయ పక్షాలు ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలు చేస్తామని హామీ ఇచ్చాయి. అయితే, మరోసారి టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎన్‌ఆర్‌ఐ పాలసీ లేదా తెలంగాణ ప్రవాసీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ అధికంగా వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2018–2019 బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అయితే. ఈ నిధులను వినియోగించడానికి నిర్ధిష్టమైన ప్రణాళిక లేకపోవడంతో ఎంత మేరకు నిధులు వినియోగమయ్యాయో తేలలేకపోయింది.
గల్ఫ్ వలస కార్మికులద్వారా దండిగా ఆదాయం..
గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి దండిగా ఆదాయం సమకూరుతోంది. గల్ఫ్ దేశాల్లో కార్మికులు తమ చెమటను చిందించి సంపాదించిన సొమ్మును తమ కుటుంబాలకు పంపుతున్నారు. తద్వారా ప్రభుత్వానికి విదేశీ మారకద్రవ్యం వస్తోంది. తాము తెచ్చిపెట్టిన ఆదాయంలో కొంత మొత్తాన్ని తమ సంక్షేమం కోసం ఖర్చుచేయాలని కార్మికులు కోరుతున్నారు. కేరళ ప్రభుత్వం వలస కార్మికుల కోసం ప్రత్యేక చట్టం రూపొందించింది. దాని ద్వారా బోర్డు ఏర్పాటు చేసి కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది.
బోర్డు ఏర్పడితే కలిగే ప్రయోజనాలు ఇవీ..
ప్రవాసీ సంక్షేమ బోర్డు ఏర్పడితే వలస కార్మికులకు బహుళ ప్రయోజనాలుకలుగనున్నాయి. వలస కార్మికులకు బీమా లేదా ఫించన్ అందుతుంది. స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు అందించడానికి అవకాశం ఉంది.గల్ఫ్ లేదా ఇతర దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లాలనుకునే కార్మికులకు తాముఎంచుకున్న రంగంలో నైపుణ్య శిక్షణ లభించే అవకాశం ఉంది. కౌషల్ వికాస్‌యోజన పథకం ద్వారా వలస కార్మికులు వృత్తి నైపుణ్యం పొందవచ్చు. అలాగేగల్ఫ్ దేశాల్లో జైళ్లో మగ్గుతున్న వారికి న్యాయ సహాయం అందడం, మరణించినవారి మృతదేహాలను స్వగ్రామాలకు చేర్చడానికి ఉచిత అంబులెన్స్ సౌకర్యంకల్పించడం, బీమా వల్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు వలస కార్మికులకు ప్రవాసీ సంక్షేమ బోర్డు ద్వారాఅందనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment