ఈ సీఎం కేసీఆర్‌ మీ చేతిలో ఉన్నాడు | I Am With Yourself Says CM KCR In Vasalamarri Meeting | Sakshi
Sakshi News home page

ఈ కేసీఆర్‌ మీ చేతిలో ఉన్నాడు: వాసాలమర్రివాసులతో సీఎం

Published Wed, Jun 23 2021 2:01 AM | Last Updated on Wed, Jun 23 2021 2:04 AM

I Am With Yourself Says CM KCR In Vasalamarri Meeting - Sakshi

సహ పంక్తి భోజనంలో ఓ వృద్దురాలితో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌

వాసాలమర్రిలో ప్రతి కుటుంబానికి అవసరమైన లాభం ఇప్పించే బాధ్యత నాది. ఈరోజు నుంచి ఊరుమొత్తం నా కుటుంబం. ఇల్లు లేనోళ్లకు ఇల్లు కడదాం. ఆటోలు, డీసీఎంలు, ట్రాక్టర్లు ఇప్పిద్దాం. ప్రతి ఇంటికి ఒక పాడి పశువును ఇప్పిద్దాం. కమ్యూనిటీ హాల్‌ నిర్మిద్దాం. రోడ్డు వేసుకుందాం. జబ్బుపడిన వారికి హైదరాబాద్‌లో వైద్యం అందిద్దాం. రేషన్‌ కార్డులు ఇప్పిద్దాం. గ్రామ నిధిని ఏర్పాటు చేద్దాం. 

సీఎం మీ చేతిలో ఉన్నడు..

  • గ్రామం అభివృద్ధి చేయడానికి నేనున్న. సీఎం మీ చేతిలో ఉంటే ఇంకేం బాధ. రాష్ట్రాధినేత, ప్రభుత్వం మీ ఊరి పట్టున ఉంది. నిశ్చింతగా ఉండొచ్చు. అయితే గ్రామం ఐకమత్యం, పట్టుదలతో ఉండాలి. అవుననిపించుకోవాలి. చుట్టూ 10 గ్రామాలు వాసాలమర్రికి వచ్చి నేర్చుకోవాలి.
  • ప్రేమతో మెలగాలి. అంతా దోస్తులు కావాలి. పిల్లలు మంచిగ చదువుకోవాలె. చదువుకునేందుకు ఎన్నో పథకాలు ఉన్నాయి. కొందరికి తెలియదు. స్తోమత లేక ఊళ్లో ఎవరూ చదువుకు దూరం కావద్దు. అలాంటి వాళ్లందరినీ చదివించాలి.

సాక్షి, యాదాద్రి: ‘‘ఇక్కడ (వాసాలమర్రిలో) ఏదో ప్రత్యేకమైనది జరగాలి. మాటలతో కాదు. గొప్ప పట్టుదలతో జరగాలి. ఇవాళే దానికి పునాది రాయి పడాలి. జట్టుగట్టి.. పట్టుబట్టి ఊరిని బాగు చేసుకుందాం.. ఏడాదితిరిగే సరికి బి.వాసాలమర్రి అంటే బంగారు వాసాలమర్రి కావాలె..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంలో పర్యటించిన సీఎం కేసీఆర్‌.. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తర్వాత నిర్వహించిన గ్రామసభలో ప్రసంగించారు. ‘అంతా అంతే బాగానే ఉంది కదా’ అంటూ ప్రసంగం ప్రారంభించిన సీఎం.. ఊరిని బాగుచేసుకోవడానికి అందరూ కృషి చేయాలని సూచించారు. అందరూ కలసికట్టుగా పట్టుదలతో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..

ఇంకో 20 మాట్ల వస్తా..
గ్రామాన్ని బంగారు వాసాలమర్రి చేద్దాం. అందరూ కలిసికట్టుగా పట్టుదలతో ఉంటరు గదా.. అందరిలో ప్రేమభావం రావాలి. ఒకరిని చూస్తే ఒకరికి ప్రేమ రావాలి. ముఖంలో చిరునవ్వులు రావాలి. ఊర్లో పోలీస్‌ కేసులు ఉండకూడదు. పక్కింటోడితో మంచిగా ఉండాలె. అంతా దోస్తులు కావాలె. గ్రామంలో నాకు ఈ రోజు నలుగురు పరిచయమైండ్రు. ఇంకో 20 మాట్ల వస్త. వచ్చినప్పుడు మీతో గింత దూరంలో ఉండి సభ నడువదు. దగ్గరగా కూర్చొని మాట్లాడుకుందాం. తినేటప్పుడు ఆగమ్మ, లక్ష్మి, సర్పంచ్‌ అంజయ్య, ఎంపీటీసీ నవీన్‌ మాత్రమే పరిచయం అయ్యారు. మిగతా వారంతా దోస్తులు కావాలి.

నేను వస్తున్నానని అన్ని చేసిండ్రు
గ్రామానికి నేను వస్తున్నానని అధికారులు ఆగమేఘాల మీద ధనాధన్‌ అన్ని తయారు చేసిండ్రు. గ్రామంలో ట్రాక్టర్లు ఇవ్వాలంటే కేసీఆర్‌ వచ్చుడెందుకు? గివన్నెందుకు? అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చుడెందుకు? గిన్ని కార్లు వచ్చినయా? ఏదో ప్రత్యేకమైన కార్యక్రమం జరగాలి. మీ అదృష్టం మంచిదని వేరే ఊర్ల వాళ్లు అంటున్నారు. మొదలుపెడితే వెనక్కి మర్రి చూడొద్దు

కులమతాలకు అతీతంగా..
అందరికీ దండం పెట్టి చెప్తున్నా.. ఊరి అభివృద్ధి కోసం యజ్ఞంలాంటి పని పెట్టుకున్నం. ఇందులో కులం, మతం, ఆడ, మగ, రాజకీయ తేడా ఉండదు. అంతా ఊరు కోసం పనిచేయాలె. యశోద ఆస్పత్రివారు ఆరోగ్య శిబిరం పెట్టారు. జిల్లా కలెక్టర్‌ 270 మంది రైతులను అంకాపూర్‌కు తీసుకెళ్లి వచ్చారు. అక్కడ ఉన్నట్టే ఇక్కడా భూమి ఉంది. మనలాగే వడ్లు, కూరగాయలు పండిస్తరు. కానీ అక్కడ గ్రామ అభివృద్ధి కమిటీ ఉంది. తప్పుచేస్తే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లరు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులే ఫైన్‌ వేస్తరు. 45 ఏళ్లుగా అంకాపూర్‌కు పోలీస్‌ అధికారి రాలేదు. చిన్న సమస్య వచ్చినా అభివృద్ధి కమిటీనే చూసుకుంటది. గ్రామంలో మహిళలు, చదువుకున్న వారు భాగస్వాములు కావాలి. గట్టిగా ఆలోచించాలి. పట్టుబట్టి తప్పును తప్పని చెప్పాలి.

గ్రామాభివృద్ధి కోసం కమిటీలు 
వాసాలమర్రి గ్రామాభివృద్ధికి ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ను నియమిస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. అన్ని కులాల వారితో గ్రామాభివృద్ధి కమిటీ వేయా లని సూచించారు. ‘‘వారానికి రెండు గంటలు గ్రామంలో స్వచ్ఛందంగా పనిచేసేందుకు శ్రమదాన కమిటీ, పరిశుభ్రత కమిటీ, తాగునీటి కమిటీ, హరితహారం, వ్యవసాయ కమిటీలు వేసి అంకాపూర్‌ మాదిరిగా వాసాలమర్రి పనిచేయాలి. ఉపాధ్యాయులు, రిటైర్డ్‌ ఉద్యోగులను కమిటీల్లో నియమించాలి. నా నియోజకవర్గంలో ఎర్రవల్లిని చూడండి. అక్కడ ఇళ్లు కూలగొట్టాం. కొత్త ఇళ్లు కట్టాం. 24 గంటలు మిషన్‌ భగీరథ నీళ్లు వస్తాయి. ఇక్కడ కూడా రెండు మూడు రోజుల్లో కమిటీలు వేసుకుని చెరువులు, చెక్‌డ్యాంలు, కాలువలు బాగు చేసుకుందాం. సర్పంచ్, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, మంత్రి అందరూ ఉంటరు. వందకు వందశాతం బంగారు తెలంగాణ చేద్దాం’’ అని చెప్పారు. సమావేశంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, మండలి మాజీ చైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్, లింగయ్య, బొల్లం మల్లయ్య, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఉద్యమం నాటినుంచి చూస్తున్నా 
ఈ ఊరు మంచిగ లేదు. ఈ ఊరి మీదుగా చాలాసార్లు వెళ్లాను. బాగు చెయ్యొచ్చుగా అనుకున్నా. కొడకండ్ల రైతుబంధు భవనం ప్రారంభించి ఎర్రవల్లికి పోతుండగా ఊరిలో ఆగి కొందరితో మాట్లాడిన. ఎమ్మెల్యే గొంగిడి సునీత అప్పుడు అందుబాటులో లేదు. సర్పంచ్‌ అంజయ్య మరో 40మంది గ్రామస్తులు వచ్చి మాట్లాడారు. పట్టుబట్టి బాగు చేద్దాం అనుకున్నా. ఈలోపు కరోనా వచ్చింది. లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే ఎమ్మెల్యే సునీతకు ఫోన్‌చేసి చెప్పిన. ఇప్పుడు మంచిగా కలుసుకున్నం. 

బాగు చేయించే బాధ్యత నాది 
వాసాలమర్రి బాగుపడితే చుట్టూ పది ఊర్లు నేర్చుకోవాలి. బాగు చేయించే బాధ్యత నాది. నెల రోజుల తర్వాత చెట్టు కింద, గుడికాడ కూర్చొని మాట్లాడుకుందాం. ఊర్లో మూడు దళితవాడలకు వెళ్లి వారి సమస్యలు పరిష్కరిస్తా. గ్రామంలోని 1,500 మందికి చెందిన 3 వేల చేతులు కలిపితే ఊరి సమస్య బద్ధలై పోతుంది. వేలితో కొడితే దెబ్బతగలదు. పిడికిలి ఎత్తి సమష్టిగా గ్రామాభివృద్ధిని సాధిద్దాం. వ్యవసాయ, వృత్తిపనులు బాగు పడతాయి. మంచి పద్ధతిలో ముందుకుపోదాం. పెళ్లిళ్లు చేసే కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండాలి. మనోడు అనుకుంటే అన్నీ చేయవచ్చు.

వాసాలమర్రి గ్రామస్తులతో కలిసి భోజనం చేస్తున్న సీఎం కేసీఆర్‌, కలెక్టర్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement