ఆస్పత్రి నిర్మాణ పనులను శంకుస్థాపన చేస్తున్న సీఎం కేసీఆర్
కెనడాను తలదన్నేలా..
ప్రపంచంలోనే అధునాతన వైద్య సదుపాయాలు కెనడాలో ఉన్నాయి. వైద్యాధికారులు కెనడాను విజిట్ చేసి.. అక్కడి ఆస్పత్రులను తలదన్నేలా వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీని నిర్మించాలి. ప్రపంచంలోని అన్ని విభాగాల వైద్య సేవలు ఒకేచోట రావాలి.
ఇకపై హన్మకొండ, వరంగల్ జిల్లాలు
వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండ జిల్లాగా, వరంగల్ రూరల్ జిల్లా పేరును వరంగల్ జిల్లాగా మార్చుతాం. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం.
అక్టోబర్ తర్వాతే థర్డ్ వేవ్..
లాక్‌డౌన్ మరిన్ని రోజులు పెడితే ప్రజలకు ఉపాధి పోతుంది. అన్ని అంశాలను పరిశీలించాకే ఎత్తేశాం. ప్రస్తుతం కేసులు పెరగట్లేదు. థర్డ్‌వేవ్ వస్తే గిస్తే అక్టోబర్ తర్వాతే వస్తుంది. ఈ మధ్య కాలంలో రాదు. తగిన జాగ్రత్తలు పాటిస్తే నియంత్రించొచ్చు.
కడుపు నిండా పరిహారం..
యాదాద్రిలో రింగ్‌రోడ్డు భూ నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వడంతోపాటు నిర్మాణాల విలువను చెల్లిస్తాం. కడుపునిండా పరిహారం అందిస్తాం. ఆందోళన చెందే అవసరం లేదు. టెంపుల్ సిటీలో షాపులు కేటాయించడంలో ప్రాధాన్యత ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం.
సాక్షి ప్రతినిధి, వరంగల్: హైదరాబాద్ కంటే వరంగల్ తక్కువేమీ కాదని.. వరంగల్ దేశంలోనే గొప్ప విద్యా కేంద్రం, వైద్య కేంద్రం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేర్‌రావు అన్నారు. తూర్పు తెలంగాణకు ఈ నగరం హెడ్ క్వార్టర్ కావాలని, అత్యంత అధునాతన వైద్య సేవలు ఇక్కడ అందాలని చెప్పారు. వరంగల్‌లో నిర్మించే మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి టాలెస్ట్ టవర్ ఆఫ్ వరంగల్‌గా ఉండాలని.. ఏడాదిన్నరలోగా పూర్తయ్యేలా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సీరియస్‌గా పనిచేయాలని ఆదేశించారు. తానే మళ్లీ వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆస్పత్రిని ప్రారంభిస్తానని చెప్పారు. సోమవారం వరంగల్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్.. తొలుత హన్మకొండలోని ఏకశిలా పార్కులో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తర్వాత వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నిర్మించే మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన చేసి.. సమీకృత కలెక్టరేట్, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
మాతా, శిశు సంరక్షణ కేంద్రం
వరంగల్ ఎంజీఎం, ప్రాంతీయ కంటి వైద్యశాల, సెంట్రల్ జైలు, మెడికల్ కాలేజీ కలిపి చూస్తే 200 ఎకరాలు అందుబాటులో ఉన్నట్లే. ప్రస్తుత ఎంజీఎం ఆస్పత్రి భవనాలు పాతబడినందున కూల్చివేసి భవనాలు నిర్మించాలి. దీనిని అత్యాధునికంగా మాతా, శిశు సంరక్షణ కేంద్రంగా మారుస్తాం. దానికి రెండు మూడు వేల కోట్లు ఖర్చయినా వెనుకాడం. వైద్య విభాగంలో ఉన్న అన్ని రకాల సేవలు హబ్‌గా వరంగల్‌లో అందుబాటులో ఉండేలా చేస్తాం. తెలంగాణ మొత్తం ఇంకా నాగరికంగా మారాలి. ప్రతీ పాత తాలుకా సెంటర్‌లో మాతాశిశు సంరక్షణ కేంద్రాలు రావాలి. ఒక మినీ నీలోఫర్ సెంటర్ రావాలి. ఇందుకోసం ఉన్నతాధికారులకు ఆదేశాలిస్తాం.
పెట్టుబడులు రావాలి..
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అతి పెద్దనగరం. ఇది గొప్ప విద్యా, వైద్య కేంద్రంగా మారాలి. వరంగల్‌కు డెంటల్ కాలేజీ, డెంటల్ హాస్పిటల్‌ను మంజూరు చేస్తున్నం. వరంగల్‌కు పెట్టుబడులు రావాలి. ఐటీ కంపెనీలను విస్తరించాలి. ఇందుకోసం పెట్టుబడులను ఆకర్షించేలా అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. త్వరలోనే మామునూర్ ఎయిర్‌పోర్టు రాబోతోంది.
చైనా లాంటి టెక్నాలజీ రావాలి
చైనాలో 28 గంటల్లోనే 10 అంతస్తుల భవనం నిర్మించారు. ఆ తరహా నిర్మాణ పరిజ్ఞానం మనదగ్గర కూడా రావాలి. ప్రజల పనులు వేగంగా జరిగితేనే ప్రజాస్వామ్యానికి సార్థకత. ప్రజలు పైరవీలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండొద్దు. మిగతా 30 కలెక్టరేట్లు కూడా త్వరగా పూర్తి కావాలి. కలెక్టర్ హోదా పేరు కూడా మారిస్తే బాగుంటుంది. ఒకప్పుడు భూమి శిస్తు వసూలు చేసేవారిని కలెక్టర్ అనేవారు. ఇప్పుడు కలెక్టర్లకు శిస్తు వసూలు చేసే అవసరం లే దు. అందువల్ల వారి పేరు మారిస్తే బాగుంటుంది.
జిల్లాలు అభివృద్ధి చెందాలి
హైదరాబాద్‌లో జనాభా విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రం మొత్తం హైదరాబాద్‌పై ఆధారపడితే జిల్లాలకు నష్టం కలుగుతుంది. జిల్లాలు కూడా అభివృద్ధి చెందితే హైదరాబాద్‌పై భారం తగ్గుతుం ది. అందుకే హైదరాబాద్ ఈర్ష్య పడేలా వరంగల్ ను వైద్య, విద్య, ఐటీ రంగాల్లో అభివృద్ధి చేస్తాం.
జూలై 1 నుంచి పల్లె ప్రగతి
రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలను బాగు చేసేందు కు యజ్ఞంలా పనిచేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా జూలై 1 నుంచి 10 వరకు పల్లెప్రగతి కార్యక్రమం చేపడతాం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కలిపి నిర్వహిస్తాం. స్థానిక సంస్థలకు ముందే నిధులు విడుదల చేస్తాం. ఈనెల 26న మంత్రులు, కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, అడిషనల్ కలెక్టర్లు, డీఆర్‌డీవో అధికారులతో సమావేశం ఉంటుంది. ఆ రోజు మొత్తం అజెండా ఫైనల్ చేస్తాం. ప్రతిష్టాత్మక దేవాదుల ప్రాజెక్టు నీరు వరంగల్‌కే అంకితం. ఉమ్మడి వరంగల్‌లో మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలి. మిగిలిన పనుల పూర్తికి రూ.100 కోట్లు కేటాయిస్తాం.
కరోనాపై అతిగా ఆందోళన వద్దు
కరోనాపై ఊహాగానాలతో ప్రజలను భయపెట్టేలా వార్తలు ఇవ్వొద్దు. ఇది మంచిది కాదు. కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రసారం చేస్తే మంచిది. చాలా మంది భయాందోళనలతో మందులు, ఆక్సిజన్ సిలిండర్లు కొని పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు సామర్థ్యానికి మించి వస్తున్నారు. వచ్చిన రోగులను తిరిగి పంపించకుండా వీలున్న చోట పడుకోబెట్టి చికిత్స అందించాల్సి వస్తది. ప్రభుత్వ వైద్యులు, సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నా. వారు ఉత్తమ సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ వైద్యులపై దాడులు సరికాదు. సిబ్బంది కరోనా ఉధృతి ఉన్నా ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే చేశారు. కిట్లు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment