warangal town
-
రికార్డుస్థాయి వాన: మళ్లీ మునిగిన ఓరుగల్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్/ సాక్షి, వరంగల్: వర్షం ఓరుగల్లును ముంచెత్తింది. కాలనీలను అతలాకుతలం చేసింది. జనజీవనాన్ని స్తంభింపజేసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కుండపోతగా కురిసిన వర్షంతో మహానగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ప్రధాన రహదారులను చెరువులు, కుంటలను తలపిస్తున్నాయి. గత ఏడాది జూలై 11న అత్యధికంగా 105 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదుకాగా.. ఇప్పుడు అంతకుమించి 140 మి.మీ వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదైంది. నగర, శివారు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అర్ధరాత్రి ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడపాల్సి వచ్చింది. తెల్లవారుజామున తెరిపివ్వడంతో ఇంట్లోకి చేరిన నీటిని ఎత్తిపోయడంతోపాటు తడిసిన బియ్యం, సామగ్రిని ఆరబెట్టుకున్నారు. (చదవండి: తెలంగాణ సిగలో మరో అందం: వెలుగులోకి కొత్త జలపాతం) ముద్దయిన కాలనీలు.. భారీ వర్షానికి వరంగల్, హనుమకొండలోని పలు కాలనీలు నీటమునిగాయి. అధికారుల అంచనా ప్ర కారం సుమారు 33 కాలనీలు ఇంకా నీటిలోని నాని పోతున్నాయి. ముంపు కాలనీల్లో రెస్క్యూ బృందా లు నిరంతరం శ్రమిస్తూ యుద్ధప్రాతిపదికన ప్రజ లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. రహదారులపై వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. (చదవండి: పెళ్లి కావాల్సిన వధువు: కన్నీటిసంద్రంలో కుటుంబం) జనజీవనం అతలాకుతలం.. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజామన నాలుగు నుంచి ఐదున్నర గంటల వరకు ఏకధాటిగా నగరంలో వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలైన కాలనీలు, వాడల్లోని ఇళ్లు, గుడిసెల్లోకి వరద నీరు చేరింది. సోమవారం తెల్ల వారుజామున ఆయా కాలనీవాసులు చాలా మంది నీటిలో తడిసిన బియ్యం మూటలు, గ్యాస్ స్టవ్‌లు, టీవీలు.. తదితర సామగ్రిని సర్దుకొని బంధువుల ఇళ్లకు వెళ్లడం కనిపించింది. కొందరు సామగ్రిని ఇళ్లపై ఆరబెట్టుకున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటలు దాటినా జిల్లా ప్రభుత్వ విభాగాధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు చూడలేదు. దీంతో ఆహారం కోసం వరద బాధితులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించి ప్రజలను పునరావాస కేంద్రాలను తరలించాలని నిర్ణయించారు. బాధితులకు రోడ్డుపైనే ఆహారం ఏర్పాటు చేసి అందించారు. కొన్ని ప్రాంతాల్లో పులిహోర ప్యాకెట్లు, మంచినీళ్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు. భారీగా నష్టం.. భారీవర్షం ధాటికి నగరంలోని కొన్ని గుడిసెలు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. చాలా వీధుల్లో మోకాలి లోతున నీరు ప్రవహించడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలు వరదలో మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వరద నీరు పోయినా.. ఆ వాహనాలు స్టార్ట్ కాని పరిస్థితి ఏర్పడింది. ఇంట్లోని టీవీలు, ఫ్రిజ్‌లు నీటిలో తడిసిపోవడంతో పనిచేయడం లేదు. పెంచుకున్న కుక్కలు కూ డా వరదలో చిక్కుకున్నాయి. సకాలంలో వాటిని యజమానులు గుర్తించి ఇంటిపైకి తీసుకెళ్లారు. ఉప్పొంగిన చెరువులు.. ఖిలావరంగల్ రాతికోటకు ఆనుకొని ఉన్న అగర్తాల చెరువు భారీ వర్షంతో నిండింది. ఆ నీరు నగరంలోని పలు కాలనీలకు వెళ్లడంతో నీట మునగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రంగశాయిపేటకు సమీపంలోని బెస్తం చెరువు పొంగి ప్రవహించింది. ఆ నీరు రంగసముద్రం, భద్రకాళి చెరువు మీదుగా హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌కు సమీపంలోని నగరం చెరువులో కలిసింది. ఈ క్రమంలోనే పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్ నుంచి నర్సంపేట రోడ్డుకు వెళ్లే మార్గంలో ఉన్న కట్టమైదాన్ చెరువు అలుగుపోసింది. ఆ నీరు చిన్నవడ్డెపల్లి చెరువు, కొటె చెరువు మీదుగా నగరం చెరువులో కలుస్తోంది. ఈ చెరువులకు వరద నీరు పోయే నాలాల వెంట వెలిసిన అక్రమ నిర్మాణాలతో కుచించుకుపోవడంతో వరదనీరు సాఫీగా వెళ్లడం లేదు. ఫలితంగా ఆయా నాలాల చుట్టూ ఉన్న కాలనీల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. టోల్‌ఫ్రీ నంబర్‌తో సహాయం వరద బాధితులు, ప్రజలకు సత్వర సహాయం అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. 1800 425 1980 ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌తోపాటు 9701999645 మొబైల్, 7997100300 వాట్సాప్ నంబర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కార్యస్థానం వదిలి వెళ్లొద్దని, ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. -
CM KCR: ‘టాలెస్ట్ టవర్ ఆఫ్ వరంగల్’గా ఆస్పత్రి
కెనడాను తలదన్నేలా.. ప్రపంచంలోనే అధునాతన వైద్య సదుపాయాలు కెనడాలో ఉన్నాయి. వైద్యాధికారులు కెనడాను విజిట్ చేసి.. అక్కడి ఆస్పత్రులను తలదన్నేలా వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీని నిర్మించాలి. ప్రపంచంలోని అన్ని విభాగాల వైద్య సేవలు ఒకేచోట రావాలి. ఇకపై హన్మకొండ, వరంగల్ జిల్లాలు వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండ జిల్లాగా, వరంగల్ రూరల్ జిల్లా పేరును వరంగల్ జిల్లాగా మార్చుతాం. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. అక్టోబర్ తర్వాతే థర్డ్ వేవ్.. లాక్డౌన్ మరిన్ని రోజులు పెడితే ప్రజలకు ఉపాధి పోతుంది. అన్ని అంశాలను పరిశీలించాకే ఎత్తేశాం. ప్రస్తుతం కేసులు పెరగట్లేదు. థర్డ్‌వేవ్ వస్తే గిస్తే అక్టోబర్ తర్వాతే వస్తుంది. ఈ మధ్య కాలంలో రాదు. తగిన జాగ్రత్తలు పాటిస్తే నియంత్రించొచ్చు. కడుపు నిండా పరిహారం.. యాదాద్రిలో రింగ్‌రోడ్డు భూ నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వడంతోపాటు నిర్మాణాల విలువను చెల్లిస్తాం. కడుపునిండా పరిహారం అందిస్తాం. ఆందోళన చెందే అవసరం లేదు. టెంపుల్ సిటీలో షాపులు కేటాయించడంలో ప్రాధాన్యత ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం. సాక్షి ప్రతినిధి, వరంగల్: హైదరాబాద్ కంటే వరంగల్ తక్కువేమీ కాదని.. వరంగల్ దేశంలోనే గొప్ప విద్యా కేంద్రం, వైద్య కేంద్రం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేర్‌రావు అన్నారు. తూర్పు తెలంగాణకు ఈ నగరం హెడ్ క్వార్టర్ కావాలని, అత్యంత అధునాతన వైద్య సేవలు ఇక్కడ అందాలని చెప్పారు. వరంగల్‌లో నిర్మించే మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి టాలెస్ట్ టవర్ ఆఫ్ వరంగల్‌గా ఉండాలని.. ఏడాదిన్నరలోగా పూర్తయ్యేలా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సీరియస్‌గా పనిచేయాలని ఆదేశించారు. తానే మళ్లీ వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆస్పత్రిని ప్రారంభిస్తానని చెప్పారు. సోమవారం వరంగల్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్.. తొలుత హన్మకొండలోని ఏకశిలా పార్కులో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తర్వాత వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నిర్మించే మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన చేసి.. సమీకృత కలెక్టరేట్, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మాతా, శిశు సంరక్షణ కేంద్రం వరంగల్ ఎంజీఎం, ప్రాంతీయ కంటి వైద్యశాల, సెంట్రల్ జైలు, మెడికల్ కాలేజీ కలిపి చూస్తే 200 ఎకరాలు అందుబాటులో ఉన్నట్లే. ప్రస్తుత ఎంజీఎం ఆస్పత్రి భవనాలు పాతబడినందున కూల్చివేసి భవనాలు నిర్మించాలి. దీనిని అత్యాధునికంగా మాతా, శిశు సంరక్షణ కేంద్రంగా మారుస్తాం. దానికి రెండు మూడు వేల కోట్లు ఖర్చయినా వెనుకాడం. వైద్య విభాగంలో ఉన్న అన్ని రకాల సేవలు హబ్‌గా వరంగల్‌లో అందుబాటులో ఉండేలా చేస్తాం. తెలంగాణ మొత్తం ఇంకా నాగరికంగా మారాలి. ప్రతీ పాత తాలుకా సెంటర్లో మాతాశిశు సంరక్షణ కేంద్రాలు రావాలి. ఒక మినీ నీలోఫర్ సెంటర్ రావాలి. ఇందుకోసం ఉన్నతాధికారులకు ఆదేశాలిస్తాం. పెట్టుబడులు రావాలి.. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అతి పెద్దనగరం. ఇది గొప్ప విద్యా, వైద్య కేంద్రంగా మారాలి. వరంగల్‌కు డెంటల్ కాలేజీ, డెంటల్ హాస్పిటల్‌ను మంజూరు చేస్తున్నం. వరంగల్‌కు పెట్టుబడులు రావాలి. ఐటీ కంపెనీలను విస్తరించాలి. ఇందుకోసం పెట్టుబడులను ఆకర్షించేలా అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. త్వరలోనే మామునూర్ ఎయిర్‌పోర్టు రాబోతోంది. చైనా లాంటి టెక్నాలజీ రావాలి చైనాలో 28 గంటల్లోనే 10 అంతస్తుల భవనం నిర్మించారు. ఆ తరహా నిర్మాణ పరిజ్ఞానం మనదగ్గర కూడా రావాలి. ప్రజల పనులు వేగంగా జరిగితేనే ప్రజాస్వామ్యానికి సార్థకత. ప్రజలు పైరవీలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండొద్దు. మిగతా 30 కలెక్టరేట్లు కూడా త్వరగా పూర్తి కావాలి. కలెక్టర్ హోదా పేరు కూడా మారిస్తే బాగుంటుంది. ఒకప్పుడు భూమి శిస్తు వసూలు చేసేవారిని కలెక్టర్ అనేవారు. ఇప్పుడు కలెక్టర్లకు శిస్తు వసూలు చేసే అవసరం లే దు. అందువల్ల వారి పేరు మారిస్తే బాగుంటుంది. జిల్లాలు అభివృద్ధి చెందాలి హైదరాబాద్‌లో జనాభా విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రం మొత్తం హైదరాబాద్‌పై ఆధారపడితే జిల్లాలకు నష్టం కలుగుతుంది. జిల్లాలు కూడా అభివృద్ధి చెందితే హైదరాబాద్‌పై భారం తగ్గుతుం ది. అందుకే హైదరాబాద్ ఈర్ష్య పడేలా వరంగల్ ను వైద్య, విద్య, ఐటీ రంగాల్లో అభివృద్ధి చేస్తాం. జూలై 1 నుంచి పల్లె ప్రగతి రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలను బాగు చేసేందు కు యజ్ఞంలా పనిచేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా జూలై 1 నుంచి 10 వరకు పల్లెప్రగతి కార్యక్రమం చేపడతాం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కలిపి నిర్వహిస్తాం. స్థానిక సంస్థలకు ముందే నిధులు విడుదల చేస్తాం. ఈనెల 26న మంత్రులు, కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, అడిషనల్ కలెక్టర్లు, డీఆర్డీవో అధికారులతో సమావేశం ఉంటుంది. ఆ రోజు మొత్తం అజెండా ఫైనల్ చేస్తాం. ప్రతిష్టాత్మక దేవాదుల ప్రాజెక్టు నీరు వరంగల్‌కే అంకితం. ఉమ్మడి వరంగల్‌లో మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలి. మిగిలిన పనుల పూర్తికి రూ.100 కోట్లు కేటాయిస్తాం. కరోనాపై అతిగా ఆందోళన వద్దు కరోనాపై ఊహాగానాలతో ప్రజలను భయపెట్టేలా వార్తలు ఇవ్వొద్దు. ఇది మంచిది కాదు. కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రసారం చేస్తే మంచిది. చాలా మంది భయాందోళనలతో మందులు, ఆక్సిజన్ సిలిండర్లు కొని పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు సామర్థ్యానికి మించి వస్తున్నారు. వచ్చిన రోగులను తిరిగి పంపించకుండా వీలున్న చోట పడుకోబెట్టి చికిత్స అందించాల్సి వస్తది. ప్రభుత్వ వైద్యులు, సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నా. వారు ఉత్తమ సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ వైద్యులపై దాడులు సరికాదు. సిబ్బంది కరోనా ఉధృతి ఉన్నా ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే చేశారు. కిట్లు అందించారు. -
ప్రతిపక్షం మేమే.. అధికార పక్షం మేమే
వరంగల్‌ను విడగొట్టడం సరికాదు కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌ను కలుస్తాం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల : అసెంబ్లీలో ప్రస్తుతం ప్రతిపక్షం.. అధికా ర పక్షం.. రెండూ మేమేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. కొత్త జిల్లా ఏర్పాటు కోసం వరంగల్ పట్టణాన్ని రెండుగా విడగొట్ట డం సరికాదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని కోరుతూ ఆత్మ బలి దానాలకు పాల్పడిన అమరులు ఓకారం లక్ష్మణరాజు, కొక్కిరాల సంపత్‌రావు కుటుంబాలకు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవా రం ఎమ్మెల్యే ధర్మారెడ్డి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందజేశారు. ఈ సం దర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వరంగల్‌లో అంతర్భాగంగా ఉన్న హన్మకొండ ను విడగొట్టి కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎక్కడో ఉన్న పాలకుర్తి, జమ్మికుంట, హుస్నాబాద్‌ను హన్మకొండకు తీసుకురావడం.. ఇటు ఉన్న ప్రాంతాలను అటు కలుపడం సరైన చర్య కాదన్నారు. ఈ విషయం పై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలమంతా కలిసి వాస్తవ పరిస్థితులను సీఎం కేసీఆర్‌కు వివరిస్తామన్నారు. ఏ జిల్లాకు అనుగుణంగా ఉన్న మండలాలను ఆ జిల్లాలోనే సర్దుబాటు చేయాలన్నారు. జిల్లాల అంశమే తేలలేదని ఇప్పుడే పరకాలలో రెవెన్యూ డివిజన్ కార్యాలయ ఏర్పాటు ఎందుకని ప్రశ్నించారు. ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయుల ఆహ్వానం మేరకు తాను 70వ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనడం కోసం అక్కడికి వెళ్లానన్నారు. అనంతరం విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన ఎమ్మెల్యేను టీఆర్ఎస్ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు దుబాసి వెంకటస్వామి, వజ్ర రవికుమార్, నాయకులు చింతిరెడ్డి సాంబరెడ్డి, రేగూరి విజయపాల్‌రెడ్డి, బొచ్చు జితేందర్, దగ్గు విజేందర్‌రావు, తహసీల్థార్ పోరిక హరికృష్ణ, ఆర్ఐ శ్రీధర్, వీఆర్వోలు సాయిని ముత్యం, కుమారస్వామి పాల్గొన్నారు.