సాక్షి ప్రతినిధి, వరంగల్/ సాక్షి, వరంగల్: వర్షం ఓరుగల్లును ముంచెత్తింది. కాలనీలను అతలాకుతలం చేసింది. జనజీవనాన్ని స్తంభింపజేసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కుండపోతగా కురిసిన వర్షంతో మహానగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ప్రధాన రహదారులను చెరువులు, కుంటలను తలపిస్తున్నాయి. గత ఏడాది జూలై 11న అత్యధికంగా 105 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదుకాగా.. ఇప్పుడు అంతకుమించి 140 మి.మీ వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదైంది. నగర, శివారు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అర్ధరాత్రి ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడపాల్సి వచ్చింది. తెల్లవారుజామున తెరిపివ్వడంతో ఇంట్లోకి చేరిన నీటిని ఎత్తిపోయడంతోపాటు తడిసిన బియ్యం, సామగ్రిని ఆరబెట్టుకున్నారు.
(చదవండి: తెలంగాణ సిగలో మరో అందం: వెలుగులోకి కొత్త జలపాతం)
ముద్దయిన కాలనీలు..
భారీ వర్షానికి వరంగల్, హనుమకొండలోని పలు కాలనీలు నీటమునిగాయి. అధికారుల అంచనా ప్ర కారం సుమారు 33 కాలనీలు ఇంకా నీటిలోని నాని పోతున్నాయి. ముంపు కాలనీల్లో రెస్క్యూ బృందా లు నిరంతరం శ్రమిస్తూ యుద్ధప్రాతిపదికన ప్రజ లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. రహదారులపై వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.
(చదవండి: పెళ్లి కావాల్సిన వధువు: కన్నీటిసంద్రంలో కుటుంబం)
జనజీవనం అతలాకుతలం..
ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజామన నాలుగు నుంచి ఐదున్నర గంటల వరకు ఏకధాటిగా నగరంలో వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలైన కాలనీలు, వాడల్లోని ఇళ్లు, గుడిసెల్లోకి వరద నీరు చేరింది. సోమవారం తెల్ల వారుజామున ఆయా కాలనీవాసులు చాలా మంది నీటిలో తడిసిన బియ్యం మూటలు, గ్యాస్ స్టవ్‌లు, టీవీలు.. తదితర సామగ్రిని సర్దుకొని బంధువుల ఇళ్లకు వెళ్లడం కనిపించింది. కొందరు సామగ్రిని ఇళ్లపై ఆరబెట్టుకున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటలు దాటినా జిల్లా ప్రభుత్వ విభాగాధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు చూడలేదు. దీంతో ఆహారం కోసం వరద బాధితులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించి ప్రజలను పునరావాస కేంద్రాలను తరలించాలని నిర్ణయించారు. బాధితులకు రోడ్డుపైనే ఆహారం ఏర్పాటు చేసి అందించారు. కొన్ని ప్రాంతాల్లో పులిహోర ప్యాకెట్లు, మంచినీళ్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు.
భారీగా నష్టం..
- భారీవర్షం ధాటికి నగరంలోని కొన్ని గుడిసెలు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. చాలా వీధుల్లో మోకాలి లోతున నీరు ప్రవహించడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలు వరదలో మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వరద నీరు పోయినా.. ఆ వాహనాలు స్టార్ట్ కాని పరిస్థితి ఏర్పడింది.
- ఇంట్లోని టీవీలు, ఫ్రిజ్‌లు నీటిలో తడిసిపోవడంతో పనిచేయడం లేదు. పెంచుకున్న కుక్కలు కూ డా వరదలో చిక్కుకున్నాయి. సకాలంలో వాటిని యజమానులు గుర్తించి ఇంటిపైకి తీసుకెళ్లారు.
ఉప్పొంగిన చెరువులు..
- ఖిలావరంగల్ రాతికోటకు ఆనుకొని ఉన్న అగర్తాల చెరువు భారీ వర్షంతో నిండింది. ఆ నీరు నగరంలోని పలు కాలనీలకు వెళ్లడంతో నీట మునగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- రంగశాయిపేటకు సమీపంలోని బెస్తం చెరువు పొంగి ప్రవహించింది. ఆ నీరు రంగసముద్రం, భద్రకాళి చెరువు మీదుగా హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌కు సమీపంలోని నగరం చెరువులో కలిసింది. ఈ క్రమంలోనే పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
- వరంగల్ నుంచి నర్సంపేట రోడ్డుకు వెళ్లే మార్గంలో ఉన్న కట్టమైదాన్ చెరువు అలుగుపోసింది. ఆ నీరు చిన్నవడ్డెపల్లి చెరువు, కొటె చెరువు మీదుగా నగరం చెరువులో కలుస్తోంది.
- ఈ చెరువులకు వరద నీరు పోయే నాలాల వెంట వెలిసిన అక్రమ నిర్మాణాలతో కుచించుకుపోవడంతో వరదనీరు సాఫీగా వెళ్లడం లేదు. ఫలితంగా ఆయా నాలాల చుట్టూ ఉన్న కాలనీల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది.
టోల్‌ఫ్రీ నంబర్‌తో సహాయం
వరద బాధితులు, ప్రజలకు సత్వర సహాయం అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్, బల్దియా ఇన్‌చార్జ్ కమిషనర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. 1800 425 1980 ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌తోపాటు 9701999645 మొబైల్, 7997100300 వాట్సాప్ నంబర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కార్యస్థానం వదిలి వెళ్లొద్దని, ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment