రామాయంపేట మోడల్ స్కూల్ హాస్టల్‌లో ఘటన
చికిత్సతో కోలుకుంటున్న విద్యార్థినులు
రామాయంపేట(మెదక్): మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఉన్న మోడల్ స్కూల్ హాస్టల్‌లో అల్పాహారం తిన్న 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం అల్పాహారంగా ఉప్మా తిన్నారు. ఇంతలో ఓ విద్యార్థిని బల్లి పడటం చూశానని ఆరోపిస్తుండగా అప్పటికే తిన్న వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం హాస్టల్ వార్డెన్ స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇందులో 20 మందికి గ్లూకోజ్ ఎక్కించి వైద్యసేవలు అందించగా కోలుకున్నారు. సమాచారం తెలుసుకున్న మెదక్ ఆర్డీఓ రమాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్, తహసీల్దార్ రజనీకుమారి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ పంజా విజయకుమార్ ఆస్పత్రికి చేరుకొని విద్యార్థినులను పరామర్శించారు. అనంతరం ఆర్డీఓ, డీఈఓ, తహసీల్దార్ హాస్టల్‌కు వెళ్లి వండిన అన్నాన్ని పరిశీలించారు.
వంటపాత్రలను, బియ్యాన్ని, ఇతర స్టాక్‌ను కూడా పరిశీలన చేశారు. అనంతరం విద్యార్థినులతో కలిసి హాస్టల్‌లోనే భోజనం చేశారు. వంట చేస్తున్న క్రమంలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment