జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో ఘటన
ఆస్పత్రిలో చికిత్స.. ప్రమాదం లేదన్న వైద్యులు
జగిత్యాల: జగిత్యాల జిల్లా సారంగాపూర్ కేజీబీవీ పాఠశాల విద్యార్థినులు బుధవారం అస్వస్థతకు లోనయ్యారు. ఉదయం పూట ఆడుకుంటున్న సమయంలో కేజీబీవీ సమీపంలోకి ఒక అంబులెన్స్ రాగా.. విద్యార్థినులు ఆందోళనతో స్పృహ తప్పారు. వీరిలో పదో తరగతి చదువుతున్న మమత, కృష్ణవేణి, వైశాలి, ప్రథమ సంవత్సరం చదువుతున్న నిహారిక, 7వ తరగతి చదువుతున్న తేజస్విని, 9వ తరగతి చదువుతున్న మమత మొత్తం ఆరుగురు విద్యార్థినులు ఉన్నారు. గ్రహించిన సిబ్బంది సారంగాపూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు జగిత్యాలలోని జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
జగిత్యాల వైద్యులు బాలికలకు చికిత్స నిర్వహించి ప్రమాదం ఏమీ లేదని, విద్యార్థులు టెన్షన్‌కు లోనై ప్యానిక్ కావడంతో ఇబ్బందులకు గురయ్యారని చెప్పారు. ఒకరోజు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని, ఇబ్బందులు లేకుంటే డిశ్చార్జి చేస్తా మని వెల్లడించారు. సారంగాపూర్ మండల కేంద్రం అటవీ ప్రాంతం కావడంతో అక్కడ చలితీవ్రత ఎక్కువ కావడం.. హాస్టల్‌లో దుప్పట్లు లేకపోవడంతో విద్యార్థులు చలికి తట్టుకోలేక ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తోంది.
ఆస్పత్రిలో కాలం చెల్లిన మందులు: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా తయారైంది జగిత్యాల మాతాశిశు సంక్షేమ కేంద్రం పరిస్థితి. విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ కాలం చెల్లిన మందులు బయటపడ్డాయి.
విద్యార్థులకు ఇవే గ్లూకోజ్‌లు పెట్టారా అన్నది సందిగ్ధంలో ఉంది. వైద్యులు మాత్రం ఇవ్వలేదని చెబుతున్నారు. విద్యార్థులు అస్వస్థతకు లోనుకావడంతో ఎంఈవో కిశోర్, జె డ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, ఆస్పత్రి ఆర్‌ఎంవో విజయ్‌రెడ్డి పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment