kgbv school
-
కేజీబీవీ విద్యార్థినులకు అస్వస్థత
జగిత్యాల: జగిత్యాల జిల్లా సారంగాపూర్ కేజీబీవీ పాఠశాల విద్యార్థినులు బుధవారం అస్వస్థతకు లోనయ్యారు. ఉదయం పూట ఆడుకుంటున్న సమయంలో కేజీబీవీ సమీపంలోకి ఒక అంబులెన్స్ రాగా.. విద్యార్థినులు ఆందోళనతో స్పృహ తప్పారు. వీరిలో పదో తరగతి చదువుతున్న మమత, కృష్ణవేణి, వైశాలి, ప్రథమ సంవత్సరం చదువుతున్న నిహారిక, 7వ తరగతి చదువుతున్న తేజస్విని, 9వ తరగతి చదువుతున్న మమత మొత్తం ఆరుగురు విద్యార్థినులు ఉన్నారు. గ్రహించిన సిబ్బంది సారంగాపూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు జగిత్యాలలోని జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. జగిత్యాల వైద్యులు బాలికలకు చికిత్స నిర్వహించి ప్రమాదం ఏమీ లేదని, విద్యార్థులు టెన్షన్‌కు లోనై ప్యానిక్ కావడంతో ఇబ్బందులకు గురయ్యారని చెప్పారు. ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచుతామని, ఇబ్బందులు లేకుంటే డిశ్చార్జి చేస్తా మని వెల్లడించారు. సారంగాపూర్ మండల కేంద్రం అటవీ ప్రాంతం కావడంతో అక్కడ చలితీవ్రత ఎక్కువ కావడం.. హాస్టల్లో దుప్పట్లు లేకపోవడంతో విద్యార్థులు చలికి తట్టుకోలేక ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో కాలం చెల్లిన మందులు: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా తయారైంది జగిత్యాల మాతాశిశు సంక్షేమ కేంద్రం పరిస్థితి. విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ కాలం చెల్లిన మందులు బయటపడ్డాయి. విద్యార్థులకు ఇవే గ్లూకోజ్‌లు పెట్టారా అన్నది సందిగ్ధంలో ఉంది. వైద్యులు మాత్రం ఇవ్వలేదని చెబుతున్నారు. విద్యార్థులు అస్వస్థతకు లోనుకావడంతో ఎంఈవో కిశోర్, జె డ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, ఆస్పత్రి ఆర్ఎంవో విజయ్‌రెడ్డి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. -
విద్యార్థినిపై పీఈటీ టీచర్ దాష్టీకం.. కడ్డీతో చెంపపై కాల్చిన వైనం
సాక్షి, కర్నూలు: కొత్తపల్లిలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో దారుణం జరిగింది. ఆదర్శంగా ఉండాల్సిన టీచరే విద్యార్థి ని చెంపపై కడ్డీతో కాల్చింది. శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తపల్లి కేజీబీవీలో పాములపాడు మండలం బానకచెర్ల గ్రామానికి చెందిన కీర్తి అనే బాలిక 10వ తరగతి చదువుతోంది. చున్నీ వేసుకోకుండా తిరగడమే కాక తనను వేరే విద్యార్థినుల ముందు తిడతావా అని కీర్తిపై పీఈటీ టీచర్ పావని ఆగ్రహించింది. అంతటితో వదలకపోగా శనివారం ప్రార్థన సమయంలో కడ్డీని వేడిచేసి బాలిక చెంపపై కాల్చి వాత పెట్టింది. కీర్తికి గిట్టని ఓ విద్యార్థిని చెప్పిన మాటలను నమ్మి సదరు టీచర్ ఇలా చేసినట్లు సమాచారం. విద్యార్థిని తల్లిదండ్రులు ఆదివారం పాఠశాలకు వెళ్లి విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. చదవండి: దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ -
కరోనా తెచ్చిన తంటా
మంచిర్యాలఅర్బన్: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో నిల్వ ఉంచిన సరుకుల నాణ్యతపై కరోనా లాక్డౌన్ ప్రభావం చూపుతోంది. మార్చి 22న జనతాకరŠూప్య నుంచి ఆశ్రమ, మోడల్‌స్కూల్, రెసిడెన్సియల్ పాఠశాలు మూసివేసిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి చెందుతుండటంతో పాఠశాలలు తెరుచుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి. నెలలు గడిచిపోతుండటం.. ఇంకోవైపు విద్యార్థుల కోసం తెప్పించిన నిత్యావసర సరుకులకు పురుగులు పడుతున్నాయి. గోధుమ పిండి, ఇడ్లీపిండి, ఉప్మారవ్వకు పురుగులు పట్టాయి. రాగిమాల్ట్ తదితర వస్తువుల కాలపరిమితి ముగిసిపోయింది. ప్యాకింగ్‌లో ఉండగానే ఎండవేడిమికి వంటనూనె లీకేజీతో ఆవిరైపోతోంది. చక్కెరకు చీమల బెడద ఎక్కువైంది. లక్షల రుపాయలతో కొనుగోలు చేసిన సరుకులు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. నిత్యావసర సరకుల సరఫరా ఇలా.. జిల్లాలో 18 కేజీబీవీలు ఉన్నాయి. 3,200 మంది విద్యార్థులు చదువుతున్నారు. నాణ్యమైన ఆహారం అందించేందుకు కావాల్సిన నిత్యావసర సరుకుల సరఫరా ఏజెన్సీ ద్వారా జరుగుతోంది. ఏటా ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు కొనసాగుతుండటంతో రెండు నెలలకు సంబంధించిన సరుకులను ఆయా కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లు ఏజెన్సీల నుంచి తెప్పించి నిల్వ ఉంచారు. మార్చి 22 నుంచి లాక్డౌన్ ప్రకటించటం..విద్యార్థులు ఇంటిబాట పట్టడంతో పాఠశాలలు మూతపడ్డాయి. పదోతరగతి పరీక్షల నేపథ్యంలో జూన్ 1 నుంచి ఆయా రెసిడెన్సియల్, ఆశ్రమ, పాఠశాలలు ప్రారంభించారు. అయితే కేజీబీవీల్లో కాస్త ఆలస్యంగా విద్యార్థులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఏజెన్సీ ద్వారా సరుకుల పంపిణీ చేశారు. పరీక్షలు వాయిదా పడటం విద్యార్థులకు ఇంటికి వెళ్లిన సంగతి తెలియంది కాదు. ప్రస్తుతం ఆయా పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారో.. తెలియని పరిస్థితి నెలకొంది. ఇంకో వైపు మిగిలిన విద్యాసంస్థల మాటేలా ఉన్న కేజీబీవీల్లో మాత్రం గోధుమపిండి 50 కిలోలపైన ఉంటుందని తెలుస్తోంది. ఇడ్లీపిండి, రాగిమాల్ట్, కుడకపోడి, అల్లంపెస్ట్, ధనియాల పౌడర్ తదితర వస్తువులన్ని పురుగులు పట్టి నాణ్యత కోల్పోయాయి. కొన్నింట్లో సరే.. మరికొన్నింట్లో.. కోటపల్లి, నస్పూర్, మందమర్రి మోడల్ స్కూల్లో క్వారంటైన్ ఏర్పాటు చేయటంతో అక్కడ ఎటువంటి సమస్య లేకుండా పోయింది. మరికొన్ని కేజీబీవీల్లో నిత్యావసర సరుకులను ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఇదివరకే తహసీల్దార్లకు అప్పగించారు. మిగిలిన కేజీబీవీల్లో సరుకులకు మాత్రం పురుగులు పట్టి ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. అయితే పురుగులు పట్టిన, కాలం చెల్లిన సరుకులు మినహా మిగిలన సరుకులు తీసుకెళ్లాలని పలుమార్లు సూచించినా నెలలు గడిచిపోతుండటంతో తామేమి చేసుకోవాలంటూ గుత్తేదారు మడతపేచి పెడుతున్నట్లు తెలుస్తోంది. పురుగులు పట్టి, కాలం చెల్లిన (గడువు ముగిసిన) సరుకులు పోనూ మిగిలిన సరుకులైనా గుత్తేదారు తీసుకెళ్లటానికి నిరాసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విద్యాసంస్థలు తెరుచుకోవటానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో సరుకుల పరిస్థితిపై ఎటూ తేలకుండా పోతోంది. ఈ విషయంపై డీఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచనల మేరకు నడుచుకుంటామన్నారు. -
‘ఇది జంగిల్ రాజ్యం.. ఇక్కడ బడే పదిలం’
పాట్నా : వసతి గృహం గోడలపై పిచ్చి రాతలు రాస్తున్న యువకునికి బుద్ది చెప్పిన బాలికలపై దాదాపు 20 మంది యువకులు దాడి చేసిన సంఘటన తెలిసిందే. బిహార్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై నితీష్ కుమార్ ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో వసతి గృహంపై దాడిని ఖండస్తూ.. సదరు బాలికలకు తన మద్దతును తెలియజేస్తూ మర్య శకిల్ అనే యువతి ఓ లేఖను విడుదల చేశారు. దీనిలో ఆమె ‘మీరంతా సాధికారత సాధించినట్లు నేను భావిస్తున్నాను. మీ సైకిల్లు కార్లు, బస్సులతో పోటీ పడుతూ బిహార్ వీధుల వెంట పరుగు తీసేవి. మీ కళ్లలో ప్రపంచాన్ని జయిస్తాం అనే ధీమా కన్పించేది. ప్రతి ఒక్కరికి చదుకునే హక్కుంది. కానీ మా లాంటి తల్లులే ఆడపిల్లలకు చదువేందుకు అని ఆలోచిస్తుంటా. కానీ ఈ రోజు జరిగిన ఓ సంఘటన మీ సైకిల్ని రివర్స్ చేసింది. రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న మీ వసతి గృహం మీద ఓ పిచ్చి మూక విచాక్షణారహితంగా దాడి చేసింది. మీలో ఓ 30 మంది ఆస్పత్రి పాలయ్యారు’ అన్నారు. ఇంకా కొనసాగిస్తూ.. ‘ఇదంతా ఎందుకు జరిగింది.. ఎందుకంటే మిమ్మల్ని వేధించే వారి మీద మీరు తిరగబడ్డారు. మీ పాఠశాలలో జరిగిన సంఘటన ఒక్కటి చాలు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం అవ్వడానికి. ఇక్కడ స్త్రీ స్వేచ్ఛకు, సాధికారతకు ఒక రకమైన తప్పుడు సరిహద్దులను నిర్ణయించారు. కానీ మీరు భయపడకండి.. పాఠశాలే మీకు అత్యంత సురక్షితమైన తావు. ఇక్కడ మిమ్మల్ని కాపాడటానికి టీచర్లు, ప్రిన్సిపాల్ ఉన్నారు. వసతి గృహం మీద దాడి కానీ, ముజఫర్‌పూర్ షెల్టర్ హోం లో జరిగిన అకృత్యాల గురించి కానీ నితీష్ కుమార్ ప్రభుత్వం కనీసం స్పందించలేదు. దీని బట్టే ఈ ప్రభుత్వం మహిళల భద్రత పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో తెలుస్తుంది’ అన్నారు. అంతేకాక ‘భూస్వామ్య వ్యవస్థ వేళ్లునుకుపోయిన బిహార్ రాష్ట్రంలో మహిళలు మద్యపాన నిషేదాన్ని సమర్థించడం జరిగింది. ఇప్పుడిప్పుడే నా రాష్ట్రంలో సాంఘీక సంస్కరణలు చోటుచేసుకుంటున్నాయి. ఇది సంతోషకర పరిణామం. ఇక మీదట బిహార్ సీఎం సైకిల్లను ఇవ్వడం ఆపి మహిళల భద్రత, రక్షణల గురించి ఆలోచిస్తే మంచిది. బిహార్ మహిళలు కులానికి అతీతంగా ఓ తటస్థ వర్గంగా మారుతున్నారు. వారు తమ హృదయంతో ఆలోచించడం ప్రారంభిస్తున్నారు. ఇప్పటికి కూడా బిహార్ ఓ జంగిల్ రాజ్యమే. ఇక్కడ స్కూల్ తప్ప మరేది సురక్షితం కాదు. జరిగిన సంఘటనలతో మీరు ధైర్యాన్ని కోల్పోకండి. ఇలాంటి సంఘటనల వల్లే మనలోని ధైర్యం బయటకు వస్తుంది. మిమ్మల్నందరిని చూస్తుంటే నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మహిళలకు గౌరవం ఇవ్వని పురుషులతో ఇలాగే ప్రవర్తించాలి. మీరంతా మీ జీవితాల్లో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీ మర్య శకిల్’ అంటూ ముగించారు. -
కేజీబీవి నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం
సాక్షి, చర్ల: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ(కేజీబీవి) నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని లక్ష్మి కాలనీలో జరిగింది. స్థానికంగా ఉన్న కేజీబీవీలో చదువుతున్న కొయ్యూరుకు చెందిన గౌరి, సాయినగర్ కాలనీకి చెందిన సౌజన్యలు సోమవారం ఉదయం అదృశ్యమయ్యారు. వీరిద్దరూ పదో తరగతి చదువుతున్నారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సీఎం పేరు తెలియకపోతే ఎట్లా..?
హుస్నాబాద్ రూరల్: మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్నకు 6వ తరగతి విద్యార్థులు తెలియదు సార్ అని సమాధానమిచ్చారు. పదిహేను టేబుల్స్ వచ్చే వారు చేతులు లేపండి.. అంటే ఒక్కరైనా చేతులు లేపలేదు. అక్షరాల మధ్య వ్యత్యాసాన్ని కూడా గుర్తించలేని కేజీబీవీ విద్యార్థుల తీరు చూసి ప్రత్యేక అధికారి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చరణ్‌దాస్ విస్తుపోయారు. అక్కన్నపేట మండలానికి ప్రభుత్వం కొత్తగా కేజీబీవీ పాఠశాలను మంజూరు చేస్తే మండల కేంద్రంలో భవనాలు లేక హుస్నాబాద్‌లోనే 6,7 తరగతులు ప్రారంభించారు. పాఠశాలలో 21 మంది విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. చిన్న చిన్న విషయాలు కూడా తెలియని వీరికి ఏం చదువులు చెబుతున్నారని ఉపాధ్యాయులపై చరణ్‌దాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్‌కు నివేదిస్తానని చెప్పారు. ఒక ఉపాధ్యాయురాలు ముగ్గురు విద్యార్థులను దత్తత తీసుకొని విద్యాబోధన చేయాలన్నారు. ప్రభుత్వం బాలికల చదువుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సకల సౌకర్యాలు కల్పిస్తుంటే చదువు చెప్పకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘బాల్యాన్ని చిదిమేయద్దు’
బీటీపీ-గుమ్మఘట్ట : అభం.. శుభం తెలియని చిన్నారులకు వివాహాలు చేసి వారి జీవితాలను చిదిమేయడం మంచిది కాదని కేజీబీవీ ఎస్ఓ శారద విద్యార్థినుల తల్లిదండ్రులకు సూచించారు. గుమ్మఘట్ట మండలం బీటీప్రాజెక్ట్ వద్ద ఉన్న కేజీబీవీ పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం రమాదేవి అధ్యక్షతన గురువారం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఓ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 62 కేజీబీవీల్లో ఏటా 12,400ల మంది విద్యార్థినులు చదువుకుంటారని, వీరిలో సగటున 2,305 మంది విద్యార్థినీలు పది పరీక్షలు పూర్తవగానే ఇళ్లకు వెళతారన్నారు. ఇళ్లలో పెద్దలు చదువు చాలని 18 లోపే పెళ్లిలు చేస్తూ బంగారం లాంటి జీవితాలను నాశనం చేయడం మంచి పద్ధతి కాదని అవగాహన కల్పించారు. ప్రస్తుత ఏడాది కూడా 2305 మంది కేజీబీవీ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, తమ పాఠశాల నుంచి 40 మంది పరీక్షల్లో పాల్గొన్నట్లు వివరించారు. వీరికి బాల్య వివాహాలపై అవగాహన కల్పించేందుకే సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హెచ్ఎం మాట్లాడుతూ చదువుకున్న ప్రతి అమ్మాయి బాల్య వివాహాలపై తిరుగుబాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్వీఎం అధికారులు బాలమురళి తో పాటు ఉపాద్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
కన్నీటి కష్టాలు
చిలమత్తూరు : స్థానిక కేజీబీవీ (కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల)లో తాగునీటి ఎద్దడి నెలకొంది. పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థినులు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకుంటున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన బోరుకు సంబంధించిన మోటార్లు రెండు రోజుల క్రితం కాలిపోవడంతో సమస్య తలెత్తింది. దీంతో విద్యార్థులు నీటి కోసం నానా కష్టాలు పడుతున్నారు. పాఠశాల ఎదురుగా ఉన్న ఇటుకల ఫ్యాక్టరీలోని బోరు వద్దకు వెళ్లి బిందెలు, బకెట్లతో నీరు తెచ్చుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే మోటారుకు మరమ్మతులు చేయించి నీటి సమస్య తీర్చాలని విద్యార్థినులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. -
‘కస్తూర్బా’లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
పెద్దేముల్ మండలం మారేపల్లిలో ఘటన బంట్వారం/పెద్దేముల్ : ఓ ఆరో తరగతి విద్యార్థిని గుళికల మందు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన బుధవారం రాత్రి పెద్దేముల్ మండలం మారేపల్లి కస్తూర్బా గాంధీ వసతిగృహంలో చోటుచేసుకుంది. హాస్టల్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. బంట్వారం మండలం రొంపల్లి గ్రామానికి చెందిన జినుగుర్తి లలిత, పెంటప్ప దంపతుల కూతురు మల్లేశ్వరి(12) పెద్దేముల్ మండలం మారేపల్లిలోని కేజీబీవీ పాఠశాలలో ఇటీవల 6వ తరగతిలో చేరింది. 30 వరకు అక్కడే ఉన్న ఆమెను తల్లిదండ్రులు ఈనెల 5న స్వగ్రామానికి తీసుకెళ్లారు. పుష్పవతి కావడంతో 14వ తేదీ వరకు అక్కడే ఉంది. తిరిగి వసతిగృహానికి వెళ్లాలని తల్లిదండ్రులు చెప్పగా తాను వెళ్లనని మల్లేశ్వరి మొండికేసింది. తాను గ్రామంలోనే ఉండి చదువుకుంటానని చెప్పింది. తల్లిదండ్రులు ఆమెను ఈనెల 15న హాస్టల్లో చేర్పించి వెళ్లిపోయారు. బాలిక పథకం ప్రకారమే ఇంటి నుంచి విషపు గుళికలను తనతో తెచ్చుకుంది. ఇదిలా ఉండగా, బుధవారం రాత్రి మల్లేశ్వరి తోటి విద్యార్థులతో కలిసి భోజనం చేసింది. అందరూ నిద్రకు ఉపక్రమించగానే మల్లేశ్వరి తనతో తెచ్చుకున్న విష గుళికలను మిగింది. రాత్రి 11 గంటల తరువాత వాంతులు చేసుకోవడంతో అక్కడే డ్యూటీలో ఉన్న టీచర్ అనిత, నైట్ వాచ్మెన్ నర్సమ్మ, అటెండర్ పద్మమ్మలు గమనించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మోటారు సైకిల్‌పై పెద్దేముల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం పరిస్థితి విషమించడంతో నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. -
విరిగిన బస్సు యాక్సిల్ రాడ్; తప్పిన ప్రమాదం
పుల్లలచెరువు : యర్రగొండపాలెం నుంచి పుల్లలచెరువు వస్తున్న ఆర్టీసీ బస్సు ఇంజిన్ యాక్సిల్ రాడ్ ఊడిపోయిన సంఘటన స్థానిక కేజీబీవీ పాఠశాల వద్ద ఆదివారం చోటుచేసుకుంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును నిలిపేయడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. చెరువు గట్టుపై ఇలా జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని స్థానికులు అన్నారు. ప్రభుత్వం కాలం చెల్లిన బస్సులు నడుపుతూ.. ప్రయాణికుల ప్రాణాలకు భద్రత లేకుండా చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. రోడ్డు భత్రతా వారోత్సవాలను నిర్వహించిన కొద్దిరోజులకే ఈ సంఘటన చోటుచేసుకోవడాన్ని గమనిస్తే.. ప్రభుత్వం ప్రయాణికులకు ఎలాంటి భద్రత కల్పిస్తోందో అర్థం చేసుకోవచ్చన్నారు.