‘కస్తూర్బా’లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
పెద్దేముల్ మండలం మారేపల్లిలో ఘటన
బంట్వారం/పెద్దేముల్ : ఓ ఆరో తరగతి విద్యార్థిని గుళికల మందు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన బుధవారం రాత్రి పెద్దేముల్ మండలం మారేపల్లి కస్తూర్బా గాంధీ వసతిగృహంలో చోటుచేసుకుంది. హాస్టల్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. బంట్వారం మండలం రొంపల్లి గ్రామానికి చెందిన జినుగుర్తి లలిత, పెంటప్ప దంపతుల కూతురు మల్లేశ్వరి(12) పెద్దేముల్ మండలం మారేపల్లిలోని కేజీబీవీ పాఠశాలలో ఇటీవల 6వ తరగతిలో చేరింది. 30 వరకు అక్కడే ఉన్న ఆమెను తల్లిదండ్రులు ఈనెల 5న స్వగ్రామానికి తీసుకెళ్లారు. పుష్పవతి కావడంతో 14వ తేదీ వరకు అక్కడే ఉంది.
తిరిగి వసతిగృహానికి వెళ్లాలని తల్లిదండ్రులు చెప్పగా తాను వెళ్లనని మల్లేశ్వరి మొండికేసింది. తాను గ్రామంలోనే ఉండి చదువుకుంటానని చెప్పింది. తల్లిదండ్రులు ఆమెను ఈనెల 15న హాస్టల్‌లో చేర్పించి వెళ్లిపోయారు. బాలిక పథకం ప్రకారమే ఇంటి నుంచి విషపు గుళికలను తనతో తెచ్చుకుంది. ఇదిలా ఉండగా, బుధవారం రాత్రి మల్లేశ్వరి తోటి విద్యార్థులతో కలిసి భోజనం చేసింది. అందరూ నిద్రకు ఉపక్రమించగానే మల్లేశ్వరి తనతో తెచ్చుకున్న విష గుళికలను మిగింది.
రాత్రి 11 గంటల తరువాత వాంతులు చేసుకోవడంతో అక్కడే డ్యూటీలో ఉన్న టీచర్ అనిత, నైట్ వాచ్‌మెన్ నర్సమ్మ, అటెండర్ పద్మమ్మలు గమనించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మోటారు సైకిల్‌పై పెద్దేముల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం పరిస్థితి విషమించడంతో నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.