
హుస్నాబాద్ రూరల్: మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్నకు 6వ తరగతి విద్యార్థులు తెలియదు సార్ అని సమాధానమిచ్చారు. పదిహేను టేబుల్స్ వచ్చే వారు చేతులు లేపండి.. అంటే ఒక్కరైనా చేతులు లేపలేదు. అక్షరాల మధ్య వ్యత్యాసాన్ని కూడా గుర్తించలేని కేజీబీవీ విద్యార్థుల తీరు చూసి ప్రత్యేక అధికారి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చరణ్‌దాస్ విస్తుపోయారు. అక్కన్నపేట మండలానికి ప్రభుత్వం కొత్తగా కేజీబీవీ పాఠశాలను మంజూరు చేస్తే మండల కేంద్రంలో భవనాలు లేక హుస్నాబాద్‌లోనే 6,7 తరగతులు ప్రారంభించారు.
పాఠశాలలో 21 మంది విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. చిన్న చిన్న విషయాలు కూడా తెలియని వీరికి ఏం చదువులు చెబుతున్నారని ఉపాధ్యాయులపై చరణ్‌దాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్‌కు నివేదిస్తానని చెప్పారు. ఒక ఉపాధ్యాయురాలు ముగ్గురు విద్యార్థులను దత్తత తీసుకొని విద్యాబోధన చేయాలన్నారు. ప్రభుత్వం బాలికల చదువుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సకల సౌకర్యాలు కల్పిస్తుంటే చదువు చెప్పకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.