భర్త కోసం నిరీక్షిస్తున్న అభాగిని
బాన్సువాడ: అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను రోడ్డు పక్కన వదిలేసి పారిపోయాడొక భర్త. తనకోసం భర్త వస్తాడని ఆ అభాగ్యురాలు ఆరు రోజులుగా నిరీక్షిస్తోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌కు చెందిన లక్ష్మణ్ బిచ్కుందలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో కూలీగా పనిచేస్తున్నాడు.
లక్ష్మణ్ భార్య జ్యోతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఈనెల 18న రాత్రి లక్ష్మణ్ తన భార్య జ్యోతిని తీసుకుని బాన్సువాడలోని సరస్వతి మందిరం సమీపానికి వచ్చాడు. అక్కడ ఉన్న ఇసుక డంప్‌పై ఆమెను పడుకోబెట్టి, తెల్లారి వస్తానని చెప్పి, మూడు నెలల బాబును మాత్రం తీసుకుని వెళ్లాడు. తెల్లారి వస్తానని చెప్పి వెళ్లినవాడు ఇప్పటికీ రాలేదు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి నడవలేని స్థితిలో ఉన్న జ్యోతి.. చలిలో ఇసుకపైనే గడుపుతోంది.
అక్కడ ఉన్న స్థానికులు దీనిని గమనించి రోజూ అన్నం పెడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించేందుకు ప్రయతి్నంచామని, కానీ వైద్యులు చేర్చుకోలేదని తెలిపారు. మంగళవారం కొందరు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి జ్యోతిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. భర్త వచ్చి తనను తీసుకెళ్తాడని జ్యోతి ఆశతో ఇప్పటికీ ఎదురుచూస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment