సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీర్ల(Beers) నిల్వలు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం గోడౌన్‌లో లక్ష కేసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 8 వరకు సుమారు 84 లక్షల కేసులు ఉండగా క్రమేపి బీర్ల స్టాక్ తగ్గుతోంది. మరో రెండు, మూడు రోజులు మేనేజ్ చేయొచ్చని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. పాత బకాయిలు ఇవ్వకపోవడంతో బీర్ల స్టాక్‌ను యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) సంస్థ నిలిపివేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో కొత్త బీర్ బ్రాండ్లు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రిజిస్టర్ కానీ కంపెనీలను తీసుకొస్తే ఇబ్బందులు తప్పవని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు. గోడౌన్‌లో ఉన్న స్టాక్‌ను విడుదల వారీగా ప్రభుత్వం విడుదల చేస్తోంది.
తాము తయారు చేసే బీర్లను ఇక నుంచి తెలంగాణలో సరఫరా చేయబోమని యూబీ సంస్థ ప్రకటించింది. బేసిక్ ధరలు పెంచలేదని, బిల్లులు పెండింగ్‌లో ఉన్నందున బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు కంపెనీ నిబంధనల ప్రకారం...ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ (బాంబే స్టాక్ ఎక్స్చేంజ్)లకు సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలో నాలుగైదు బ్రాండ్ల బీర్లకు మంచి మార్కెట్ ఉంది.
అందులో యూబీ తయారు చేసే కింగ్‌ఫిషర్ బీర్లదే సింహభాగం. మొత్తం తెలంగాణ మార్కెట్‌లో 72 శాతం వరకు ఈ బ్రాండ్‌దే ఉంటుందని అంచనా. ఈ బీర్లు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్)కు సరఫరా చేసినందుకుగాను కేస్‌కు రూ.289 చొప్పున తయారీదారులకు చెల్లిస్తారు. ఈ బేసిక్ ధర పెంచాలన్న డిమాండ్ ఎక్సైజ్ శాఖలో చాలా కాలంగా వినిపిస్తున్నా, అమల్లోకి రాకపోవడంతో తాజా సమస్య ఏర్పడింది. 2019–20 నుంచి కంపెనీకి చెల్లించే బేసిక్ ధరలను తెలంగాణ ప్రభుత్వం సవరించలేదని, దీని కారణంగా భారీ నష్టాలు వస్తున్నాయని ఆ లేఖలో వెల్లడించారు. టీజీబీసీఎల్ చెల్లించాల్సిన పెద్ద మొత్తం పెండింగ్‌లో ఉందని, ఈ కారణంగానే తాము బీర్లు సరఫరా చేయడం లేదని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: తక్షణమే ప్రక్షాళన..!
Comments
Please login to add a commentAdd a comment