మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే పిల్లల్లో ఒకరిగా మారి ఆనందించేవాడు.పేదపిల్లల కోసం ఏదైనా చేయాలనేది ఆయన కల. ఆ కల సాకారం కాకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు.తండ్రి కలను నెరవేర్చడానికి సేవాపథంలోకి వచ్చింది పోర్షియా పుటతుండ...
ఝార్ఖండ్‌లోని రాంచీలో పుట్టిన పోర్షియా పుటతుండ కోల్‌కతా, దిల్లీ, నోయిడా, ముంబైలలో పెరిగింది. పోర్షియా తండ్రికి పిల్లలంటే ఎంతో ఇష్టం. పిల్లలతో కలిసి నర్సరీ రైమ్స్ పాడడం ఇష్టం. ఆటలు ఆడుతూ పాఠాలు చెప్పడం ఇష్టం. గ్రామీణ ప్రాంతాలలోని పేదపిల్లలకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంచేవాడు.పేద పిల్లల కోసం తనవంతుగా ఏదైనా చేయాలని నిరంతరం తపించేవాడు. తన కలలు సాకారం కాకుండానే ఆయన చనిపోయారు.
తండ్రి జ్ఞాపకాల స్ఫూర్తితో ఆయన ఆశయాలను నెరవేర్చే క్రమంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని కోమిక్ అనే గ్రామంలో అక్కడి అట్టడుగు వర్గాల పిల్లల కోసం ఫ్రీబోర్డింగ్ స్కూల్ ప్రారంభించింది పోర్షియా. ‘హైయెస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా’గా పేరున్న కోమిక్‌లోని ఎంతోమంది పేద పిల్లలకు పోర్షియా ఇప్పుడు తల్లి, గురువు, సంరక్షకురాలు. జర్నలిజంలో డిగ్రీ చేసిన పోర్షియా ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో పనిచేసింది. ఆ తరువాత ‘సీఎన్‌ఎన్’లో న్యూస్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహించింది. కొంతకాలం తరువాత జర్నలిజాన్ని వదులుకొని సేవాదారిలోకి వచ్చింది.
పోర్షియా ఈ గ్రామాన్ని ఎంచుకోవడానికి కారణం?
ఆమెకు ప్రయాణాలు అంటే చాలా ఇష్టం. తొలిసారిగా హిమాచల్‌ద్రేశ్‌లోని స్పితి లోయకు వచ్చినప్పుడు తనకు ఎంతో మనశ్శాంతిగా అనుభూతి చెందింది. ఆ ప్రాంతంతో ఏదో అనుబంధం ఉన్నట్లు అనిపించింది. తండ్రి చనిపోయిన తరువాత పోర్షియాపై కుంగుబాటు నీడలు కమ్ముకున్నాయి. చీకట్లో నుంచి వెలుగులోకి రావడానికి తనకు ఇష్టమైన ప్రదేశం గురించి పోర్షియా ఆలోచిస్తున్నప్పుడు స్పితి గుర్తుకు వచ్చింది. అక్కడి పేదపిల్లలతో మాట్లాడుతున్నప్పుడు స్వయంగా తండ్రితో మాట్లాడినట్లే అనిపించింది. వారి కోసం ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. స్కూల్ ప్రారంభానికి ముందు కజా ప్రాంతంలోని ఒక స్థానిక కుటుంబంతో నెలరోజులు గడిపింది. ఆ కుటుంబంలోని పిల్లలకు పాఠాలు చెప్పింది.
ప్రకృతి సోయగాలను ఆస్వాదించడం కోసం ఊళ్ల వెంట తిరుగుతున్నప్పుడు చదువుకు దూరమైన, సరైన చదువు లేని ఎంతోమంది పేదపిల్లలు కనిపించారు. వారిని విద్యావంతులను చేయాల్సిన అవసరం కనిపించింది. ‘ఉద్యోగాన్ని, ముంబైని విడిచి ఇక్కడకు రావడం అనేది సాహసంతో కూడుకున్న పని. కాని నేను ఇష్టంతో ఇక్కడకు వచ్చాను. ముంబైని విడిచి రావాలనే ఆలోచన నా స్నేహితులు, సన్నిహితులు ఎవరికీ నచ్చలేదు. తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నావు అని ముఖం మీదే చెప్పారు. గోడకు కొట్టిన బంతిలా తిరిగి వస్తావు అని కూడా అన్నారు. అయితే అవేమీ నా నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. ఇక్కడికి వచ్చిన తరువాత నా జీవితానికి ఒక పరమార్థం దొరికినట్లు అనిపించింది’ అంటుంది పోర్షియా.
తొలి అడుగులో భాగంగా....
పిల్లలు ఆడుకునే చోటుకు వెళ్లేది. ‘మీకు బొమ్మలు ఎలా వేయాలో నేర్పిస్తాను’ ‘కొత్త ఆటలు నేర్పిస్తాను’ ‘ఇంగ్లీష్‌లో మాట్లాడడం నేర్పిస్తాను’ అంటూ వారితో స్నేహం చేసేది. చెట్టు కింద కూర్చొని బొమ్మలు గీయడం, రైమ్స్ పాడడం నేర్పేది. ఒక్కరొక్కరుగా నలభై మంది పిల్లల వరకు ఆమెకు దగ్గరయ్యారు. ఆ సమయంలో తనకు ఫ్రీ బోర్డింగ్ స్కూల్ ఆలోచన వచ్చింది. కోమిక్‌లో ఒక ప్రదేశాన్ని అద్దెకు తీసుకొని ఫ్రీ బోర్డింగ్ స్కూల్ ప్రారంభించింది. ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్లు పెద్ద సమస్య వచ్చింది.
‘ఇప్పుడు మా పిల్లలు చదువుకొని ఏం చేయాలి? చిన్నాచితకా పనులు చేసుకుంటే ఏదో విధంగా బతుకుతారు’ అంటూ పిల్లలను బడికి పంపడానికి తల్లిదండ్రులు నిరాకరించేవారు. వారి ఆలోచన ధోరణిలో మార్పు తీసుకురావడానికి పోర్షియా చాలా కష్టపడాల్సి వచ్చింది.పాఠాలతో పాటు తోటపని నుంచి నృత్యం వరకు పిల్లలకు ఎన్నో నేర్పుతోంది పోర్షియా. ‘నా కల సాకారం అవుతుందా, లేదా అనుకునేదాన్ని. స్కూల్ ప్రారంభించిన తరువాత నా మీద నాకు, నా పై పిల్లల పేరెంట్స్‌కు నమ్మకం వచ్చింది. ఇది తొలి అడుగు మాత్రమే’ అంటుంది పోర్షియా పుటతుండ.
Comments
Please login to add a commentAdd a comment