
పరీక్ష రాస్తోన్న సాయితేజ
చిగురుమామిడి(హుస్నాబాద్): కన్నతండ్రి గుండెపోటుతో మృతిచెందగా.. ఆయన లేడన్న బాధను దిగమింగుకుని పదో తరగతి పరీక్ష రాశాడో విద్యార్థి. ఈ హృదయవిదారక సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలకేంద్రంలో కంటతడి పెట్టించింది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పెనుకుల బాలయ్య వీఆర్‌ఏగా పనిచేస్తున్నాడు. పదినెలల క్రితం గుండెపోటుకు గురికాగా.. సర్జరీ జరిగింది.
రూ.పది లక్షలు ఖర్చు చేసి ప్రాణాన్ని నిలుపుకున్నారు. మూడురోజుల క్రితం బాలయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని కుటుంబసభ్యులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లినా.. వారు చికిత్సకు ముందుకు రాలేదు. పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఎంజీఎంకు తరలిస్తుండగా.. బుధవారం అర్ధరాత్రి బాలయ్య(46) చనిపోయాడు.
అప్పటివరకు తండ్రివెంటే ఉన్న ఆయన కుమారుడు సాయితేజకు తెల్లవారితే పదో తరగతి పరీక్షలు. తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా.. పుట్టెడు దుంఖఃతో పరీక్ష కేంద్రానికి వెళ్లిన సాయితేజ పరీక్షకు హాజరయ్యాడు. అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొని చితికి నిప్పుపెట్టి బోరున విలపించాడు. బాలయ్యకు భార్య తారవ్వ, కూతురు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment