కరీంనగర్ ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : పదో తరగతి పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం నుంచి వచ్చే నెల 15 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ అన్ని సెంటర్లకు చేరవేశారు. విద్యార్థులకు హాల్‌టికెట్లను పంపిణీ చేశారు. ప్రశ్నపత్రాలను మూడు విడతలుగా మూడు సెట్లను పోలీస్‌స్టేషన్లలో భద్రపరచనున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి డీఈవో కార్యాలయంతోపాటు ఆయా డివిజన్లలో సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులకు, కస్టోడియన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షలకు రాష్ట్ర పరిశీలకులుగా తులసీదాస్ వ్యవహరించనున్నారు.
284 పరీక్ష కేంద్రాలు
పదో తరగతి వార్షిక పరీక్షల కోసం జిలా వ్యాప్తంగా 284 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 59,073 మంది రెగ్యులర్ విద్యార్థులు, 6,380 మంది ప్రైవేట్ విద్యార్థులు మొత్తం 65,453 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 4వేల మంది ఉపాధ్యాయులకు విధులు అప్పగించారు.
టీఏ, డీఏల భారం పడకుండా పరీక్ష కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల పరిధిలోని ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులు, ఇన్విజిలేటర్ల బాధ్యతలు అప్పగించారు. సరిపోని చోట ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకున్నారు. మాస్ కాపీయింగ్ నిరోధానికి 14 స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. మాస్ కాపీయింగ్ జరిగితే సంబంధిత ఇన్విజిలేటర్‌తోపాటు సూపరింటెండెంట్‌పైనా చర్యలుంటాయి.
సిట్టింగ్ స్క్వాడ్ బృందాలతోపాటు ఒక రెవెన్యూ, పోలీస్ అధికారిని కేటాయించారు. విద్యార్థుల సౌకర్యార్థం తాగునీరు, వైద్య సౌకర్యాలు కల్పించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష వేళల్లో ఆయా రూట్లలో ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. ఏమైనా సందేహాలు, ఫిర్యాదులు చేయాలనుకునేవారు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నంబర్ 2243268లో సంప్రదించాలని సూచించారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలుగా గోదావరిఖని, రామగుండం, జమ్మికుంట ప్రాంతాలను గుర్తించారు.
ఏర్పాట్లు పూర్తి : డీఈవో లింగయ్య
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాం. అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించాం. పరీక్షలు సాఫీగా సాగేందుకు పలు సూచనలు చేశాం. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయకుండా హాల్‌టికెట్లు అందించాలి. ఒత్తిడి లేకుండా పరీక్ష రాయాలి.
‘పది’కి సిద్ధం
Published Wed, Mar 26 2014 4:36 AM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM
Advertisement
Advertisement