
పది పరీక్షలకు సర్వం సిద్ధం
- 17 నుంచి పరీక్షలు
- జిల్లాలో 173 సెంటర్లు
- హాజరుకానున్న 34,381మంది విద్యార్థులు
- అరగంట ముందు కేంద్రంలోకి అనుమతి
- మాల్‌ప్రాక్టీసుకు పాల్పడితే ఇన్విజిలేటర్లదే బాధ్యత
- డీఈఓ మువ్వా రామలింగం
నెల్లూరు (టౌన్): ఈ నెల 17వ తేదీ నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం తెలిపారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 173 సెంటర్లలో పది పరీక్షలను నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 34,381 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. వీరిలో 33,798 మంది రెగ్యులర్, 583 మంది గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. పది పరీక్షల నిర్వహణకు మొత్తం 525మంది అధికారులు, ఉద్యోగులను నియమించామన్నారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా 10ఫ్లయింగ్, 31 సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించినట్లు తెలిపారు. పరీక్షల్లో విద్యార్థులు మాల్ ప్రాక్టీసుకు పాల్పడితే విద్యార్థులను డీబార్ చేయబోమన్నారు. 25/97 చట్టం ప్రకారం ఇన్విజిలేటర్లు, డిపార్ట్‌మెంట్ అధికారులను బాధ్యులుగా చేయనున్నట్లు వెల్లడించారు.
పోలీస్‌స్టేషన్లకు చేరిన ప్రశ్నపత్రాలు
ఇప్పటికే అన్ని పరీక్ష కేంద్రల సమీపంలోని పోలీసు స్టేషన్లకు ప్రశ్నపత్రాలను పంపించినట్లు డీఈఓ చెప్పారు. ముందురోజు పరీక్ష కేంద్రానికి వెళ్లి హాల్‌టెకెట్ నంబరును చూసుకోవాలని సూచించారు. పరీక్ష సమయానికి అర్ధగంట ముందు పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్, క్యాలుకలేటర్, ఎలాక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని చెప్పారు. విద్యార్థులు ఇబ్బందుల పడకుండా అన్ని కేంద్రాల్లో బెంచీల సదుపాయాన్ని కల్పించినట్లు తెలిపారు.
కేంద్రాల వద్ద కుండల్లో మినిరల్ వాటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇళ్ల దగ్గర నుంచి మంచినీటి బాటిళ్లు, మజ్జిగను తెచ్చుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఫార్మాట్, సమ్మెటివ్ పరీక్షలు రాసి 75 శాతం హాజరు ఉన్న ప్రతి విద్యార్థికీ హాల్ టికెట్లు అందజేసినట్లు పేర్కొన్నారు. హాల్ టికెట్లను చూపిస్తే పాఠశాలల నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించామన్నారు.