‘పది’పైనా పునరాలోచన! | Telangana Government Reconsideration For Tenth Class Exam Dates | Sakshi
Sakshi News home page

‘పది’పైనా పునరాలోచన!

Published Mon, Mar 28 2022 3:43 AM | Last Updated on Mon, Mar 28 2022 9:54 AM

Telangana Government Reconsideration For Tenth Class Exam Dates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పదవ తరగతి పరీక్షల తేదీలు మార్చాలన్న డిమాండ్‌పై ప్రభుత్వం పునరాలోచన చేస్తున్నట్టు సమాచారం. దీనిపై వాస్తవ నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులను కోరినట్టు తెలిసింది. ఏప్రిల్‌లో పరీక్షలు పెడితే ఎలా ఉంటుందనే దానిపై ఆమె అధికారులను ఆరా తీసినట్టు సమాచారం. టెన్త్‌ పరీక్షలను మే 23 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

జేఈఈ మెయిన్స్‌ తేదీల్లో మార్పు వల్ల ఇంటర్‌ పరీక్ష తేదీల్లో మార్పులు చేయడం అనివార్యమైంది. ఏప్రిల్‌కు బదులు మేలో టెన్త్‌ పరీక్షలను ఖరారు చేశారు. అయితే దీనిపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. వచ్చే విద్యా సంవత్సరంపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.  

ఆలస్యమైతే ఇదీ పరిస్థితి 
ప్రస్తుత షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ ఒకటో తేదీన టెన్త్‌ చివరి పరీక్ష ముగుస్తుంది. ఆ తర్వాత జిల్లా కేంద్రాల్లో సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుంది. గతంలో 11 పేపర్లు ఉన్నప్పుడు వాటి వాల్యుయేషన్‌ పూర్తి కావడానికి 15 రోజుల సమయం పట్టేది. కానీ ప్రస్తుతం 6 పేపర్లు కాబట్టి కనీసం పది రోజుల సమయం తీసుకుంటుంది.  

ఒక విద్యార్థి రాసిన ఆరు సమాధాన పత్రాలు ఆరు వేర్వేరు జిల్లాలకు మూల్యాంకనం కోసం పంపుతారు. మూల్యాంకనం అనంతరం వేర్వేరు సబ్జెక్టుల్లో పొందిన మార్కుల వివరాలను అన్నింటినీ రాష్ట్రస్థాయిలో క్రోడీకరించి ఫలితాలను నిర్ణయిస్తారు. ఈ ఏడాది ఐదు లక్షల మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాసేవీలుంది.అంటే 30 లక్షల జవాబు పత్రాలకు సంబంధించిన మార్కుల (ఆరు సబ్జెక్ట్‌లు)వివరాలను క్రోడీకరించాలి. ఈ ప్రక్రియకు ఇరవై రోజుల సమయం పడుతుంది.  

ఇలా పరీక్షలు ముగిసిన తర్వాత సమాధాన ప త్రాల మూల్యాంకనానికి పది రోజులు, ఫలితాల వెల్లడికి 20 రోజులు మొత్తంగా 30 రోజుల కనీస సమయం తీసుకుంటుంది. అంటే జూలై మొదటి వారంలో పదవ తరగతి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంటుంది.  

ఫలితాల విడుదల తర్వాత ఎంత వేగంగా ప్రింటింగ్‌ ప్రక్రియ పూర్తి చేసినా, మెమోలను ప్రింట్‌ చేసి పాఠశాలలకు పంపించడానికి కనీసం 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. దీంతో సాధారణం కంటే నెల ఆలస్యంగా జూలై చివరి వారంలోనే టెన్త్‌ విద్యార్థులు తదుపరి కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంటుంది. సీబీఎస్‌ఈ విధానంలో చదివే విద్యార్థులకు ఏప్రిల్‌లో పరీక్షలు మొదలవుతాయి.

ఫలితాలూ త్వరగా వస్తాయి. ప్రైవేటు కాలేజీలు కూడా మే నుంచే ఇంటర్‌ అడ్మిషన్లు మొదలు పెడతాయి. ఈ అంశాలన్నింటిపై విద్యాశాఖ మంత్రికి ఇప్పటికే అనేక వినతులు అందినట్టు సమాచారం. వాస్తవానికి కరోనా కారణంగా ఈ ఏడాది టెన్త్‌ సిలబస్‌ను 70 శాతానికి తగ్గించారు. అన్ని పాఠశాలల్లో సిలబస్‌ ప్రకారం బోధన పూర్తయింది.

ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో రివిజన్‌ టెస్టులు పెడుతున్నారు. కాబట్టి ఏప్రిల్‌లో పరీక్షలు పెడితే విద్యార్థులు  పరీక్షలు బాగా రాసే వీలుందని అంటున్నారు. అలాకాకుండా వేసవి మండిపోయే సమయంలో మూడు గంటల పాటు పరీక్ష రాయడం విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతుందని అంటున్నారు. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏప్రిల్‌ 23 పాఠశాలలకు చివరి పనిదినం.  

ఏప్రిల్‌లోనే నిర్వహించాలి
పదవ తరగతి పరీక్షలను మే నెలకు బదులు ఏప్రిల్‌లో నిర్వహించాలని తెలంగాణ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం.. విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరింది. ఆమెను ఆదివారం సంఘం ప్రతినిధులు రాజా భానుచంద్రప్రకాశ్, తుకారాం, కృష్ణ, గిరిధర్‌ తదితరులు కలిశారు. పరీక్షలు ఆలస్యమైతే వచ్చే విద్యా సంవత్సరంపై తీవ్ర ప్రభావం పడుతుందని, మండు వేసవిలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఇబ్బందులు పడతారని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement