సాక్షి, సిటీబ్యూరో: ‘పిల్లలకే కాదు..వారి భవిష్యత్తుపైగంపెడాశలు పెట్టుకున్న తల్లిదండ్రులకూ ఇది ఓ ‘పరీక్షా’ కాలం. పరీక్షలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పిల్లల్లోనే కాదు తల్లిదండ్రుల్లోనూ ప్రిపరేషన్‌పై ఆందోళన మొదలవుతుంది. నిజానికి ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే తల్లిదండ్రులు తమ పిల్లలకు అండగా నిలిచి, ఆత్మ విశ్వాసాన్నిపెంపొందించాలి. అప్పుడే పిల్లలు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా విజయవంతంగా పరీక్ష రాస్తారు. తద్వారా మంచి మార్కులు సాధిస్తారు’ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్చి 4 నుంచి 23 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలు, 19 నుంచి ఏప్రిల్ 6 వరకు టెన్త్ వార్షిక పరీక్షలు జరుగనున్నాయి.
గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి 450 పరీక్షా కేంద్రాల్లో నాలుగు లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష రాయబోతున్నారు. ఇప్పటికే అధికారిక యంత్రాంగం అంతా పరీక్షల ఏర్పాట్లలో నిమగ్నం కాగా... పిల్లల ప్రిపరేషన్ విషయంలో తల్లిదండ్రులు కుస్తీపడుతున్నారు. సాధారణంగా వార్షిక పరీక్షలు అనగానే పిల్లల్లో తీవ్రమైన మానసిక ఆందోళన మొదలవుతుంది. ఇది చదువు...అది చదువు... ఇలా చదవాలి... అలా చదవాలి... అంటూ తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తెస్తుంటారు. దీంతో పిల్లలు తీవ్రమైన ఒత్తిడికిలోనై ఇప్పటికే చదవిన అంశాలన్ని మర్చిపోతుంటారు. నిద్రాహారాలు మాని చదువుతుండటం వల్ల విద్యార్థుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇలాంటి క్లిష్టమైన సమయంలో పిల్లలకు తల్లిదండ్రులు అండగా నిలవాలి. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారికి అండగా నిలవాలి. ఇంట్లో చదువుకునే వాతావరణాన్ని కల్పించడంతో పాటు నిద్రాహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పరీక్షలపై కలెక్టర్ సమీక్ష
వార్షిక పరీక్షల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎం.కృష్ణ సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ఆయా విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ, విద్యుత్, ఆర్టీసీ, జలమండలి, తపాలా, ట్రాఫిక్, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. వార్షిక పరీక్షల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన ఏర్పాట్లను సమీక్షించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ తాగేందుకు మంచినీరు ఏర్పాటు చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. పరీక్షల సమయంలో విద్యుత్ కోతలు లేకుండా చూడాలని, లైన్ల మరమ్మతు పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి విద్యుత్ కోతలు లేకుండా చూడాలని సీపీడీసీఎల్ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చూడాలని పోలీసులకు, అస్వస్థతకు గురైన విద్యార్థులకు తక్షణ వైద్యసేవలు అందించేందుకు ప్రతి సెంటర్‌లో ఒక ఏఎన్‌ఎం సహా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కోరారు.పరీక్షల కోసం ప్రత్యేక బస్సులను నడపాల్సిందిగా ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష పూర్తైన తర్వాత పేపర్లను సకాలంలో ఆయా పరీక్ష కేంద్రాల నుంచి వాల్యూయేషన్ కేంద్రాలకు చేర్చాల్సిందిగా తపాలా శాఖకు సూచించారు.
ఇంట్లో వాతావరణం కీలకం
విద్యార్థులకు పునశ్ఛరణ సమయం చాలా ముఖ్యమైంది. ప్రణాళికాబద్ధంగా చదివితే అధిక మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. తోటి విద్యార్థులతో కలిసి అభ్యసనం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివేవారు తప్ప మిగిలిన విద్యార్థులు పాఠశాలల్లో గడిపేది రోజుకు ఎనిమిది నుంచి పది గంటలు మాత్రమే. మిగిలిన సమయంలో ఎక్కువగా ఇంట్లోనే ఉంటారు కాబట్టి, వాళ్లు చదువులో రాణించేందుకు ఇంటి వాతావరణం ఎంతో ముఖ్యం. విద్యార్థులు ఇంటివద్ద చదివేటపుడు..వీలైనంతవరకూ వారిని టీవీ, కంప్యూటర్ వంటి ఉపకరణాలకు, వినోదాలకు దూరంగా ఉంచాలి. వారి ముందు సెల్‌ఫోన్ సంభాషణలు సరికాదు. పిల్లలకు ప్రత్యేక గది లేని ఇంట్లో పరీక్షల ముందు కేబుల్ కనెక్షన్ తొలగించడం అవసరం. పరీక్షల ముందు విందులు, వినోదాలు, శుభ కార్యాలకు విద్యార్థులను తీసుకెళ్లొద్దు. విద్యార్థికి సమయంతో పాటు ఏకాగ్రత కూడా చాలా ముఖ్యం. – డాక్టర్ కళ్యాణ చక్రవర్తి,మానసిక నిపుణుడు
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త
బాగా రాయాలనే ఆలోచనతో చాలామంది రాత్రంతా నిద్రపోకుండా చదువుతుంటారు. దీంతో తలనొప్పి మొదలై చదివింది కూడా మర్చిపోయే అవకాశం ఉంది. కొంతమంది ఏమీ తినకుండా పరీక్షకు వెళ్తుంటారు. ఇలా చేస్తే కళ్లు తిరిగి, స్పృహ తప్పే ప్రమాదం ఉంది. పరీక్షల సమయంలో వేళకు పౌష్టికాహారం తీసుకోవడం, నిద్రపోవడం అవసరం. నగరంలో ట్రాఫిక్ సమస్య ఉంటుంది కాబట్టి ఓ గంట ముందే కేంద్రానికి చేరుకుంటే మంచిది. పరీక్షల సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బాగా జవాబులు రాయొచ్చు. అంతేకాదు పిల్లల ఆత్మవిశ్వాసం పెంచేలా మాట్లాడాలి. ’చాలా తెలివైనవాడివి..అనుకుంటే ఏదైనా సాధిస్తావు..’ లాంటి పదాలను వాడుతూ ప్రోత్సహించాలి. ఏకాగ్రతను పెంచుకునేందుకు, ఒత్తిడిని అధిగమించేందుకు కొంత సమయం ఇంటి వద్ద యోగా, ధ్యానం చేయించాలి. – రాధిక, సైకాలజిస్ట్
వారం రోజుల్లో హాల్‌టికెట్లు
అభ్యర్థుల హాల్ టికెట్లు మరో వారం రోజుల్లో ఆయా కాలేజీలకు అందనున్నాయి. ఫీజులు చెల్లించకపోవడంతో వారికి హాల్‌టికెట్లు ఇచ్చేందుకు యాజమాన్యాలు నిరాకరించే అవకాశం ఉండటంతో విద్యార్థులే నేరుగా హాల్ టికెట్‌ను పొందే అవకాశం కల్పించాం. ఆన్‌లైన్ నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే వీలుకల్పించాం.–బి.జయప్రద బాయి,హైదరాబాద్ జిల్లా ఇంటర్ బోర్డు ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment