
ఇన్విజిలేషన్‌లో నిర్లక్ష్యం వహిస్తే జైలుకే!
పదో తరగతి పరీక్షల్లో అమలుచేస్తూ ప్రభుత్వ ఆదేశాలు
నిర్లక్ష్యంగా ఉండే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు
6 నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు.. రూ.5 వేల నుంచి లక్ష జరిమానా
1997 నాటి ఉత్తర్వులు.. ఇప్పుడు కచ్చితంగా అమలుకు నిర్ణయం
పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు చేసేందుకు సదుపాయాలు కరువు
ఇలాగైతే ఇన్విజిలేషన్ విధులు చేయబోమంటున్న ఉపాధ్యాయులు
సాక్షి, హైదరాబాద్: పరీక్షల ఇన్విజిలేషన్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇక జైలుశిక్ష విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు జరి మానా కూడా విధించనుంది. ఈ మేరకు 1997 నాటి యాక్ట్ 25, సెక్షన్ 10లోని నిబంధనలను పదో తరగతి వార్షిక పరీక్షల్లో కచ్చితంగా అమలు చేయాలంటూ సోమవారం ప్రభుత్వ పరీక్షల విభాగం జిల్లా విద్యాధికారుల (డీఈవోల)ను ఆదేశించింది. దాని ప్రకారం నిర్లక్ష్యం వహించిన ఇన్విజిలేటర్లకు 6 నెలల నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ ఆదేశాలను క్షేత్రస్థాయిలో ఉండే డిప్యూటీ ఈవో, ఎంఈవోలు, హెడ్‌మాస్టర్లకు తెలపడంతోపాటు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది.
ఇన్విజిలేషన్ చేసేందుకు 31 వేల మంది
మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 11,478 పాఠశాలలకు చెందిన దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 2,600 వరకు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ పరీక్షల విభా గం చర్యలు చేపట్టింది. ఒక్కో పరీక్ష కేంద్రంలో 10 మంది చొప్పున 26 వేల మంది ఇన్విజిలేటర్లు, 5 వేలకు పైగా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు అవసరం. మొత్తంగా పరీక్ష కేంద్రాల్లో 31 వేల మంది టీచర్లు పనిచేస్తారు. అయితే తాజాగా జారీ అయిన ఆదేశాలతో టీచర్లలో ఆందోళన నెలకొంది. ఇన్విజిలేషన్ విధులకు హాజరైతే రోజుకు కేవలం రూ.22 ఇచ్చే విద్యాశాఖ... చాలా వరకు తమ తప్పు ఉండని వ్యవహారంలో కూడా కఠిన శిక్ష విధించాలని నిర్ణయించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నా రు. కావాలని నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని సస్పెండ్ చేయడం, పరీక్ష విధుల నుంచి తొలగించడం, ఇంక్రిమెంట్లలో కోత వేయడం వంటి చర్యలు చేపడుతున్నారని, అది తప్పుకాదని... కానీ టీచర్లపై క్రిమినల్ కేసుల నమోదు, జైలుశిక్ష, జరిమానాల వంటివి ఏమిటని నిలదీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్విజిలేషన్ విధులే తమకు అవసరం లేదని పలువురు టీచర్లు పేర్కొంటున్నారు.
ఎన్నెన్నో సమస్యలు..
పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసే పాఠశాలల్లో విద్యార్థులను పూర్తిస్థాయిలో తనిఖీ చేసేందుకు సరైన సదుపాయాలు లేవు. ప్రత్యేక గదుల్లో బాలబాలికలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. కానీ చాలా ఏళ్లుగా అక్కడక్కడా బాలికలను ప్రత్యేక గదుల్లో మహిళా టీచర్లతో చెక్ చేయిస్తున్నా... బాలురను మాత్రం గేట్ వద్దే పైపైన తనిఖీ చేసి లోనికి పంపుతున్నారు. అక్కడ దొరకని విద్యార్థులు.. పరీక్ష హాల్లోకి స్క్వాడ్ వచ్చినపుడు చిట్టీలతో దొరికిపోయినా, పక్కవారి పేపర్‌లో చూసి రాస్తున్నా ఇన్విజిలేటర్లకు తంటాలు తప్పవు. ఇదే టీచర్లను ఆందోళనకు గురిచేస్తోంది. పైగా అవసరమైతే పరీక్షహాల్లో విద్యార్థులను ఇన్విజిలేటర్ తనిఖీ చేయాలనుకున్నా సమస్యలున్నాయి. మహిళా టీచర్ ఇన్విజిలేటర్‌గా ఉంటే బాలురను, పురుష టీచర్ ఉంటే బాలికలను పూర్తిస్థాయిలో చెక్ చేయడం సాధ్యం కాదు.
టీచర్లేమైనా హంతకులా?
‘‘ప్రభుత్వ నిర్ణయం టీచర్లలో మానసిక ఆందోళనకు దారితీస్తుంది. పరీక్ష సమయంలో విద్యార్థి అనుకోకుండా పక్కకు చూసినా సదరు ఇన్విజిలేటర్లు విద్యార్థులను భయాం దోళనలకు గురి చేసే ప్రమాదం ఉంటుంది. ఇది విద్యార్థికి కూడా నష్టదాయకం. ఈ విషయంలో శాఖాపరమైన చర్యలు చేపడితే తప్పులేదు. టీచర్లేమీ హంతకులు కాదు. జైలు శిక్షలు విధించేందుకు ఉద్దేశించిన యాక్ట్ 25లోని సెక్షన్ 10లో ఉన్న నిబంధనలు తొలగించాలి..’’
– ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్
అధ్యక్షుడు మల్లికార్జునశర్మ