సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్షల్లో భాగంగా సోమవారం సైన్స్ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఇదే కీలకం. గతంలో 11 పేపర్లతో టెన్త్ పరీక్ష జరిగేది. ఈసారి మొత్తం ఆరు పేపర్లకే పరిమితం చేశారు. ఇందులో భాగంగానే సైన్స్ రెండు (ఫిజికల్, బయలాజికల్ సైన్స్) పేపర్లను కలిపి ఒకేరోజు నిర్వహిస్తున్నారు. అయితే రెండు పేపర్లకు మధ్య 20 నిమిషాల గ్యాప్ ఇస్తున్నారు.
కాగా సోమవారం పరీక్షపై పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొత్తగా చేపడుతున్న ఈ పరీక్ష విషయంలో విద్యార్థులు ఏమాత్రం గందరగోళానికి గురవ్వకుండా చూడాలని పేర్కొంటూ క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలతో ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. రెండు పేపర్లకు కలిపి 80 మార్కులుంటాయి. స్కూల్ అంతర్గత పరీక్షల ఆధారంగా 20 మార్కులు తీసుకుంటారు. మొత్తంగా 100 మార్కుల్లో విద్యార్థులు 35 సాధించాల్సి ఉంటుంది.
పరీక్ష ఇలా...
♦ ముందుగా పార్ట్–1 (ఫిజికల్ సైన్స్) పరీక్ష ఉంటుంది. ఇది ఉదయం 9.30 గంటలకు మొదలై 11 గంటల వరకూ (1.30 గంటల వ్యవధి) ఉంటుంది. ఇందులోనే బిట్ పేపర్ (పార్ట్–బీ)ను 10.45 గంటలకు ఇస్తారు. 15 నిమిషాల్లో దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 20 నిమిషాలు బ్రేక్ ఇచ్చి బయలాజికల్ పేపర్ ఇస్తారు.
♦ బయలాజికల్ సైన్స్ పేపర్‌కు సంబంధించిన పరీక్ష 11.20 నుంచి 12.50 వరకూ (1.30 గంటలు) జరుగుతుంది. 12.35 గంటలకు బయలాజికల్ సైన్స్ పేపర్‌కు సంబంధించిన బిట్ పేపర్ (పార్ట్–బీ) ఇస్తారు. దీన్ని కూడా 15 నిమిషాల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది.
అధికారులకు ప్రత్యేక సూచనలు
రెండు పేపర్లను విడివిడిగా ప్యాక్ చేసి, మూల్యాంకన కేంద్రాలకు పంపాలని పాఠశాల విద్య డైరెక్టరేట్ చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించింది. రెండు పేపర్లకు మధ్య 20 నిమిషాల బ్రేక్ సమయంలో విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపేందుకు అనుమతించవద్దని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment