Telangana 10th Exams Cancelled 2021: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు - Sakshi
Sakshi News home page

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు

Published Thu, Apr 15 2021 6:31 PM | Last Updated on Fri, Apr 16 2021 12:40 PM

Telangana Government Cancels 10th Class Board Exams Due Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కీలకమైన పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలపై ఉత్కంఠకు ప్రభుత్వం ముగింపు పలికింది. రాష్ట్రంలో మే 17వ తేదీ నుంచి నిర్వహించాల్సిన పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మే 1వ తేదీ నుంచి నిర్వహించాల్సిన ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర పరీక్షలనూ ఇప్పుడు నిర్వహించే పరిస్థితి లేనందున రద్దు చేసి విద్యార్థులందరినీ ప్రమోట్‌ చేసింది. మే 2వ తేదీ నుంచి నిర్వహించాల్సిన ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ద్వితీయ సంవత్సర పరీక్షల నిర్వహణకు సంబంధించి జూన్‌ మొదటి వారంలో కరోనా కేసుల పరిస్థితిని సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామని, 15 రోజుల ముందుగా పరీక్షల తేదీలను తెలియజేస్తామని వెల్లడించారు.

పరిస్థితులు అనుకూలంగా ఉంటే జూన్‌ చివరి వారంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంటుంది. టెన్త్, ఇంటర్‌ పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై గురువారం ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డితో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పరిస్థితిని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆమోదంతో తుది నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలు ఉంటాయా? ఉండవా? అనేది తెలియక కొద్దిరోజులుగా తీవ్ర అయోమయానికి గురైన విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎట్టకేలకు స్పష్టత రావడం ఊరటనిచ్చింది.

కేంద్రం నిర్ణయం మేరకు రాష్ట్రంలోనూ..
సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ బుధవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అదే విధంగా పదో తరగతి పరీక్షలను, ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చిత్రా రామచంద్రన్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించారు. సెకండియర్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఏమైనా బ్యాక్‌లాగ్స్‌ (ఫస్టియర్‌లో ఫెయిల్‌ అయిన సబ్జెక్టులు) ఉంటే వారికి ఆయా సబ్జెక్టుల్లో కనీస పాస్‌ మార్కులు ఇస్తామని పేర్కొన్నారు. 

టెన్త్‌లో ఎఫ్‌ఏ–1 మార్కుల ఆధారంగా గ్రేడ్లు!
ప్రస్తుతం రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యేందుకు 5,21,000 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. అందులో రెగ్యులర్‌ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఉన్నారు. గతంలో ఫెయిల్‌ అయిన వారికి ఆయా సబ్జెక్టుల్లో కనీస మార్కులతో పాస్‌ చేయనున్నారు. ఇక రెగ్యులర్‌ విద్యార్థుల విషయంలో ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 (ఎఫ్‌ఏ) మార్కుల ఆధారంగా గ్రేడ్స్‌ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నాలుగు ఎఫ్‌ఏలకు బదులు రెండు ఎఫ్‌ఏలను నిర్వహించాలనుకున్నా ఒక ఎఫ్‌ఏ పరీక్షలే జరిగాయి. వాటిల్లో ఒక్కో సబ్జెక్టులో వచ్చిన మార్కులనే 100 శాతానికి లెక్కించి వచ్చే మార్కుల ఆధారంగా గ్రేడ్లను ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే కనీస మార్కులతో అందరినీ పాస్‌ చేసేలా చర్యలు చేపట్టే అవకాశం కూడా ఉంది.

అయితే సీబీఎస్‌ఈ, ఇతర రాష్ట్రాల పదో తరగతి పరీక్షల విభాగాలు తీసుకునే నిర్ణయాలను పరిశీలించిన తరువాతే టెన్త్‌ విద్యార్థులకు మార్కులను కేటాయించే అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. గతేడాది కూడా టెన్త్‌ పరీక్షలు రద్దయ్యాయి. అయితే ఆ విద్యా సంవత్సరంలో నాలుగు ఎఫ్‌ఏ పరీక్షలు జరిగాయి. వాటి ఆధారంగా విద్యార్థులకు మార్కులను కేటాయించడం సులభమైంది. అయితే ఈసారి ఎఫ్‌ఏ–1 మార్కులతోపాటు సీబీఎస్‌ఈ, ఇతర రాష్ట్రాల్లో విధానాలను అన్నింటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ నిర్ణయం మేరకు విద్యార్థులకు మార్కులను కేటాయించనున్నారు.

ఇంటర్‌ విద్యార్థులు 11,31,994 మంది
ఇంటర్మీడియట్‌ పరీక్షల కోసం ఎదురుచూసిన విద్యార్థులు 11,31,994 మంది ఉన్నారు. వారిలో ప్రథమ సంవత్సర రెగ్యులర్, వొకేషనల్‌ విద్యార్థులు 4,59,008 మంది ఉన్నారు. ఇప్పుడు వీరందరిని పరీక్షలు లేకుండానే ప్రమోట్‌ చేయనున్నారు. వారితోపాటు గతేడాది రెగ్యులర్, వొకేషనల్, ప్రైవేటు విద్యార్థులు 1,99,019 మంది ప్రథమ సంవత్సరంలో ఫెయిల్‌ అయ్యారు. వారిని కూడా ఇప్పుడు ప్రమోట్‌ చేయనున్నారు. కరోనా కారణంగా గతేడాది ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించలేదు.

దీంతో ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకొని వెళ్లిపోయే దాదాపు 1.47 లక్షల మంది విద్యార్థులను కనీస మార్కులతో పాస్‌ చేసి పంపించారు. గతేడాది మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల్లో ప్రథమ సంవత్సరంలో ఫెయిల్‌ అయిన 1,99,019 మందిని అప్పుడు పాస్‌ చేయలేదు. ఇపుడు ప్రథమ సంవత్సర పరీక్షలను రద్దు చేసినందున వారిని కూడా ప్రమోట్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక 4,73,967 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థుల పరీక్షలను వాయిదా వేసింది. జూన్‌ మొదటివారంలో పరిస్థితి సమీక్షించి వారికి పరీక్షలు నిర్వహించే తేదీలను ఖరారు చేయనుంది. 

స్వాగతించిన ఇంటర్‌ విద్యా జేఏసీ
ప్రథమ సంవత్సర పరీక్షలు రద్దు చేసి, ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేయడాన్ని ఇంటర్‌ విద్యా జేఏసీ ఛైర్మన్‌ డాక్టర్‌ పి.మధుసూదన్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌ డాక్టర్‌ కళింగ కృష్ణ కుమార్‌ స్వాగతించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో గతేడాది ప్రథమ సంవత్సరంలో ఫెయిల్‌ అయిన వారందరికి ఉపశమనమని, వారు ఇక ద్వితీయ సంవత్సర పరీక్షలు రాస్తే సరిపోతోందని వివరించారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.
  

టెన్త్‌లో ‘ఎఫ్‌ఏ–1’ ఆధారంగా...
పదో తరగతి రెగ్యులర్‌ విద్యార్థులకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 (ఎఫ్‌ఏ) మార్కుల ఆధారంగా గ్రేడ్స్‌ ఇచ్చే చాన్స్‌ ఉంది. ప్రస్తుతం ఒక ఎఫ్‌ఏ పరీక్షలే జరిగాయి. వాటిల్లో ఒక్కో సబ్జెక్టులో వచ్చిన మార్కులనే 100 శాతానికి లెక్కించి గ్రేడ్లను ఇచ్చే అవకాశం ఉంది. 

ఇంటర్‌ వెయిటేజీ ఉండదు..
ఎంసెట్‌ ర్యాంకుల ఖరారులో ఇంటర్‌ మార్కులకు ఇచ్చే 25% వెయిటేజీని ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఈసారి అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్‌ కీలకం కానుంది. ఆ మార్కుల ఆధారంగా ఎంసెట్‌ కమిటీ ర్యాంకులను కేటాయించనుంది. 

ప్రమోట్‌ చేస్తున్నాం... కానీ  
ప్రథమ సంవత్సర విద్యార్థులను పరీక్షలు లేకుం డానే ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్‌ చేయనున్నారు. ఫస్టియర్‌ విద్యార్థులు మరో సంవత్సరం పాటు ఉంటారు కనుక భవిష్యత్తులో సాధారణ పరిస్థితులు వస్తే పరీక్షలు నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.

చదవండి: CBSE పదో తరగతి పరీక్షలు రద్దు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement