వణికిస్తున్న 'టెన్త్‌' పరీక్ష | 11 thousand students in D grade | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న 'టెన్త్‌' పరీక్ష

Published Thu, Jan 18 2018 3:41 AM | Last Updated on Thu, Jan 18 2018 3:41 AM

11 thousand students in D grade - Sakshi

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ఉపాధ్యాయులకు, విద్యా శాఖ అధికారులకు 10వ తరగతి పరీక్షలు పెను సవాలుగా పరిణమించాయి. ఒక విధంగా 10వ తరగతి విద్యార్థుల కంటే వీరికే పరీక్ష ఎదురు కాబోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఏడాది 10 ఫలితాల్లో జిల్లా కింద నుంచి రెండవ స్థానంలో నిలవడంతో అనేక విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ ఏడాదైనా గత ఏడాది ఫలితాలను పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రయత్నించుదామనుకుంటే ప్రభుత్వం వారికి బోధనేతర పనులు అప్పగించడంతో బోధన సరిగా సాగలేదు. దీంతో డీ గ్రేడ్‌ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. సుమారు 50 వేల మంది 10వ తరగతి పరీక్షలు రాస్తుం డగా వీరిలో సుమారు 11 వేల మంది విద్యార్థులు డీ గ్రేడ్‌లో ఉండడం వారిని ఒత్తిడికి గురిచేస్తోంది.

ఇప్పటికీ పూర్తికాని సిలబస్‌సాధారణంగా డిసెంబర్‌ మాసాం తానికి 10వ తరగతి విద్యార్థులకు సిలబస్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఏడాది ఆరంభంలో నిర్వహించిన ఉపాధ్యాయుల బదిలీలు, అనంతరం బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవర్లు లేక కోరుకున్న చోటుకి పంపకపోవడం, అనంతరం మరుగుదొడ్ల సర్వే, ఇటీవల జన్మభూమి కార్యక్రమాలు ఇలా ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించుకోవడంతో డిసెంబర్‌ చివరి వరకూ కొన్ని పాఠశాలల్లో సిలబస్‌ పూర్తికానేలేదు. జనవరిలో పునశ్ఛరణ నిర్వహించాల్సి ఉండగా అసలు సిలబసే పూర్తికాని నేపథ్యంలో పునశ్ఛరణ ఊసెత్తే పరిస్థితి కనిపించడం లేదు. 

11వేల మంది డీ గ్రేడ్‌లో
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వివిధ యాజమాన్యాల్లోని పాఠశాలల నుంచి 50,425 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరిలో ప్రభుత్వ రంగ యాజమాన్యాలకు చెందిన పాఠశాలల నుంచి 33,476 మంది, ప్రైవేట్‌ కార్పొరేట్‌ యాజమాన్యాలకు చెందిన పాఠశాలల నుంచి 16,949 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా సంవత్సరంలో వివిధ స్థాయిల్లో నిర్వహించిన పరీక్షల ఫలితాల ఆధారంగా 11,281 మంది విద్యార్థులు పలు సబ్జెక్టుల్లో డీ గ్రేడ్‌లో ఉండడాన్ని గుర్తించారు. డీ గ్రేడ్‌ అంటే దాదాపు ఫెయిల్‌కు దగ్గరలో ఉన్నట్లే. వీరు సాధించే ఫలితం ఉత్తీర్ణతా శాతంపై ప్రభావం చూపితే జిల్లా ఈ ఏడాది కూడా ఆఖరి మూడు స్థానాల్లోనే నిలిచే ప్రమాదం ఉంది.

ఐదేళ్లలో ఫలితాలు ఇవీ
పదవ తరగతికి సంబంధించి ఐదేళ్ల ఫలితాలు పరిశీలిస్తే నిలకడలేమి కనిపిస్తోంది. ఒక ఏడాది మంచి ఫలితాలు వస్తే మరుసటి ఏడాది పూర్తిగా పాతాళానికి పడిపోతున్నాయి. 2012 –13లో 44,252 మంది పరీక్షలు రాయగా 92.45 శాతంతో 40,911 మంది ఉత్తీర్ణత సాధించడంతో రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది. ఆ మరుసటి ఏడాదే అంటే 2013 –14లో 44,634 మంది పరీక్షలు రాయగా 85.37 శాతంతో కేవలం 38,105 మందే ఉత్తీర్ణులవడంతో జిల్లా 19వ స్థానానికి పడిపోయింది.

 2014 – 15లో 47,529 మంది పరీక్షలు రాయగా 95.15 శాతంతో 45,222 మంది ఉత్తీర్ణులు కావడంతో జిల్లా 3వ స్థానానికి ఎగబాకింది. 2015 – 16లో 48,374 మంది పరీక్షలు రాయగా 97.65 శాతంతో 47,237 మంది ఉత్తీర్ణులైæ జిల్లాను రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిపారు. ఇలా రెండు సంవత్సరాలు తన స్థానాలను మెరుగుపరుచుకున్న జిల్లా 2016 – 17లో 48,222 మంది పరీక్షలు రాస్తే కేవలం 84.3 శాతంతో 40,649 మంది మాత్రమే ఉత్తీర్ణులు కావడంతో జిల్లా ఏకంగా 10 స్థానాలు దిగజారిపోయి 12వ స్థానంలో నిలవడం నిలకడలేమిని సూచిస్తోంది.

ఫలితాలపై బోధనేతర పనుల ప్రభావం
ఉపాధ్యాయులపై ప్రభుత్వం రుద్దుతున్న బోధనేతర పనులు వారికి భారంగా పరిణమిస్తున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం బోధనేతర పనులు వద్దని ఎంతగా మొత్తుకుంటున్నా ప్రభుత్వం వినడం లేదు. దీని కారణంగా విద్యార్థులు సిలబస్‌ పూర్తికాక చదువులో వెనుకబడిపోతున్నారు. ఆ పరిస్థితి ఫలితాలపై ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. అయినప్పటికీ ఉపాధ్యాయులు తమ శక్తి వంచన లేకుండా ఉత్తమ ఫలితాల సాధన కోసం కృషి చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది పరీక్షల్లో మరింత మెరుగైన ఫలితాలు ఆశించవచ్చు.
– ఐ.రాజగోపాల్, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

పరీక్షలయ్యే వరకూ ప్రత్యేక దృష్టి 
డీ గ్రేడ్‌లో ఉన్న విద్యార్థులకు నిశితంగా శిక్షణ ఇవ్వడానికి ఇప్పటికే ఏర్పాటు చేశాం. పరీక్షలు అయ్యే వరకూ వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించమని ఆదేశాలిచ్చాం. వారికి మరింత సులభతరంగా అర్థమయ్యేటట్లు బోధన చేసేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. దాదాపు అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మెటీరియల్‌ ఉచితంగా అందచేశాం. మున్సిపల్‌ పాఠశాలల్లో విద్యార్థులకు కూడా అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అవసరమైన వారు మా కార్యాలయంలో సంప్రదించాలి. ఈ ఏడాది జిల్లా స్థానాన్ని మరింత మెరుగు పరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.   – సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement