D Grade
-
వణికిస్తున్న 'టెన్త్' పరీక్ష
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ఉపాధ్యాయులకు, విద్యా శాఖ అధికారులకు 10వ తరగతి పరీక్షలు పెను సవాలుగా పరిణమించాయి. ఒక విధంగా 10వ తరగతి విద్యార్థుల కంటే వీరికే పరీక్ష ఎదురు కాబోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఏడాది 10 ఫలితాల్లో జిల్లా కింద నుంచి రెండవ స్థానంలో నిలవడంతో అనేక విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ ఏడాదైనా గత ఏడాది ఫలితాలను పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రయత్నించుదామనుకుంటే ప్రభుత్వం వారికి బోధనేతర పనులు అప్పగించడంతో బోధన సరిగా సాగలేదు. దీంతో డీ గ్రేడ్ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. సుమారు 50 వేల మంది 10వ తరగతి పరీక్షలు రాస్తుం డగా వీరిలో సుమారు 11 వేల మంది విద్యార్థులు డీ గ్రేడ్‌లో ఉండడం వారిని ఒత్తిడికి గురిచేస్తోంది. ఇప్పటికీ పూర్తికాని సిలబస్సాధారణంగా డిసెంబర్ మాసాం తానికి 10వ తరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఏడాది ఆరంభంలో నిర్వహించిన ఉపాధ్యాయుల బదిలీలు, అనంతరం బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవర్లు లేక కోరుకున్న చోటుకి పంపకపోవడం, అనంతరం మరుగుదొడ్ల సర్వే, ఇటీవల జన్మభూమి కార్యక్రమాలు ఇలా ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించుకోవడంతో డిసెంబర్ చివరి వరకూ కొన్ని పాఠశాలల్లో సిలబస్ పూర్తికానేలేదు. జనవరిలో పునశ్ఛరణ నిర్వహించాల్సి ఉండగా అసలు సిలబసే పూర్తికాని నేపథ్యంలో పునశ్ఛరణ ఊసెత్తే పరిస్థితి కనిపించడం లేదు. 11వేల మంది డీ గ్రేడ్‌లో జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వివిధ యాజమాన్యాల్లోని పాఠశాలల నుంచి 50,425 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరిలో ప్రభుత్వ రంగ యాజమాన్యాలకు చెందిన పాఠశాలల నుంచి 33,476 మంది, ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలకు చెందిన పాఠశాలల నుంచి 16,949 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా సంవత్సరంలో వివిధ స్థాయిల్లో నిర్వహించిన పరీక్షల ఫలితాల ఆధారంగా 11,281 మంది విద్యార్థులు పలు సబ్జెక్టుల్లో డీ గ్రేడ్‌లో ఉండడాన్ని గుర్తించారు. డీ గ్రేడ్ అంటే దాదాపు ఫెయిల్‌కు దగ్గరలో ఉన్నట్లే. వీరు సాధించే ఫలితం ఉత్తీర్ణతా శాతంపై ప్రభావం చూపితే జిల్లా ఈ ఏడాది కూడా ఆఖరి మూడు స్థానాల్లోనే నిలిచే ప్రమాదం ఉంది. ఐదేళ్లలో ఫలితాలు ఇవీ పదవ తరగతికి సంబంధించి ఐదేళ్ల ఫలితాలు పరిశీలిస్తే నిలకడలేమి కనిపిస్తోంది. ఒక ఏడాది మంచి ఫలితాలు వస్తే మరుసటి ఏడాది పూర్తిగా పాతాళానికి పడిపోతున్నాయి. 2012 –13లో 44,252 మంది పరీక్షలు రాయగా 92.45 శాతంతో 40,911 మంది ఉత్తీర్ణత సాధించడంతో రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది. ఆ మరుసటి ఏడాదే అంటే 2013 –14లో 44,634 మంది పరీక్షలు రాయగా 85.37 శాతంతో కేవలం 38,105 మందే ఉత్తీర్ణులవడంతో జిల్లా 19వ స్థానానికి పడిపోయింది. 2014 – 15లో 47,529 మంది పరీక్షలు రాయగా 95.15 శాతంతో 45,222 మంది ఉత్తీర్ణులు కావడంతో జిల్లా 3వ స్థానానికి ఎగబాకింది. 2015 – 16లో 48,374 మంది పరీక్షలు రాయగా 97.65 శాతంతో 47,237 మంది ఉత్తీర్ణులైæ జిల్లాను రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిపారు. ఇలా రెండు సంవత్సరాలు తన స్థానాలను మెరుగుపరుచుకున్న జిల్లా 2016 – 17లో 48,222 మంది పరీక్షలు రాస్తే కేవలం 84.3 శాతంతో 40,649 మంది మాత్రమే ఉత్తీర్ణులు కావడంతో జిల్లా ఏకంగా 10 స్థానాలు దిగజారిపోయి 12వ స్థానంలో నిలవడం నిలకడలేమిని సూచిస్తోంది. ఫలితాలపై బోధనేతర పనుల ప్రభావం ఉపాధ్యాయులపై ప్రభుత్వం రుద్దుతున్న బోధనేతర పనులు వారికి భారంగా పరిణమిస్తున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం బోధనేతర పనులు వద్దని ఎంతగా మొత్తుకుంటున్నా ప్రభుత్వం వినడం లేదు. దీని కారణంగా విద్యార్థులు సిలబస్ పూర్తికాక చదువులో వెనుకబడిపోతున్నారు. ఆ పరిస్థితి ఫలితాలపై ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. అయినప్పటికీ ఉపాధ్యాయులు తమ శక్తి వంచన లేకుండా ఉత్తమ ఫలితాల సాధన కోసం కృషి చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది పరీక్షల్లో మరింత మెరుగైన ఫలితాలు ఆశించవచ్చు. – ఐ.రాజగోపాల్, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరీక్షలయ్యే వరకూ ప్రత్యేక దృష్టి డీ గ్రేడ్‌లో ఉన్న విద్యార్థులకు నిశితంగా శిక్షణ ఇవ్వడానికి ఇప్పటికే ఏర్పాటు చేశాం. పరీక్షలు అయ్యే వరకూ వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించమని ఆదేశాలిచ్చాం. వారికి మరింత సులభతరంగా అర్థమయ్యేటట్లు బోధన చేసేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. దాదాపు అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మెటీరియల్ ఉచితంగా అందచేశాం. మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థులకు కూడా అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అవసరమైన వారు మా కార్యాలయంలో సంప్రదించాలి. ఈ ఏడాది జిల్లా స్థానాన్ని మరింత మెరుగు పరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. – సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారి -
తప్పెవరిది
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఆ విద్యార్థిని నాడు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణురాలయిందన్నారు. మార్కుల జాబి తా ఎక్కడో మిస్సయిందని, త్వరలోనే రప్పిస్తామన్నారు. ఈలోగా మార్కుల మెమోతో డిగ్రీలో చేరాలని చెప్పారు. చేరి రెండేళ్లయిన తర్వాత అసలు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత కాలేదని, ప్రస్తుతం చేస్తున్న డిగ్రీ చెల్లదని చెబుతున్నారు. విజయనగరం మహరాజ మహిళా కళాశాలలో ఈ భాగోతం చోటు చేసుకుంది. ఇప్పుడా విద్యార్థిని మానసిక క్షోభను అనుభవిస్తోంది. నాటి కథఆ విద్యార్థిని పేరు గంటా దుర్గాదేవి. మహరాజ మహిళా కళాశాలలో 2010-12లో ఇంటర్మీడియెట్(హెచ్ఈసీ) చదివింది. 2012లో వెలువరించిన ఫలితాల్లో ఉత్తీర్ణులైన జాబితాలో ఆమె హాల్ టిక్కెట్ నంబర్ ఉంది. డి గ్రేడ్‌లో ఉత్తీర్ణురాలైనట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మార్కుల జాబితా కోసం కళాశాలకు వెళ్లింది. మార్కుల జాబితాల్లో దుర్గాదేవికి చెందిన మార్కుల లిస్టు లేకపోవడంతో ఎక్కడో మిస్సయిందని, తర్వాత రప్పిస్తామని సిబ్బంది చెప్పారు. ఈలోగా నెట్లో లభించే మార్కుల మెమో ఆధారంగా డిగ్రీలో చేరవచ్చని సలహా ఇచ్చారు. దీంతో అదే కళాశాలలో బీఏ(హెచ్ఈపీ)లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో మార్కుల మెమోను సమర్పించా రు. ఏఒక్కరూ అభ్యంతరం తెలపకుండా డిగ్రీలో చేర్చుకున్నారు. మధ్యలో వ్యథ డిగ్రీలో చేరిన దగ్గరి నుంచి ఇంటర్మీడియట్ మార్కుల జాబితా కోసం కళాశాల సిబ్బందిని దుర్గాదేవి అడుగుతూ ఉన్నా రు. ఇదిగో అదిగో అని కొన్నాళ్లు చెప్పుకొచ్చారు. మధ్యలో సిబ్బంది ఉచిత సలహా ఇచ్చారు. మార్కుల జాబితా తన వద్దే మిస్సింగ్ అయ్యిందంటూ పేర్కొని, కొత్త మార్కుల జాబితా ఇవ్వాలని కోరుతూ దరఖా స్తు చేసుకోవాలని దుర్గాదేవిపై ఒత్తిడి చేశారు. అసలు చేతి కందని జాబితా మిస్ అయిందని ఎలా చెప్పగలనని, కొత్తగా ఇప్పించండని ఎలా కోరగలనని ఆ విద్యార్థిని అభ్యం తరం వ్యక్తం చేశారు. దీంతో ఇంటర్మీడియట్ బోర్డును స్వయంగా సిబ్బందే తరుచూ వాకబు చేస్తూ వచ్చారు. ఆలస్యంగా బయటపడిన అసలు విషయం ఎన్ని పర్యాయాలు వాకబు చేసినా ఇంటర్ బోర్డు స్పందించకపోవడంతో లిఖిత పూర్వకం గా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. దుర్గాదేవి అసలు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత కాలేదని, అప్పట్లో ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ పరీక్ష రాయలేదని అక్కడి అధికారులు నింపాదిగా సెలవిచ్చారు. దీంతో తేరుకున్న కళాశాల సిబ్బంది డిగ్రీ ప్రవేశ సమయంలో విద్యార్థిని సమర్పించిన మార్కుల మెమోను పరిశీలించారు. ఇందులో ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ నాట్ క్వాలిఫైడ్ అని ఉండటాన్ని గుర్తించి కంగుతున్నారు. అప్పట్లో పరిశీలించకుండా ప్రవేశమిచ్చేశామని నాలిక కరుచుకున్నారు. దీన్ని సరిచేయడమెలా అని మల్లగుల్లాలు పడ్డారు. ఏం చేసినా ఉత్తీర్ణులైనట్టు చేయలేమని, విద్యార్థినికి అసలు విషయం చెప్పడమే సరైనదని నిర్ణయించుకున్నారు. డిగ్రీ చదువు చెల్లదని తాజాగా స్పష్టీకరణ వాస్తవాన్ని గుర్తించిన కళాశాల సిబ్బంది విద్యార్థికి అసలు విషయాన్ని ఇటీవల చెప్పారు. ఇంటర్మీడియట్లో ఉండిపోయిన ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ పరీక్ష రాసి పాసైతేనే సర్టిఫికెట్ వస్తుందని పేర్కొన్నారు. ఇంతవరకు చదివిన డిగ్రీ చెల్లదని, ఇంటర్ పాసైన సర్టిఫికెట్ వచ్చిన తర్వాతే డిగ్రీలో చేరాలని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో విద్యార్థిని దుర్గాదేవి, ఆమె తల్లిదండ్రులు నిర్ఘాంత పోయారు. తనకెందుకు అన్యాయం చేశారని ఆవేదన చెందుతున్నారు. కళాశాల వద్దకు వెళ్లి రెండేళ్లు వృథా అవుతుందని, తనకు న్యాయం చేయాలని ప్రాధేయ పడుతున్నారు. కానీ కళాశాల అధికారులు తామేమి చేయలేమని చేతులేత్తేస్తున్నారు. తల్లిదండ్రుల ఆవేదన దుర్గాదేవి తండ్రి నర్సింగరావు ఆటో డ్రైవర్‌గా, తల్లి పద్మ కూలీగా పనిచేస్తున్నారు. విజయనగరం నటరాజ్ కాలనీలో నివసిస్తున్న నిరుపేద కుటుంబమది. కష్టపడి చదివిస్తున్న తన కూతురుకు అన్యాయం జరిగిందని, తాము తట్టుకోలేకపోతున్నామని, ఎలాగోలా న్యాయం చేయాలని తెలిసిన వారందరి వద్ద ప్రాధేయ పడుతున్నారు. గతంలో జరిగింది... నా హయాంలో తప్పు జరగలేదు. డిగ్రీ ప్రవేశ సమయంలో గుర్తించకపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది. ఇప్పటికే చాలాసార్లు మాట్లాడాం. ఇంటర్మీడియెట్‌లో ఉండిపోయిన ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ పరీక్ష రాసి ఉత్తీర్ణమవ్వడం తప్పా వేరే దారిలేదు. ఆ తర్వాతే డిగ్రీ చదవాల్సి ఉంది. ఆమెకు న్యాయం చేసే విషయంపై ఆలోచిస్తున్నాం. - ఎం.రాజేశ్వరి, ఎంఆర్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్