ఓ వ్యక్తి అత్యుత్సాహంతో పరీక్ష జరుగుతుండగానే పదోతరగతి తెలుగు క్వశ్చన్ పేపర్- 2 ప్రశ్నపత్రం లీకైంది.
పోలీసుల అదుపులో నిందితుడు
ముగ్గురిపై వేటు
దేవరకొండ/కొండమల్లేపల్లి: ఓ వ్యక్తి అత్యుత్సాహంతో పరీక్ష జరుగుతుండగానే పదోతరగతి తెలుగు క్వశ్చన్ పేపర్- 2 ప్రశ్నపత్రం లీకైంది. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాల పరీక్ష కేంద్రంలో మంగళవారం ఈ ఘటన వెలుగు చూసింది. పట్టణంలోని సాయిసిద్ధార్థ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో తెలుగు పరీక్ష -2 కొనసాగుతోంది. గతంలో అదే పాఠశాలలో పనిచేసిన నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి పరీక్ష జరుగుతుండగా పరీక్ష కేంద్రంలోకి వచ్చారు.
గతంలో ఆ పాఠశాలలో పనిచేసిన వ్యక్తి కావడంతో ఎవరూ కూడా అభ్యంతరం చెప్పలేదు. పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థి వద్ద నుంచి పరీక్ష పత్రాన్ని తీసుకుని శ్రీనివాస్ రెడ్డి తన సెల్‌ఫోన్‌లో బంధించి వాట్సప్‌లో ఉన్న గ్రూప్‌కు ఫార్వర్డ్ చేశాడు. కొద్దిసేపటికే ఈ వాట్సప్ సమాచారం విద్యాశాఖ అధికారులకు తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. విచారణ జరిపి శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు బాధ్యులను చేస్తూ సెంటర్ ఇన్‌చార్జి వెంకటేశ్వర్లు, చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాసాచారి, ఇన్విజిలేటర్ నిర్మలను సస్పెండ్ చేస్తున్నట్లు ఏజేసీ వెంకటరావు, డీఈఓలు తెలిపారు.