విద్యారణ్యపురి: వచ్చే ఏడాది మార్చి 16 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక కసరత్తు ప్రారంభించారు. టెన్త్ క్లాస్ విద్యార్థులందరితోపాటు స్లోలెర్నర్స్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులకు సిలబస్ పూర్తి అయింది. అక్కడక్కడ కొన్నింటిలో సిలబస్ పూర్తికాకుండా ఉంటే పూర్తిచేయాలని డీఈఓ నారాయణరెడ్డి ఆదేశించారు. సిలబస్ పూర్తి అయిన ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు రివిజన్ కూడా చేయాల్సింటుంది. జిల్లాలో 156 ప్రభుత్వ, ఎయిడెడ్, జిల్లాపరిషత్, కేజీవీలు, మోడల్ స్కూల్స్‌లో కలిపి మొత్తంగా 6వేలమంది వరకు పదోతరగతి విద్యార్థులున్నారు. అందులో స్లోలెర్నర్స్ ప్రతి హైస్కూల్‌లోను 10 నుంచి 20 శాతం వరకు ఉన్నట్లు గుర్తించారు. ఎస్‌ఏ–1పరీక్షల ఫలితాల ఆధారంగా గుర్తించి ఆయా విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించారు. గత విద్యాసంవత్సరం ఉత్తీర్ణత 92 శాతం కాగా ఈ విద్యాసంత్సరంలో 100 శాతం ఫలితాల కోసం విద్యాశాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు.
స్లోలెర్నర్స్‌కు కీలకభావనల బుక్‌లెట్లు..
జిల్లాలోని పలు పాఠశాలల్లో చదవులో వెనుకబడిన టెన్త్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిçపుణులతో ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన కీలక భావనలతో కూడిన బుక్‌లెట్లు డీఈఓ తయారు చేయించారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, గణితం, సాంఘిక శాస్త్రాల బుక్‌లెట్స్ ఇటీవలనే అన్ని పాఠశాలలకు పంపించారు. సంబంధిత ఉపాధ్యాయులు విద్యార్థులు బోధిస్తూ సాధన చేయించాల్సి ఉంటుంది. నాలుగు దశలో స్లిప్ టెస్టులు నిర్వహించాలి. ఆ స్లిప్ టెస్టుల్లో విద్యార్థులకు వచ్చిన మార్కులను డీఈఓకు ఆన్‌లైన్‌లో అప్‌లోడు చేయాల్సి ఉంటుంది. పరీక్షల నాటికి స్లోలెర్నర్స్‌ను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.
మొదటి దశ ఈనెల 18 నుంచి 29 వరకు, రెండో దశ డిసెంబర్ 31 నుంచి జనవరి 17 వరకు, మూడోదశ జనవరి 18 నుంచి 30 వరకు, నాల్గో దశ ఫిబ్రవరి 1 నుంచి 11 వరకు ఆయా విద్యార్థులకు స్లిప్ టెస్టులు నిర్వహిస్తారు. ఆయా ప్రధానోపాధ్యాయులతో డీఈఓ సమీక్ష నిర్వహించి విద్యార్థుల్లో మార్పుపై ఆరా తీస్తారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో సమీక్షలు చేపట్టారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక సాధన చేయిస్తున్నారా.. లేదా అనేది పరిశీలించేందుకు ముగ్గురు సెక్టోరియల్ ఆఫీసర్లు వేణు ఆనంద్, బి.మనోజ్‌కుమార్, డి.రమాదేవికి బాధ్యతలను అప్పగించారు. అంతేకాకుండా రెండు మూడు మండలాలకు కలిపి అబ్జర్వర్లను నియమించారు. వారు విద్యార్థుల ప్రాక్టీస్‌ను పరిశీలించనున్నారు. స్లోలెర్నర్స్ విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఎప్పటికప్పుడు వారి ప్రోగ్రెస్‌ను తెలియజేస్తారు. వేకప్ కాల్ కూడా చేసి వారిని చదువుకునేలా ప్రోత్సహించాల్సి ఉంటుంది.
మిగతా విద్యార్థులకు 50 రోజుల ప్రణాళిక
జిల్లాలోని అన్ని హైస్కూళ్లు, కేజీబీవీలు, మోడల్‌స్కూల్స్‌లో పది విద్యార్థులందరికీ 50 రోజుల ప్రత్యేక ప్రణాళిక ద్వారా ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. పాఠశాల సమయానికి ఒకగంట ముందుగా, పాఠశాల సమయం ముగిశాక మరోగంట ప్రత్యేక తరగతులు ఉంటాయి. కొన్నిచోట్ల హైస్కూల్స్‌లో హెచ్‌ఎంలు ప్రత్యేక దృష్టితో వారికి స్నాక్స్ అందజేస్త్ననారు. గత ఏడాది వార్షిక పరీక్షల సందర్భంగా మిగిలిన రెండో సెట్ ప్రశ్నాపత్రాలను పోలీస్టేషన్ నుంచి హెచ్‌ఎంలు తీసుకెళ్లి ఆయా విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించాలని డీఈఓ ఆదేశించినట్లు సమాచారం. ఫిబ్రవరి 16 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు పదోతరగతి విద్యార్థులకు వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రి ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 16 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. ఆ తర్వాత మార్చి 16 నుంచి వార్షిక పరీక్షలు కొనసాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment