ఐ లైక్ పాజిటివ్ మైండ్స్ : ఝాన్సీ | I like always think Positive, Anchor Jhansi talks to Sakshi Cityplus | Sakshi
Sakshi News home page

ఐ లైక్ పాజిటివ్ మైండ్స్ : ఝాన్సీ

Published Sat, Jul 19 2014 8:57 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM

ఐ లైక్ పాజిటివ్ మైండ్స్ : ఝాన్సీ

ఐ లైక్ పాజిటివ్ మైండ్స్ : ఝాన్సీ

బుల్లితెర బాట చూపినా... వెండి తెర వెలుగునిచ్చినా.. జీవితంలో ఎత్తుపల్లాలు ఎదురైనా.. తనను మున్ముందుకు నడిపిస్తోంది.. ఆశావాహ దృక్పథమే అని అంటున్నారు యాంకర్ ఝాన్సీ. ఆమెను కదిలిస్తే జీవితంలోని భిన్నమైన కోణాలు కన్పిస్తాయి. చిన్నప్పటి నుంచి గూడుకట్టుకున్న ఎన్నెన్నో అనుభూతులు పలుకరిస్తాయి.  సిటీప్లస్‌తో ఝాన్సీ పంచుకున్న అనుభవాలు ఆమె మాటల్లోనే..
 
 ‘ఆత్మ విశ్వాసం మనిషిని నడిపిస్తుంది. పరిస్థితులు పాఠాలు నేర్పిస్తాయి. ప్రతి మలుపులో రెండు దారులుంటాయి. ఒకటి నెగెటివ్.. మరొకటి పాజిటివ్. బట్ ఐ ఆల్వేస్ లైక్ పాజిటివ్ వే. అలాంటి మనస్తత్వమే.. నన్ను నడిపిస్తోంది.
 
 ఏఎన్నార్.. తనికెళ్ల..
 అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడూ పాజిటివ్ అనుభవాలే చెబుతారు. ఆయన జీవితంలో నెగెటివ్ లేదా..? తనికెళ్ళ భరణిగారు ఎప్పుడూ వైవిధ్యంగా ఆలోచిస్తారు. అవ న్నీ జనానికి నచ్చుతాయో లేదోనని ఆలోచించరా..? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం వెదికాను. వారి ఆలోచనా విధానమే కరెక్టని తెలుసుకున్నాను. గ్లామర్ ఫీల్డ్‌లో ఎంటరయ్యాక ప్రతి ఆదివారం తనికెళ్ల భరణి గారింటికి వెళ్లడం ఆనవాయితీగా మారింది. అక్కడికి వెళ్తే ఏదో ఒక ైవె విధ్యమైన ఆలోచన మొదలవుతుంది.  స్వామి వివేకానందుడి బోధనలు  కూడా నన్నెంతో ప్రభావితం చేశాయి. ఆశావాదపథం వైపు నడిపించాయి.
 
 అల్లరిపిల్లని..
 చిన్నతనం నుంచి అల్లరిగానే ఉండేదాన్ని. స్కూల్ డేస్ నుంచి కాలేజ్ వరకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. అప్పుడు మూడో తరగతి అనుకుంటా. చేతిలో కేరియర్.. భుజానికి స్కూల్ బ్యాగ్.. బ్యాగ్ జేబులో రూట్ పాస్. హయత్‌నగర్‌లో బస్సెక్కి మలక్‌పేటలోని వికాస భారతి స్కూల్‌కు వచ్చేదాన్ని. ‘ మా చిట్టితల్లి ఎంత కష్టపడుతోందో’ అని అమ్మ మురిసిపోవడం నాకు ఇన్‌స్పిరేషన్.  స్కూల్‌కు డుమ్మా కొడదామనిపించినా అమ్మ ఆనందం నన్ను వెనక్కి లాగేది.
 
 ఆ జారుడు బండల్లో...
 గచ్చిబౌలి వెళ్లినప్పుడల్లా ఆ బండరాళ్లు పలకరిస్తుంటాయి. పెద్ద పెద్ద రాళ్లు.. మధ్యలో చెరువు.. ఫ్రెండ్స్‌తో కలసి ఆడుకున్న క్షణాలు.. అన్నీ మనోయవనికపై అలా కదలిపోతుంటాయి. అమ్మది ఆకాశవాణిలో ఉద్యోగం.. నాన్న కాంట్రాక్టరు. నేను కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నా.  కొన్నేళ్లు గచ్చిబౌలీలోని గవర్నమెంట్ క్వార్టర్స్‌లో ఉన్నాం. స్కూల్ మధ్యాహ్నం మూడున్నరకే అయిపోయేది. అమ్మానాన్నలు వచ్చే సరికి సాయంత్రం ఆరు దాటేది.

 ఏడ్చేశాను..
 గచ్చిబౌలి క్వార్టర్స్‌కు వెళ్లాలంటే ఒకే ఒక బస్సు ఉండేది. ఆదివారాలు అమీర్‌పేటలోని మా బంధువుల ఇంట్లో ఉండేవాళ్లం. అక్కడి నుంచే షాపింగ్‌కో.. సినిమాకో.. ఇంకెక్కడికైనా వెళ్లే వాళ్లం. శనివారం ఆకాశవాణి ప్రోగ్రాం అయిపోగానే  అమ్మ నన్ను ఒక్కదాన్నే బస్సెక్కి అమీర్‌పేట వెళ్లమంది. నాకేం భయం! 9 నంబర్ కదా.. నాకు తెలుసు అన్నట్టు బస్సెక్కాను. పావలా ఇచ్చి అమీర్‌పేటకు టికెట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇమేజ్ హాస్పిటల్ ఉన్న చోట అప్పట్లో చెరువు ఉండేది. అదే అమీర్‌పేటని ధీమాగా ఉన్నాను.  కిటీకీ లోంచే చూస్తూ కూచున్నా.. ఎంతకూ చెరువు రాదే..! చెరువు దాటేశామా ? అసలీ బస్సు అమీర్‌పేట వెళ్తుందా ? కండక్టర్‌ను అడిగితే.. ఛా... నాకు తెలియదా ఏంటీ? అయినా డౌట్.. కండక్టర్ ఇది వయా ఎటు వైపు అని.. ఈగోతోనే అడిగాను. అమీర్‌పేట నుంచే అన్నాడు.
 
  ఇంతలో లాస్ట్ స్టాప్ సనత్‌నగర్ వచ్చేసింది. అదేంటని కండక్టర్‌ను అడిగా.. అమీర్‌పేట్ ఎప్పుడో వెళ్లిపోయిందని ఆయన అనగానే.. నాకూ ఏడుపొచ్చేసింది. వెనక్కు వెళ్లడానికి డబ్బుల్లేవు. ఇంతలో ఓ పెద్దావిడ డబ్బులిచ్చింది. అమీర్‌పేటలో దించమని కండక్టర్‌కు చెప్పింది. ఇంకేం.. క్వార్టర్స్‌లోని ఆడపిల్లలమంతా కలసి.. సైకిళ్లు వేృుకుని.. దర్గా దాటి ఆ చెరువు దగ్గరకు వచ్చేసేవాళ్లం. అక్కడ జారుడు బండగా ఉండే ఓ పెద్ద రాయిని  మౌంట్ ఎవరెస్ట్ అని పిలిచేవాళ్ళం. సాయంత్రానికి డ్రెస్ మొత్తం మాసిపోయేది. అమ్మవాళ్లు వచ్చేసరికి ఇంటికెళ్లి బుద్ధిగా డ్రెస్ మార్చుకునేదాన్ని.

 బాలానందంతో నిఘంటువు
 నాంపల్లి అసెంబ్లీ ఏరియాతో అనుబంధం విడదీయలేనిది. నాన్న అసెంబ్లీ వద్ద కాంట్రాక్టు పనులు చేసేవారు. నేను బాలానందంలో  ప్రోగ్రాం ఇవ్వడానికి ప్రతి శనివారం వెళ్లేదాన్ని. సరదాగా చేసినా.. ఈ ప్రోగ్రామ్స్‌తో వచ్చిన డబ్బుతో.. ఒక నిఘంటువు కొనుక్కున్నాను. ఇప్పటికీ అది పదిలంగా దాచుకున్నాను. బాలానందం ప్రోగ్రాం అయిపోగానే అమ్మ  ఆ పక్కనే ఉన్న జామ్‌జామ్ హోటల్‌కు తీసుకెళ్లేది. ఇప్పటికీ అక్కడే ఉంది. అక్కడ చాయ్, మస్కాబన్ ఇప్పించేది. ఇప్పటికీ ఆ రుచి మరచిపోలేదు. అట్నుంచి రోడ్డు దాటి అసెంబ్లీకి వెళ్లేదాన్ని. అక్కడ హోటల్‌లో కోల్డ్ కాఫీ స్పెషల్. నేను రావడమే ఆలస్యం.. నాన్న కోల్డ్ కాఫీ ఆర్డరిచ్చేవాడు. అసెంబ్లీ పక్కనే ఉన్న పబ్లిక్ గార్డెన్స్‌లో బాలభవన్ ఉండేది. అక్కడే పెయింటింగ్, డాల్‌మేకింగ్, మ్యూజిక్ నేర్చుకున్నాను.
 
 జాగ్రఫీ చాలా ఇష్టం
  ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ. మా క్లాస్‌లో 20 మందిమే ఉండేవాళ్లం. బుద్ధిమంతుల్లా కనిపించినా.. అల్లరి చేయడంలో ఎవరికి వారే సాటి. జాగ్రఫీ క్లాసంటే బాగా ఇష్టం. ఆ టైంలో ఎవరు అల్లరి చేసినా కోపం వచ్చేది.
 
 క్లిక్ క్లిక్.. నో ఫియర్!
 ఆకాశవాణీలో ఎప్పుడో బ్యాంకు అధికారి నన్ను చూశారట. స్టేట్‌బ్యాంకు యాడ్‌లో నన్ను తీసుకోవాలనుకున్నారు. అడ్రస్ వెతుక్కుంటూ వచ్చారు. ఆకాశవాణిలో షూట్ చేశారు. కొత్త కదా. ఇలా... అలా అంటూ సలహాలి చ్చారు. తర్వాత వాళ్లే.. ఏంటీ జంకూ బొంకూ లేకుండా అదరగొట్టేశావ్ అన్నారు. ఈ కలివిడితనం సిటీలైఫే నేర్పింది. అదే నా కెరీర్‌కు ప్లస్ అయింది. ఆ తర్వాత హెయిర్ ఆయిల్ యాడ్.. ఇంకెన్నో యాడ్స్‌లో నటించే అవకాశం. విజేత సీరియల్ మరో అవకాశం. అందులోని ఏడుపు సీన్.. గ్లిజరిన్‌తో లాగించేయమన్నారు. కానీ సహజసిద్ధమైన యాక్టింగ్ కోసం సీటీలో డిఫరెంట్ ట్రెండ్స్ అధ్యయనం చేశాను. కనుపాపల్లో నీళ్లూరించే గాధలు విన్నాను. ఆనందం పంచే అనుభవాలు తెలుసుకున్నాను.
 
 అవర్‌ప్లేస్ అంటే ఇష్టం..
 సిటీ టేస్ట్ విషయానికి వస్తే.. బిర్యానీ అంటే ప్రాణం. రుచి కోసం ఒకసారి 12 హోటళ్లకు వెళ్ళాను. అన్నమైనా మానేస్తాను కానీ.. బిర్యానీ ఎంతైనా తినేస్తాను. బంజారాహిల్స్‌లోని అవర్‌ప్లేస్ నాకు బాగా సూట్ అయింది. ఎంతగా అంటే.. అక్కడొకామె నాకోసం ఎదురుచూస్తుండేంది. ఈ రోజు ఇంకా ఝాన్సీ రాలేదేంటి? అని ఆరా తీస్తుంది. ప్యారడైజ్ బిర్యానీ లైక్ చేస్తాను. కరాచీ బేకరీలో బిస్కెట్లు... మొజాంజాహీ మార్కెట్‌లోని ఓ షాపులోని ఐస్ క్రీం చాలా చాలా ఇష్టం. అబిడ్స్‌లో డ్రెస్సులు కొనడం చిన్నప్పటి నుంచి ఇష్టం. గోల్కొండ పైదాకా వెళ్ళడం.. అక్కడి నుంచి ‘కెవ్వు...’ మంటూ కేకేయడం నాకు చిన్నప్పటి నుంచీ అలవాటు. కోటలో ఉండే దర్వాజాలు మరీ ఇష్టం. పెద్ద పెద్ద రాళ్లన్నా ఇష్టమే. రాళ్లను పగుల గొట్టకుండా ఇళ్లుకడితే.. ఆ ఇంటికి వెళ్లి చూడాలనిపిస్తుంది.
 
 గ్రేట్ కల్చర్
 భాగ్యనగరం అంటే భిన్నమైన జీవనశైలి. విభిన్నమైన వ్యక్తుల కలయిక. నగరంలో ఒక్కో ప్రాంతం ఒక్కో శైలికి ప్రతీక. అందులో పాతబస్తీ మరీ ప్రత్యేకం. తీరికలేని జీవితంలో.. సాంస్కృతిక ఆనవాళ్లు చెదిరిపోకుండా సిటీ తన గొప్పదనాన్ని చాటుకుంటుంది. కొందరు కావాలనో.. నోరు తిరగకో.. హైదరాబాడ్ అంటుంటారు. అలా ఎవరైనా అంటే.. సరిగ్గా ఉచ్ఛరించమని చెబుతాను.
 - వనం దుర్గాప్రసాద్
 ఫొటోలు : ఎస్.ఎస్.ఠాకూర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement