పడని కష్టం లేదు ఫూలన్‌దేవి. ముప్పై ఏళ్లుగా జైల్లోనే నళిని. ఇద్దరివీ పోలికలేని జీవితాలు. ఆ.. ఒక పోలిక ఉంది!! వీళ్లను కన్నీళ్లు పెట్టించిందీ.. కరడు కట్టించిందీ అయినవాళ్లే. ఫూలన్‌ని తండ్రి అమ్మేశాడు. నళిని.. భర్తను నమ్మేసింది! జైలుకు కాదు.. జీవితానికి బందీలు వీళ్లిద్దరూ.
పందొమ్మిదేళ్ల క్రితం ముప్పై ఏడేళ్ల వయసులో యూపీలోని మీర్జాపూర్ ఎంపీగా ఉన్నప్పుడు దుండగుల తుపాకీ గుండ్లకు బలైపోయారు ఫూలన్‌దేవి. అంతకు పదేళ్ల క్రితం తమిళనాడులో జరిగిన రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తన ఇరవై రెండవ యేట నుంచీ జైల్లోనే ఉంది నళిని. ఈ ఇద్దరూ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. రావడానికి పెద్ద విశేషం కూడా ఏమీ లేదు నిజానికైతే! యూపీలో కాంగ్రెస్ రాజకీయ నాయకుడొకరు ఫూలన్ మరణించిన జూలై 25వ తేదీన ‘వీరాంగన ఫూలన్‌దేవి’ అని ట్వీట్ చేశారు.
ఇరవై రెండు మంది అగ్రవర్ణాల వారిని నిలువునా కాల్చి చంపిన బందిపోటును వీరాంగన అనడం ఏమిటి అని ‘అగ్ర’హ జ్వాలలు రగిలాయి. నళిని కూడా పెద్దగా ప్రాముఖ్యానికి నోచుకోని ఒక కారణం వల్ల ఇటీవలే వార్తల్లోకి వచ్చి వెళ్లారు. జైల్లో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందనీ, లేదు.. ఆత్మహత్య బెదిరింపుతో జైలు అధికారులను బ్లాక్‌మెయిల్ చేసిందనీ రెండు మాటలు వచ్చాయి. ఎక్కడా కలిసినవాళ్లు, ఏ విధంగానూ కలిపి చూడ్డానికి వీల్లేనివాళ్లూ.. ఫూలన్ దేవి, నళినీ. అయితే మోసపోవడం అన్నది ఇద్దరి జీవితంలోనూ ఉంది. ఫూలన్‌ని దేవిదిన్ నిషాద్ మోసం చేశాడు. నళినిని శ్రీహరన్ మోసం చేశాడు. నిషాద్ ఫూలన్ తండ్రి. శ్రీహరన్ నళిని భర్త.
ఫూలన్ జీవితంలో అన్నీ పోరాటాలే. కాస్త పెద్ద మాటల్లో చెప్పాలంటే.. అణగారిన వర్గాల మహిళల సంక్షేమం కోసం పోరాటం. అగ్రవర్ణాల వారి దౌర్జన్యాలపై పోరాటం. సమాజంలోని అన్యాయాలు, అసమానతలపై పోరాటం. స్త్రీగా ఆమె పడిన కష్టాలే ఆమెను ‘వీరాంగన’ను చేశాయి. ఫూలన్‌ను పదహారేళ్ల వయసులో ఆమె పెదనాన్న కొడుకు ఆస్తి విషయమై అన్యాయంగా జైల్లో పెట్టించినప్పుడు మూడు రోజుల పాటు పోలీసులు ఆమెను చిత్రహింసలు పెట్టారు. చంబల్ లోయ బందిపోటు నాయకుడు ఆమెను అపహరించుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ముఠానాయకుల మధ్య చేతులు మారిన ప్రతిసారీ ఆమెపై లైంగిక దాడి జరిగింది. ఇవన్నీ కూడా ఆమె ఇరవయ్యవ యేటకే జరిగిపోయాయి. అన్నిటికన్నా ఆమె పడిన పెద్ద కష్టం పదకొండేళ్ల వయసులో! ఆ కష్టం తెచ్చిపెట్టింది బంధువులో, బందిపోట్లో, అగ్రవర్ణాల వారో కాదు.
సొంత తండ్రి!! పుట్టీలాల్ అనే వ్యక్తికి ఫూలన్‌దేవిని అమ్మేశాడు. ధర.. ఒక ఆవు, ఒక సైకిల్. తల్లి నెత్తీనోరు మొత్తుకుంటుంటే తండ్రి ఆమెను కొట్టి ఒక మూలకు నెట్టేయడం చూస్తూనే ఉంది ఫూలన్. ‘‘ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తాం! కోసుకుంటామా!!’ అని తన గురించి అనడమూ వింటూనే ఉంది. అంతలోనే పుట్టీలాల్ వచ్చి ఫూలన్‌ని భుజాన వేసుకుని వెళ్లిపోయాడు. అతడి నుంచి పారిపోయి రావడంతో ఫూలన్ జీవితంలో పోరాటం మొదలైంది. అవును. ఆ వయసుకు పారిపోవడం కూడా పోరాటమే. అదీ ‘భర్త’అనే వింత జీవి నుంచి. బాధ్యత చూపని తండ్రి నుంచి. ‘నేనొక్కదాన్నే కాదు. ఇంకా చాలామందే ఉన్నారు నాలాంటి వాళ్లు’.. ఇదీ ఫూలన్.. తన బయోగ్రఫీ రాయడానికి 1983–94 మధ్య జైలుకు వచ్చి కలిసిన మాలాసేన్‌తో తొలిరోజు అన్నమాట. మాలాను పూలన్.. ‘దీదీ’అనేవారు. ఫూలన్ బతికి ఉంటే నళినికి ఇప్పుడు ఆమె ‘దీదీ’ అయి ఉండేవారేమో.. ఇరవై తొమ్మిదేళ్లుగా జైల్లో ఉన్న నళినిని విడిపించడానికి ఢిల్లీ నుంచి ఓ చిన్న పోరాటమో, పెద్ద ప్రయత్నమో చేసి.
నళిని జీవిత చరిత్ర కూడా పుస్తకంగా వచ్చింది. ‘రాజీవ్ హత్య : హత్య వెనుక నిజాలు, ప్రియాంక–నళిని సమావేశం’ అనే ఆ పుస్తకాన్ని ఏకలైవన్ అనే రచయిత తమిళ్‌లో రాశారు. ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో అరెస్ట్ అయ్యే నాటికే నళిని రెండు నెలల గర్భవతి. శ్రీహరన్‌తో ప్రేమబంధం గురించి పుస్తకంలో ఉంది. అయితే ఒకటి మాత్రం వాస్తవం. శ్రీహరన్ ఒక ధ్యేయంతో నళిని ప్రేమించాడు. నళిని ఆ ప్రేమలో పడిపోయి, అతడితోపాటు విలువైన జీవితాన్ని జైలుపాలు చేసుకుంది. జైల్లోనే కూతుర్ని ప్రసవించింది. కూతురి పెళ్లి చేయడానికి పెరోల్ కోసం తిప్పలు పడింది. ఊహించని విధంగా శ్రీహరన్ ఆమె జీవితంలోకి ప్రవేశించి అంతా అస్తవ్యస్తం చేశాడు.
అయితే ఇప్పటికీ ఆమె.. ‘‘రక్తాన్ని దాహంగొన్న తోడేళ్ల మధ్యలోకి మేము వెళ్లిపోయాము’’ అని అంటోందే తప్ప భర్తను, భర్త ప్రేమను తప్పుప ట్టడం లేదు! నళిని తల్లి పద్మావతి. మద్రాసులోని ఓ ఆసుపత్రిలో ఆమె నర్సుగా ఉన్నప్పుడు శ్రీలంక తమిళుడైన శ్రీహరన్ అద్దెకు ఇల్లు వెతుక్కుంటూ వచ్చి, వీళ్ల ఇంటి పక్కన చేరాడు. కొద్దిరోజుల తర్వాత ‘ఒంటి కన్ను’ శివరాసన్ వచ్చి శ్రీహరన్ రూమ్‌మేట్ అయ్యాడు. ఆ వెంటనే ‘థను’ (మానవబాంబు) వచ్చి చేరింది. ఇదంతా జరుగుతున్నప్పుడే నళిని, శ్రీహరన్ ప్రేమలో పడ్డారు. స్త్రీ జీవితంలోని కల్లోలానికి ప్రతీకలైన రెండు పేర్లు ఫూలన్, నళిని. నిన్న (ఆగస్టు 10) ఫూలన్ దేవి జయంతి. నళినికి జీవితంలో ఎప్పటికీ మరపునకు రాని రోజు మాత్రం మే 21. రాజీవ్ గాంధీ.. హత్యకు గురైన రోజు అది.
Comments
Please login to add a commentAdd a comment